PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి సాంకేతిక సదస్సును ఈరోజు రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈనెల 28వ తేదీ వరకు జరిగే ఈ వర్క్ షాప్ లో వర్సిటీ పరిశోధన, బోధన, విస్తరణ విభాగాల్లో రాష్ట్రం నలుమూలలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. పంటల సరళి, ఉత్పత్తి, ఉత్పాదకతలు, రక్షణ, నూతన పరిశోధనలు అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి 2023- 24 కార్యచరణ ప్రణాళికను రూపొందించనున్నారు.
విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం. వెంకటరమణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ వి. సుధారాణి లు గత ఏడాది ప్రగతి నివేదికలని వర్క్ షాప్ లో వివరించారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. సుధీర్ కుమార్ కీలకోపన్యాసం చేశారు. స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచి వ్యవసాయరంగ ఉత్పత్తి, ఉత్పాదకతల లో దేశం మంచి పురోగతి సాధించిందని సుధీర్ కుమార్ అన్నారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రానున్న రోజుల్లో ఉత్పత్తి ఉత్పాదకతల్ని మరింత అధికం చేయాల్సి ఉందన్నారు. అయితే తక్కువ భూమి, నీటి వనరులు, తక్కువ ఎరువులు, పురుగుమందులని వినియోగిస్తూ రైతుల ఆదాయం పెరిగేలా వ్యవసాయ పద్ధతులు మారాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంలోనే వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్లు వంటి అధునాతన టెక్నాలజీని సన్న, చిన్న కారు రైతాంగానికి సైతం అందుబాటులోకి తీసుకెళ్లాల్సిన అంశంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాలన్నారు.
2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కల్పనకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తుందని సుధీర్ కుమార్ వివరించారు. ఈ కారణంగా తెలంగాణలో వ్యవసాయ విస్తీర్ణం బాగా పెరిగిందని అన్నారు. అయితే ఈ సాగు విస్తీర్ణంలో వరి, పత్తి పంటలే సుమారు 85 శాతం ఉన్నాయన్నారు. పంటల వైవిధ్యీకరణ పట్ల రైతుల్లో అవగాహన కల్పించడానికి శాస్త్రవేత్తలు కృషి చేయాలని సుధీర్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Kisan GPT: రైతన్నల కోసం కిసాన్ GPT