Healthy Ragi Recipes:
రాగి అంబలి
కావలసిన పదార్థాలు :
రాగిపిండి : 1/2 కప్పు, ఉప్పు : తగినంత. ఉల్లి : 1/2 కప్పు, తరిగిన కొత్తిమీర : 2 స్పూన్స్, మిరపకాయలు 1 స్పూన్, మజ్జిగ : 2 కప్పులు, కరివేపాకు : 1 రెమ్మ
తయారీ విధానం :
ఒక కప్పు నీళ్లలో అరకప్పు రాగిపిండి జారుగా కలుపుకొని మరుగుతున్న అర లీటరు నీళ్లలో పోసుకుని బాగా కలుపుకుని 6-7 నిమిషాలు బాగా ఉడక పెట్టుకోవాలి. ఉడుకుతున్నంత సేపు ఉండకట్టకుండా కలియపెడుతూనే ఉండాలి. చల్లారిన తరువాత మజ్జిగ, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయలు తరుగు, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు కలుపుకుని కుండలో పెట్టుకుని, త్రాగితే ముఖ్యంగా వేసవి తాపానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనికి కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ అంబలి సజ్జ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు.
రాగి జావ (మాల్ట్)
కావలసిన పదార్థాలు :
రాగి పిండి : 1 కప్పు బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి : 1/2 స్పూన్, బాదంపప్పు, పిస్తా : సరిపడినన్ని, పాలు : 1 కప్పు
తయారీ విధానం :
రాగులు మొలకెత్తించి ఎండపెట్టి పొడిచేసి పెట్టుకుంటే పోషక విలువలు పెరుగుతాయి. ఒక కప్పు రాగిపిండిని 5 లేక 6 కప్పుల నీటిలో ఉండలు లేకుండా జారుగా కలుపుకుని పొయ్యి మీద సన్నని మంటమీద సుమారు 5 నిమిషాలు ఉడక పెట్టాలి. రాగి పిండి ఉడుకుతున్నంత సేపు గరిటతో కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఉండలుకట్టే అవకాశముంది. ఇప్పుడు దీనికి బెల్లం లేదా పటికబెల్లం పొడి, యాలకుల పొడి, పిస్తా, బాదం పొడిని వేసి మరొక 3-4 నిముషాలు సన్నని మంటమీద కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు కలుపుకుంటే రుచికరమైన రాగి జావ తయారవుతుంది. చిన్నపిల్లలకి గోరు వెచ్చగా ఉన్నప్పుడు పెడితే త్వరగా జీర్ణం అవుతుంది. సజ్జ పిండితో కూడా ఈ జావ తయారు చేసుకోవచ్చు.
రాగి అట్లు
కావలసిన పదార్థాలు :
రాగిపిండి : 500 గ్రాములు
బెల్లం : 25 గ్రాములు
నీళ్ళు : తగినంత
నూనె : తగినంత
ఉప్పు : తగినంత
తయారీ విధానం :
నీటిలో బెల్లం కరిగించాలి. ఈ నీటిలో రాగి పిండి కలిపి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం పలుచగా ఉండేటట్లు సరిచూసుకోవాలి. పొయ్యిమీద పెట్టిన పెనంపై గరిటతో కలిపి ఉంచిన చోడి పిండిని వేయ్యాలి. అట్టును రెండువైపులా కాల్చాలి.
ముఖ్యమైన పోషక విలువలు / వంద గ్రాములకు :
మాంసకృత్తులు 5.6 గ్రా., రైబోఫ్లావిన్ 0.06 మి.గ్రా., కాల్షియం 238 గ్రా., నియాసిన్ 0.78, ఇనుము 4 మి.గ్రా., శక్తి 269 క్యాలరీస్.
రాగి పూరి
కావలసిన పదార్థాలు :
రాగి పిండి : 100 గ్రాములు
మైదా : 25 గ్రాములు
నూనె : 120 గ్రాములు
ఉప్పు : తగినంత
నీళ్లు : తగినంత
తయారీ విధానం :
ఒక పాత్రలో జల్లించిన మైదా, రాగి పిండిలో ఉప్పు, తగినన్ని నీళ్ళుపోసి కలుపుకుని, 20 నిమిషాలు ప్రక్కన ఉంచాలి. ఉండల్లా చుట్టుకొని పూరీల్లా చేసుకోవాలి. ఈ పూరీలను బాగా మరిగిన నూనెలో వేయించుకోవాలి.
రాగి ఇడ్లీ
కావలసిన పదార్థాలు :
రాగి పిండి : 60 గ్రాములు
మినపపిండి : 20 గ్రాములు
ఉప్పు : తగినంత
నీళ్లు : తగినంత
తయారీ విధానం :
మినప పప్పుని నానబెట్టుకొని రుబ్బుకోవాలి. దీనికి రాగి పిండిని కలిపి సమపాళ్ళలో నీటిని కలిపి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. దీనిని ఒక రాత్రి వరకు నాననివ్వాలి. తరువాత రోజు ఇడ్లీ పాత్రలో ఇడ్లీలవలె పోసి 15 నిమిషాలు పాటు ఉడక నివ్వాలి. వేరుశనగ, అల్లం చెట్నీలతో తింటే బాగుటుంది.
రాగి చపాతి
కావలసిన పదార్థాలు :
గోధుమ పిండి : 1/2 కేజి
రాగి పిండి : 125 గ్రాములు
నూనె : తగినంత
ఉప్పు : తగినంత
నీళ్ళు : తగినంత
తయారీ విధానం :
ఒక పాత్రలో జల్లించిన రాగి, గోధుమపిండి, తగినంత ఉప్పు తీసుకొని నీళ్ళతో చపాతీ ముద్దలా కలుపుకోవాలి. దీన్ని చిన్న, చిన్న ఉండలుగా చేసి చపాతిలా వత్తుకోవాలి. వేడి అయిన పెనంపై రెండువైపులా దోరగా కాల్చాలి. ఈ విధంగా రుచికరమైన చపాతీలు తయారుచేసుకోవచ్చు.
Also Read: Neera Health Benefits: నీరా తాగండి.. నిశ్చింతగా ఉండండి!