Benefits of Safflower Farming: కుసుమ మన రాష్ట్రంలో 47,500 ఎకరాల్లో నల్లరేగడి నేలలందు వర్షాధారపు రబీ పంటగా రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, కర్నూల్, ఆదిలాబాద్, అనంతపురం మరియు కడప జిల్లాల్లో సాగుచేయబడుతున్నది. ప్రస్తుత రాష్ట్ర ఉత్పత్తి 8,000 టన్నులు, సరాసరి దిగుబడి ఎకరాకు 174 కిలోలు. వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిని నష్టపోతే, కుసుమ మంచి ప్రత్యామ్నాయ రబీ పంట. కొద్దిపాటి క్షారత్వం గల సమస్యాత్మక భూముల్లో కుసుమను లాభదాయకంగా పండించవచ్చు. అడవి పందుల బెడద ఎక్కువగా వున్న ప్రాంతాల్లో కుసుమను నిర్భయంగా సాగు చేసుకోవచ్చు.
ఔషధ గుణాలు:
కుసుమ పంట ఒక సాధారణ నూనె గింజ పంటగానే కాకుండా అందులోని బహుళ ప్రయోజనకర ఔషధగుణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఒక ఆసక్తికరమైన అంశంగా గుర్తింపు పొందింది. గడచిన కొద్ది సంవత్సరాల నుండి వివిధ దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కుసుమ పూరేకులలోని ఔషధగుణాల గురించి ఆసక్తికరమైన పరిశోధనలను చేపడుతూ విస్మయపరిచే ఫలితాలను వెలుగులోనికి తెస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బోటనీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బీజింగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు అంతర్జాతీయ కుసుమ సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాలలో కుసుమ సాగు విధానాలు మరియు వాటి ఉప ఉత్పత్తులైన పూరేకుల వినియోగం మొదలైన అంశాలను లోతుగా విశ్లేషించడం జరిగింది. 90వ దశకం నుండి అఖిల భారత సమన్వయ కుసుమ పరిశోధనా కార్యక్రమము చేపడుతున్న తాండూరు, ఫల్టాన్ మరియు ఇండోర్ పరిశోధనా స్థానాలు కూడా కుసుమ పూరేకులపైన పరిశోధన మరియు వాటి వినియోగంపైన అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశాయి.
- కుసుమ పూరేకులలో చేసిన హెర్బల్ టీలో శరీర పోషణకు అవసరమయ్యే మోతాదులో అమైనో ఆమ్లాలు, ధాతువులు, బి1, బి2, బి12, సి మరియు ఇ విటమిన్లు విరివిగా ఉన్నట్లుగా వివిధ పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
- కుసుమ పూతలో పసుపు రంగు కారకము ముఖ్యమైన మూల పదార్థంగా పరిగణింపబడుతుంది. ఇది స్థిరమైన స్వభావాన్ని కలిగి వుంటుంది. కొద్ది మోతాదులో ఎరుపు రంగు కారకము కూడా వున్నప్పటికీ, అస్థిరమైన స్వభావంవల్ల త్వరగా రంగు వెలిసిపోతుంది.
- చాలా చికిత్సా పరిశోధనలు కుసుమ పూరేకులు ఆడవారిలో ఋతుక్రమాన్ని క్రమబద్దీకరించడం, హృద్రోగాలు (కార్డియో వాస్కులార్ డిసీజెస్) నొప్పులు మరియు వాపులు మొదలైన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి సహాయకారిగా వుంటుందని తెలియజేస్తున్నాయి.
- చాలా రకాల అలర్జీలను తగ్గిస్తుంది.
Also Read: ఆంతురియం పూల సాగులో మెళకువలు
- కుసుమ సంబంధిత ఔషధాలకు గుండె నుండి రక్తాన్ని తీసుకుపోయే ధమనులను వ్యాకోచింపజేసే గుణం వుంది. దీనివల్ల రక్తప్రసరణ సాఫీగా సాగి, కణజాలాలకు అవసరమయ్యే మోతాదులో ఆక్సిజన్ అందుతుంది. అంతిమంగా రక్తపోటు అదుపులో వుంటుంది.
- కుసుమ పూరేకుల టీ మెదడులో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా కాలక్రమేణా మెదడులోకాని, రక్తనాళాల్లోకాని గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది.
- ఒక పరిశోధనలో హృద్రోగంతో బాధపడుతున్న రోజులలో 83% మందికి 6 వారాల చికిత్స తర్వాత రక్తంలో కొలెస్ట్రాల్ శాతం గణనీయంగా తగ్గినట్లు తేలింది.
- కుసుమ రేకులతో నాలుగు వారాల చికిత్స అనంతరం రక్తపోటు సాధారణ స్థితికి వచ్చినట్లు పరిశోధనా ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
- కుసుమ పూరేకులు మగవారిలో మృత శుక్రకణాలను తగ్గించడం ద్వారా వ్యంధత్వాన్ని నివారిస్తుంది.
- ఒక పరిశోధనలో కుసుమ పూరేకుల చికిత్సవల్ల పెళ్ళయి ఒకటిన్నర నుండి పది సం.ల వరకు సంతాన సాఫల్యం పొందని 77 మంది స్త్రీలలో 56 మంది గర్భం దాల్చడం జరిగింది.
- కుసుమ పూరేకులు సుఖప్రసవానికి సహాయకారిగా వుంటుంది.
- కుసుమ పూరేకులతో తయారుచేసిన వైన్ దాదాపు 62 రకాల కీళ్ళ నొప్పులను (రుమాటిసమ్) తగ్గిస్తుంది.
- దీర్ఘకాలంగా పీడించే శ్వాసకోశ సంబంధ వ్యాధులను కుసుమ పూరేకులతో సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చును.
- కడుపులో మంట (గ్యాస్ట్రెటిస్) తో బాధపడుతున్న రోగులలో కుసుమ పూరేకుల చికిత్స వల్ల ఉపశమనం కలిగినట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
- మూత్రకోశ వ్యాధులతో (క్రానిక్ నెఫ్రెటిస్) బాధపడుతున్న రోగులకు చికిత్సలో ప్రయోజనకారి.
- మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది. స్పాండిలైటిస్ (మెడనొప్పిని) తగ్గిస్తుంది.
- ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండటం వల్ల కుసుమ పూరేకుల వినియోగంపై రైతులలో మరియు సాధారణ ప్రజానీకంలో ఇటీవల కాలంలో మంచి అవగాహన ఏర్పడుతూ వుంది.
Also Read: అశ్వగంధ సాగు విధానం..