ఉద్యానశోభచీడపీడల యాజమాన్యంతెలంగాణ

తీగ జాతి కూరగాయల్లో ఆశింతే తెగుళ్ళు

0
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20,041 హెక్టార్లలో 3,00,615 టన్నుల దిగుబడితో పందిరి కూరగాయలను సాగుచేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, సొర మరియు బూడిద గుమ్మడి ముఖ్యమైనవి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుమారుగా 4 ఎకరాల్లో కూరగాయలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి వాతావరణం వివిధ తెగుళ్ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. కావున రైతులు తగు జాగ్రత్తగా ఉండి సమయానికి అనుగుణంగా సస్య రక్షణ చర్యలు చేపట్టాలి.
తెగుళ్ళు
బూజు తెగులు :
ఒక మాదిరి వర్షంతో కూడుకొన్న చల్లని వాతావరణంలో ఆశిస్తుంది. మొదట్లో లేత ఆకుపచ్చ. ముదురాకుపచ్చ కలిసి మొజాయిక్‌ వలె కన్పిస్తుంది. తర్వాత ఆకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు, అడుగుభాగాన ఊదారంగు మచ్చలు, బూజు వంటి పదార్ధం ఏర్పడుతుంది. ఆకులు పండు బారి ఎండిపోతాయి. దీని నివారణకు మాంకోజెబ్‌ 3 గ్రా. ం  సిమోగ్స్నిల్‌ 3 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
బూడిద తెగులు :
ఆకుల పైభాగాన ముందుగా తెలుపు లేదా బూడిదరంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడివంటి (బూడిద) పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. లేత ఆకుల కన్నా, దాదాపు 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు బినోమిల్‌ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ప్యుజేరియం వేరుకుళ్ళు తెగులు :  
దీన్ని ఎండుతెగులు అని కూడ అంటారు. తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి. ఆకులు వాడిపోతాయి. ఈ శిలీంద్రం భూమిలో వుండి వ్యాపిస్తూ వుంటుంది. నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మందును లీటరు నీటికి 3 గ్రా. చొప్పున కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. పదిరోజుల వ్యవధిలో 2-3 సార్లు చేయాలి. ఈ శిలీంద్రం భూమిలో వుంటుంది కనుక పంటమార్పిడి చేయాలి. ఆఖరి దుక్కిలో వేపపిండి 250 కిలోలు/ఎకరాకు వేసి కలియదున్నాలి. పంటవేసిన తర్వాత ట్రైకోడెర్మావిరిడి అనే కల్చర్ను భూమిలో పాదుల దగ్గర వేయాలి.
వెర్రి తెగులు :
ఆకుల ఈనెల మధ్య మందంగా చారలు ఏర్పడి, పెళుసుగా మారి, గిడసబారిపోయి, పూత, పిందె ఆగిపోతుంది. దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చేసే పేనుబంక పురుగులను లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున డైమిథోయేట్‌ లేదా మిథైల్‌ డెమటాన్‌ కలిపి పిచికారి చేసి నివారించుకోవాలి.
ఆంత్రాక్నోస్‌ (పక్షికన్ను తెగులు) :
ఆకులపై, కాయలపై గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి, ఎండి రాలిపోతాయి. పిందె దశలో రాలిపోతాయి. దీని నివారణకు తెగులును గమనించిన వెంటనే కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. లేదా. కార్బండైజిమ్‌ 1 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు పిచికారి చేసుకోవాలి.
డా. రాజు, సస్య రక్షణ శాస్త్రవేత్త
డా.రాజన్న, ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి
డా.సౌమ్య, సేద్యపు శాస్త్రవేత్త.
Leave Your Comments

డ్రోన్లతో రసాయనాల పిచికారీ- సందేహలు మరియు సమాధానాలు

Previous article

వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవ వేడుకలలో భవిష్యత్తు హరిత తెలంగాణకు పెద్దలు చెప్పిన సూచనలు

Next article

You may also like