ఆరోగ్యం / జీవన విధానం

ఆదిలాబాద్ గిరిజనలకు గ్రామాలలో మహిళా సాధికారత

0

ఆదిలాబాద్ గిరిజనలకు గ్రామాలలో మహిళా సాధికారత మరియు పోషక వైవిధ్యాన్ని ప్రోత్సహించడం

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 76.34%  గ్రామీణ జనాభా ఉన్నది, వీరిలో గిరిజనులు అత్యధికం. వీరు  ప్రధాన ఆహార పంటలు  జొన్న, సజ్జలు, రాగులు, గోధుమలు మరియు ఇతర చిరుధాన్యాలు పండిస్తారు . తెలంగాణ  రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 76.34%  గ్రామీణ జనాభా ఉన్నది, వీరిలో గిరిజనులు అత్యధికం. గిరిజన ప్రాంతా.  వీటితో పాటు  కందులు, పెసర్లు, శనగ, సోయాబీన్ మొదలగునవి కూడా పండిస్తారు. జిల్లా లో పత్తి మరియు సోయాబీన్ ముఖ్యమైన వాణిజ్య పంటలు. తెలంగాణ రాష్ట్రంలో  సుమారు 0.24  మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో  సోయాబీన్ సాగు చేస్తున్నారు తద్వారా  సుమారు 0.25  మిలియన్ టన్నుల  సోయాబీన్ ఉత్పత్తి  చేస్తున్నారు.  రాష్ట్రం మొత్తం సోయాబీన్ సాగు విస్తీర్ణంలో  ఆదిలాబాద్ జిల్లా  వాటా 39.6%  మరియు ఉత్పత్తి లో 38.2%. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమైన వనరులు మరియు అధిక పోషకాహార పంటలను పండించినప్పటికీ జిల్లాలో పోషకాహార లోపాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అంచనాల ప్రకారం జిల్లా గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు  మరియు ఐదు సంవత్సరాల లోపు చిన్నపిల్లల్లో  పోషకాహార లోపాలు అధికంగా గుర్తించడం జరిగింది.  ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలలో  సుమారు 35.8%  మంది  వయస్సుకు తగ్గ బరువు లేరు, అలాగే  సుమారు 38.3%  చిన్నపిల్లలు  వయసుకు తగ్గ ఎత్తు కూడా లేరు మరియు 60%  పైగా ఆడవాళ్ళు  రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు.

జిల్లాలో పోషకాహార లోపాలు అధిగమించాలంటే ముఖ్యంగా చిరుధాన్యాలు, జొన్నలు మరియు సోయాబీన్ తో తయారుచేసిన  మిల్లెట్ – సోయా  ఆధారిత ఆహార పదార్థాల  తయారీ  మరియు వినియోగం పైన  గిరిజన ప్రాంతాల రైతులకు మరీ  ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించడం అవసరమని గుర్తించాము.  మిల్లెట్స్-  సోయా తో తక్కువ ఖర్చుతో బలవర్ధకమైన ఆహార పదార్థాలను తయారీ మరియు వినియోగము పైన అవగాహన కల్పించడం ద్వారా  చిన్నపిల్లలు, మహిళలూ మరియు గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోపాలను  అధిగమించడానికి ఆస్కారముందని కే. వి. కే. ఆదిలాబాద్ శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది.

చాలా గిరిజన గూడెం లు  మారుమూల ప్రాంతాల్లో ఉండటం  వలన  వారికి   పిండి మిల్లులు అందుబాటులో లేకపోవడం వలన వాళ్లు పండించే పంటలను సరిగా వినియోగించుకోవడం లేదు.  ముఖ్యంగా వారు పండించే పంటలు జొన్న,  చిరుధాన్యాలు మరియు సోయాబీన్ ను ఆహారంగా తీసుకోవడం లేదు.  గిరిజన ప్రాంతాలలో ఆహారపు అలవాట్లలో మార్పు రావడం వలన  చాలామంది పూర్వకాలపు ఆహార పదార్థాల నుండి  ఆధునిక కాలంలోని  బాగా పాలిష్ చేసిన  బియ్యం ను అన్నం గా వండుకొని తింటున్నారు. దీని వలన పోషకాహార లోపాలు మరింత అధికమయ్యాయి. జొన్నలు, చిరుధాన్యాలు మరియు  సోయాబీన్ యొక్క పోషక విలువలతో పాటు, వాటిని తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పైన ఎలాంటి అవగాహన లేకపోవడం వలన  గిరిజనులు వాటిని తినడం తగ్గించారు.  చిరుధాన్యాలు – సోయాబీన్  తో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం ద్వారా  చక్కెర వ్యాధి,  రక్తహీనత,  గుండె సంబంధిత వ్యాధులు,  స్థూలకాయత్వం  వంటివి రాకుండా  ఉపయోగపడతాయని కూడా అవగాహన లేదు.

ఆదివాసి గిరిజన  గూడెంలలో జొన్నలు, రాగులు, సజ్జలు మరియు ఇతర చిరుధాన్యాలను ప్రధాన ధాన్యాల కన్నా  ఎక్కువగా పండిస్తారు.  వరి, గోధుమ ల కన్నా  జొన్నలు, చిరుధాన్యాల లో  అధిక పోషక విలువలు ఉంటాయి.  సోయాబీన్ ను వాణిజ్య పంటగా పండిస్తారు  కానీ  పోషక విలువలు మరియు ప్రయోజనాల పైన అవగాహన లేదు. సోయాబీన్ అతి ముఖ్యమైన  విరివిగా అధిక మొత్తంలో లభించే  ప్రధాన ప్రోటీన్ వనరు  అన్న విషయం వారికి తెలియదు.

చిరు ధాన్యాలను తీసుకోవడం ద్వారా  కలిగే అదనపు  ఆరోగ్య ప్రయోజనాలు  ముఖ్యంగా వీటిలో అధిక మొత్తంలో పీచు పదార్థం,  గ్లూటెన్ ఫ్రీ ప్రోటీన్లు, తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్  మరియు ఇతర  బయో యాక్టివ్ సమ్మేళనాలు  కూడా అధికంగా ఉంటాయి.  జొన్నలు మరియు చిరుధాన్యాల లో సగటు కార్బోహైడ్రేట్ల  56.88-72.97% , ప్రోటీన్లు 7.5-12.5%  మరియు కొవ్వు పదార్థాలు 1.3 -6.0%  ఉంటాయి.  అంతేకాకుండా అతి ముఖ్యమైన పీచుపదార్థం, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు కూడా విరివిగా దొరుకుతాయి.

గిరిజనులు సాధారణ పద్ధతిలో దేశీయ రకాలను సాగు చేయడం ద్వారా జొన్నలు మరియు చిరుధాన్యాలు రుచికి తియ్యగా ఉంటాయి. రసాయన ఎరువులు  మరియు తక్కువ క్రిమిసంహారక  మందులు తక్కువ మోతాదులో వాడుతారు.  కొంత మంది రైతులు పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తారు. ఇక్రిసాట్ వారు  జొన్నలు మరియు చిరుధాన్యాలతో చేసిన  ఆహార ఉత్పత్తులను  స్మార్ట్ ఫుడ్స్ గా పేర్కొంటారు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి మంచివి, ప్రకృతిని విషతుల్యం చేయదు  మరియు తక్కువ వనరులతో పండించవచ్చు. మార్కెట్ లో  వీటికి మంచి ధర ఉంది  తద్వారా అధిక లాభాలను రైతులు పొందవచ్చు. అందుకనే  జొన్నలు మరియు చిరుధాన్యాలను స్మార్ట్ ఫుడ్స్  లేదా న్యూట్రి సీరియల్  అని కూడా పిలుస్తారు.

ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు, లాభాలు ఉన్నప్పటికీ  గిరిజనులు  జొన్న మరియు చిరుధాన్యాలను  సరిగా తీసుకోవడం లేదు. తద్వారా పోషకాహార లోపాలు  జిల్లాలో అధికంగా కనిపిస్తున్నాయి. పాలిష్డ్ రైస్ అందుబాటులో  ఉండటం,  ఆదివాసి  గూడెంలో  పిండి మిల్లు వంటి సౌకర్యం  అందుబాటులో లేకపోవడం వలన  పక్కన ఉన్న గ్రామాలకు మరియు  మండల  కేంద్రాలలో ఉన్న  పిండి గిర్ని  ఉన్నచోటకు గిరిజనులు వెళ్లాల్సి వస్తుంది.

ప్రాజెక్టు నిర్వహణ సర్వే: మహిళా సాధికారిత, స్థానిక ఆహార పంటలను ప్రోత్సహించుట మరియు పోషకాహార సమస్యలను అధిగమించడం కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్  శాస్త్రవేత్తలు మారుమూల  ఆదివాసి గ్రామాలలో సర్వే చేపట్టడం జరిగింది.  గ్రామాలలో పనిచేస్తున్న నిర్మాణాత్మక సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామీణ మహిళలు, ఆదివాసి గ్రామ పటేల్, స్థానిక వైద్యులు, ఇతర గ్రామ పెద్దల నుండి  వైవిధ్యమైన సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించడం జరిగినది.

సర్వే ద్వారా ఈ క్రింది  అంశాలను పరిగణలోకి తీసుకొని  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఆ దశగా పనిచేయడం ప్రారంభించారు:

  1. స్థానికంగా పండిస్తున్న జొన్నలు మరియు చిరుధాన్యాలను గిరిజనులు తినకుండా మార్కెట్లో అమ్ముతున్నారు.
  2. ఎక్కువగా పాలిష్ చేసిన బియ్య్యం వండుకొని తింటున్నారు.
  3. జొన్నలు మరియు చిరుధాన్యాలను ప్రాసెస్ చేయడానికి కావలసిన పిండి గిర్నీ అందుబాటులో లేకపోవడం వలన 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర గ్రామాలు మరియు మండల కేంద్రాలలోని పిండి గిర్నీ కోసం కాలినడక లేదా ఆటోలలో వెళుతున్నారు.
  4. ఇంకా ఆదివాసి గ్రామాలలో పిండిని ఇసురు రాయితో తయారు చేసుకుంటున్నారు. దీనికోసం అధిక సమయం, శక్తిని మహిళలు వృధా చేసుకుంటున్నారు.
  5. ఆదివాసీలు పండించే స్థానిక పంటలతో బలవర్ధకమైన ఆహారం తయారు  చేసుకునే  పద్దతుల పైన అవగాహన లేదు.

పైన తెలిపిన  సమస్యలను అధిగమించడం కోసం  ఆదివాసీలు వారు పండించిన పంటల నుండి  బలవర్ధకమైన ఆహార పదార్థాలు  మరియు వారి  పూర్వపు సాంస్కృతిక ఆహారపు అలవాట్లు  పెంపొందించే దిశగా కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ 17  ఆదివాసి గ్రామాలలో మల్టీ పర్పస్ ప్రాసెసింగ్ మిల్లును ఏర్పాటు చేయడం జరిగినది. తద్వారా  గ్రామం ఒక యూనిట్ గా  గ్రామంలోని కుటుంబాల అందరికీ  సమతుల్య ఆహారము  మరియు స్థానిక ఆహార పంటల ద్వారానే  వివిధ పోషక ఆహార పదార్థాలను  తయారు చేసుకోవడం  పైన శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలను  ఏర్పాటు చేయడం జరిగినది.

గ్రామస్తులు అందరి సమక్షంలో  గ్రామ తీర్మానం చేసి,  గ్రామంలోని ఒక మహిళకు  బహుళార్థక  ప్రయోజనాలున్న  మిల్లును  ఇవ్వడం జరిగినది. తద్వారా గ్రామంలోని  కుటుంబాల అందరికీ  పిండి పట్టించవచ్చు, మసాలా దినుసులతో పొడులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పప్పు  వంటివి  మార్పిడికి  కేజీకి  నిర్ణీత ధర  నిర్ణయించడం జరిగినది.  గ్రామంలోని 50-80  కుటుంబాలు  నిరంతరం పిండి మిల్లు ను  వాడుకునే విధంగా  ప్రోత్సహించడం జరిగినది. ప్రతి నెలా మిల్లు ద్వారా సుమారు 3200 నుండి 3800  రూపాయల నికర ఆదాయం మిల్లు ఆపరేటర్ కు వస్తుంది.  గ్రామాలలో జరుపుకునే సామూహిక  పండుగ  సమయంలో  ఈ మిల్లు ను ఉచితంగా  వాడుకోవచ్చు, అని కూడా తీర్మానించడం జరిగినది.

వివిధ శిక్షణా కార్యక్రమాలు:

కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు  ఆధునిక వ్యవసాయ  సాంకేతిక అంశాలపై నా,  సస్యరక్షణ,  పంట కోత  మరియు పంట కోత నా అనంతరం సమయంలో తీసుకోవలసిన  జాగ్రత్తల పైన  వివిధ శిక్షణ కార్యక్రమాలను, క్షేత్ర స్థాయి ప్రదర్శనలు, ప్రథమ శ్రేణి ప్రదర్శనలు  వంటివి  ఈ పదిహేడు గ్రామాలలో  ఏడాది పొడవునా నిర్వహించడం జరిగినది.  అంతేకాకుండా  పోషకాల లభ్యత, బలవర్థకమైన పోషక పదార్థాలు తయారు చేసుకోవడం,  వివిధ వయసుల వారికి కావాల్సిన పోషకాలు ముఖ్యంగా చిన్నపిల్లల్లో, కిశోర బాలికల లో పోషకాహార లోపాలను అధిగమించడానికి స్థానిక పంటల అవసరం పైన  వివిధ శిక్షణ కార్యక్రమాలను  ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన ఉప ప్రణాళిక (TSP) కింద  గిరిజన మహిళలకు మరియు  గిరిజన యువకులకు  ఎంటర్ప్రెన్యూర్షిప్  డెవలప్మెంట్  ప్రోగ్రాం (EDP) ను కూడా  ఏర్పాటు చేసి  స్థానికంగా పండే పంటలకు  విలువ జోడించడం,  బలవర్థకమైన పోషక ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం,  వివిధ రకాల ధాన్యాలు నిల్వ చేసుకోవడంవంటి అంశాల పైన కూడా నైపుణ్య  శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది.

ఆదివాసి గ్రామాలలో పండించే వాణిజ్య పంట అయిన సోయాబీన్  నుండి వివిధ ఆహార పదార్థాలను తయారు చేసుకుని తిన్నట్లయితే  పోషకాల సమస్యలను అధిగమించవచ్చని క్షేత్ర ప్రదర్శన ద్వారా  6  అంగన్వాడీ కేంద్రాల  నుండి  మూడు  సంవత్సరాల వయసున్న 36 మంది పిల్లలకు  చిరుధాన్యాలు, గోధుమలు, పెసర్లు  మరియు సోయాబీన్ తో  అధిక శక్తి గల  మాల్టెడ్ ఫుడ్  తయారుచేసి  90 రోజులపాటు, రోజుకు 40 గ్రాములు  చొప్పున  ఆహారాన్ని 36 మంది  పిల్లలకు తినిపించి,  రోజువారి ఎత్తు-బరువుల ను  పరీక్షించూస్తే, 90  రోజుల తర్వాత  అధిక శక్తి గల మాల్టెడ్ ఫుడ్ తిన్న  పిల్లలు ఆరోగ్యకరంగా బరువు మరియు ఎత్తులో పెరుగుదలను గమనించడం జరిగింది. తద్వారా ఆదివాసి మహిళలు, తెలుసుకున్నది ఏమిటంటే చిరుధాన్యాలు మరియు ఇతర పప్పులు మరియు సోయాబీన్ తో మాల్టెడ్ ఫుడ్డు  చేసుకొని తిన్నట్లయితే  ఆరోగ్యంగా ఉంటారని  ప్రత్యక్షంగా గమనించడం జరిగినది.

ఇది ప్రయోగపూర్వకంగా  నిరూపితం కావడం వలన  గిరిజనులు  వారు స్థానికంగా పండించే ఆహార పంటలు  ఎంతో బలవర్ధకమైవని గ్రహించారు. బహుళార్థసాధక ప్రాసెసింగ్ మిల్లు ఏర్పాటు చేయడం కాలానుగుణంగా స్థానికంగా  పండించే ఆహార పంటలు జొన్నలు , చిరుధాన్యాలు, గోధుమలు, పప్పు ధాన్యాలు, సోయాబీన్ వంటివి నిత్యం ఆహారంగా తీసుకొని పోషకాహార సమస్యల నుండి బయట పడాలని  కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్ వారు గిరిజన ఉప ప్రణాళిక   క్రింద 16  కృషి విజ్ఞాన కేంద్రం దత్తత  గ్రామాలలో గిరిజన ఉప ప్రణాళిక కింద సుమారు 5,10,000 రూపాయలతో  బహుళార్థసాధక ప్రాసెసింగ్ మిల్లులను 16 ఆదివాసి  గ్రామాల్లో ఏర్పాటు చేయడమైనది.  తద్వారా 16 మంది  ఆదివాసి మహిళలు  జీవనోపాధి పొందుతున్నారు మరియు ఈ పథకం ద్వారా సుమారు వెయ్యి కుటుంబాలు ప్రత్యక్షంగా  లబ్ధి పొందుతున్నాయి.

బహుళార్థసాధక ప్రాసెసింగ్ మిల్లు  యొక్క ప్రయోజనాలు:

 కోవిద్ 19 , కష్టకాలంలో భారత ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత ఆదివాసి గ్రామాల్లో నివసిస్తున్న  ప్రజలు ఎవరు గ్రామం దాటి  ఇతర గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదు.  ఇలాంటి కరోనా కష్టకాలంలో 16  ఆదివాసి గ్రామాలలో  బహుళార్థసాధక  మిల్లు కె.వి.కె వారు ఏర్పాటు చేయడం వలన   ఆదివాసిలందరూ  మిల్లును  వాడుకొని  వారికి కావలసిన ఆహార ధాన్యాలను ప్రాసెస్ చేసుకోగలిగారు.

  1. స్థానికంగా పండించే అన్ని రకాల పంటలను తక్కువ ఖర్చుతో గృహ వినియోగం కోసం ప్రాసెసింగ్ చేసుకోవచ్చు.
  2. సుమారు వెయ్యి కుటుంబాలు మరియు 5000 ఆదివాసి గిరిజనులకు ఉపయోగపడుతుంది.
  3. అత్యంత పోషక విలువలు కలిగిన స్థానిక ఆహార పంటలను గిరిజనులు గృహ వినియోగానికి వాడుకుంటున్నారు
  4. ఆదివాసీ గిరిజనులు 5 నుండి 10 కిలోమీటర్ల దూరానికి వెళ్లవలసిన అవసరం లేదు.
  5. స్థానికంగా పండించే ఆహార పంటలతో అధిక రుచికరమైన మరియు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తయారు చేసుకుంటున్నారు.
  6. మహిళలు మాల్టెడ్ ఫుడ్, మల్టీ గ్రీన్ ఆట, కాంపోజిట్ ఫుడ్  వంటివి తయారు చేసుకోవడం నేర్చుకున్నారు.
  7. మసాల దినుసులు, కారం పొడి, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటివి కొనుక్కోకుండా వారే తయారు చేసుకుంటున్నారు.

ఈ క్రింది గ్రామాలలో కల్తీ లేని ఆహార పదార్థాలను స్థానికంగా తయారు చేసుకోవడం పైన అవగాహన కలిపించడం జరిగినది.

వివిధ గ్రామాల వారిగా లబ్ది దారులు మరియు నెల వారిగా మిల్లు ద్వారా ప్రాసెస్ చేస్తున్న వివరాలు

క్ర. సం. లబ్దిదారుడి పేరు గ్రామం మండలం గిరిజన కుటుంబాల సంఖ్య నెలకు మిల్లు  ద్వారా ప్రాసెస్ చేస్తున్న  కిలోలు
1 పుర్క లచ్చు మార్గ గూడా ఇంద్రవెల్లి 70 610
2 ఆయు రావు సాలె గూడ ఇంద్రవెల్లి 60 540
3 పెందూర్ మధుకర్ షేక్ గూడా తలమడుగు 50 580
4 మెస్రం రేఖ రాజుగాడు భీంపూర్ 140 950
5 గేడం రాంజీ భగవాన్ పూర్ భీంపూర్ 50 650
6 మడావి జంగుబాయి మార్క గూడా భీంపూర్ 70 770
7 జోగినాథ్ విష్ణు బాది గూడా సిరికొండ 60 780
8 ఆత్రం అశోక్ అంబు గావ్ తాంసీ 110 850
9 మెస్రం లక్ష్మణ్ లింగ గూడా తాంసీ 120 980
10 ప్రభు పాట గూడ ఇంద్రవెల్లి 70 510
11 ఆదివాసి బీమ్ బాయ్

కో-ఆపరేటివ్ సొసైటీ

ఉట్నూర్ ఉట్నూర్ 35 250
12 మెస్రం మారుతి రావు సకినా పూర్ తలమడుగు 45 450
13 హనుమంతరావు గొట్టి ఉట్నూర్ 43 380
14 సోము తుకారాం నగర్ ఉట్నూర్ 65 580
15 ఆత్రం గంగారాం కామాయి పేట ఉట్నూర్ 120 870
16 శేషేరావు రాయి గూడ సిరికొండ 60 640

సూచనలు

  1. ఆదివాసి మారుమూల గ్రామాలలో బహుళార్థక మిల్లును ఏర్పాటు చేయడం ద్వారా వైవిధ్యమైన పోషకాహార పదార్థాలను స్థానికంగా పండించిన పంటల ద్వారా తయారు చేసుకోవడం గిరిజనులకు సులభమవుతుంది. తద్వారా వారి ఖర్చులు తగ్గి  మంచి నాణ్యమైన  పోషకాహారం  అన్ని వేళలా లభిస్తుంది.
  2. మిల్లు వారి గ్రామంలోనే ఉండటం ద్వారా సమయము ఆదా అవుతుంది. మహిళలకు శ్రమ తగ్గుతుంది.
  3. మహిళలకు శ్రమ తగ్గి మరియు సమయం ఆదా కావడం వలన వారు ఎక్కువ సమయం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై అవకాశం ఉన్నది. అది వారి యొక్క వ్యవసాయ దిగుబడులు పెంచడానికి ఉపయోగపడుతుంది.
  4. మహిళా సంఘాల ద్వారా కూడా వాణిజ్యపరంగా చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక పంటలక విలువ జోడించినట్లయితే మహిళలకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

ఎ. పోశాద్రి , యం. సునీల్ కుమార్,  ఎ. రమాదేవి, జి. శివ చరణ్,

యం. రఘు వీర్,వై. ప్రవీణ్ కుమార్

కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్.

 

 

Leave Your Comments

ఏరువాక పౌర్ణమి

Previous article

జులై మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనులు

Next article

You may also like