Coleus Plants: కోలియస్ ఫోర్ స్కోలై , పాషాణ బేది మొక్కగా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. కోలియస్ 0.5 మీవరకుపొడవు పెరిగే ఆకుపచ్చని వార్షిక మొక్క.దీనిలో వేర్లు చాల ముఖ్యమైనది. దీని వేర్లు శంకువు ఆకారంలో 20 సెం. మీ. పొడవు వరకు పెరిగి 0.5 నుంచి 2 .5 సెం. మీ. మందలో ఉంటాయి. కాండము సన్నని నూగుతో ఉండి కణుపు నడిమిలను కలిగి ఉంటుంది. ఆకులు లేత లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అల్లం వంటి సువాసనను కలిగి ఉంటాయి. పుష్పాలు నీల రంగు కలిసి లేత గంధపు రంగులో ఉంటాయి.
ఉపయోగములు: కోలియస్ వేర్లలో ఫోర్ స్కోలిన్ అనే రసాయనం ఉంటుంది. దీని వేర్లను దగ్గు, ఉబ్బసం, రక్త హీనత, గనేరియా, నరాలకు సంబంధించిన వ్యాధుల నివారణలో వాడుతారు. అధిక రక్త పోటు, ఊబకాయం, గ్లాకోమా, ఉబ్బసం, గుండె జబ్బులు మొదలైన జబ్బుల వ్యాధుల చికిత్సలో వాడుతారు.
వ్యాప్తి:ఈ పంటను రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్టాలలో సాగు చేస్తున్నారు.
నేలలు:ఇసుకతో కూడిన ఎర్ర గరప నేలలు అనుకూలము. ఉదజని సూచిక 5.5 నుంచి 8 .0 ఉండాలి. తక్కువ సారంగాల భూములలో కూడా సాగు చేయవచ్చును.
వాతావరణం :సాధారణంగా కొండా ప్రాంతాలలో సహజ సిద్ధంగా పెరుగుతుంది. అధిక వేడి గల వాతావరణములలోను, తేమ గల వాతావరణములలోను కూడా కోలియస్ బాగా పెరుగుతుంది. దీని సాగుకు 27 – 40 సి ఉష్ణోగ్రత ఉండి 50 – 60 % గాలిలో తేమ ఉన్న ప్రాంతాలు అనుకూలము. తక్కువ ఉష్ణోగ్రతలను ఈ పంట తట్టుకోలేదు.
రకాలు :దీనిలో కర్ణాటక రకమును మంచి రకముగా గుర్తించారు.
పంటకాలం :6 నెలలు జులై – ఆగష్టు నెలలో నాటుకోవాలి.
మోతాదు: వేరు తొడిగిన కత్తిరింపులు నాటుకోవాలి. ఎకరానికి 15 వేల నుండి 20 వేల వరకు లేత కొమ్మలు అవసరమవుతాయి. ఈ కాండపు మొక్కలు (కొమ్మ కత్తిరింపులు) 10 నుంచి 12 సెం. మీ పొడవు, 3 – 4 జతల ఆకులూ కలిగి ఉండాలి.విత్తే దూరం: 60X40 సెం. మీ లేదా 60X60 సెం .మీ
ఎరువులు: ఆఖరి దుక్కిలో, ఎకరానికి 5 -6 టన్నుల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పోటాష్ వేసుకోవాలి. నాటిన నెల రోజుల తరువాత ఎకరానికి 20 కిలోల నత్రజని వేయాలి.
అంతర కృషి: మొదటి రెండు నెలలు, 20 -25 రోజులకు ఒకసారి కలుపు తీయాలి. తరువాత పంట గుబురుగా తయారై కలుపును అంతగా పెరుగా నీయదు. ఈ మధ్య కలుపు నివారణకు మల్చింగ్ ను కూడా ఉపయోగిస్తున్నారు.
సస్య రక్షణ: ఈ పంటకు దుంపకుళ్ళు తెగులు సోకటానికి అవకాశం ఉంది. ఈ తెగులును తొలిదశలోనే గమనించికార్బెండజిమ్ 0.1% లో నేలను తడిపి నివారించుకోవాలి. ట్రైకోడెర్మా లాంటి శిలింద్రములను ఉపయోగించి కూడ ఈ తెగులు నివారించుకోవచ్చు.
అలాగే నులి పురుగులు/ నిమాటోడ్స్ సమస్య గల నేలలో కార్బొఫురాన్ గుళికలు చల్లాలి.
పంట సేకరణ: నాటిన 160 -180 రోజులలో పంట తయారవుతుంది. ఒకసారి నీరు కట్టి మొక్కలను వేర్లతో సహా పీకి, వేర్లను మొక్క నుండి కత్తిరించాలి. వేర్లను కడిగి సుమారు 5 సెం. మీ పొడవు గల ముక్కలుగా కత్తిరించుకొని ఎండబెట్టాలి.
దిగుబడి: ఖరీఫ్ లో ఎకరానికి సుమారు 500 -600 కిలోలు, రబీలో 400 కిలోల ఎండు వేర్లు దిగుబడి సాధించవచ్చు. కొన్ని సంస్థలు పచ్చి దుంపలను కూడ కొంటాయి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ సరళి ఆర్థిక అంశాలను ప్రభావితం చేస్తాయి.
డా. ఎం. విజయలక్ష్మి మరియు డా. ఏ.నిర్మల, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్.