Telangana Weather :
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం ఈ ఐదు రోజులలో(జులై 3 నుంచి జులై 7 వరకు) రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు:
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి జూన్ 3వ తేదీన ప్రవేశించి జూన్ 12వ తేదీన రాష్ట్రమంతటా విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోనికి ప్రవేశించిన తరువాత తేలిక పాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ.,బరువు నేలలో 60 నుంచి 75 మి.మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15-20 సెం.మీ. లోతు తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి. వేరుశనగ, సోయాచిక్కుడు. జొన్న,పెసర, కంది, మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి.
వరి:
వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ మండలాల్లోని జిల్లాలలో పొడిగా విత్తి తడి పద్ధతిలో సాగు చేసే వరి పంటను విత్తుకోవటానికి అనుకూల సమయం. నీరు సంవృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక (130-135 రోజుల) లేదా స్వల్పకాలిక (120- 125 రోజుల) వరి రకాల నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. 25 రోజుల వయస్సు ఉన్న దీర్ఘకాలిక వరి రకాల నారును నాటు పెట్టుకోవాలి. నాటు పెట్టిన తర్వాత ప్రతి 2మీటర్లకు కాలిబాటను తీయటం వలన గాలి వెలుతురూ బాగా ప్రసరించడంతో బాటు సుడిదోమ ఉదృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది.
వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రా. కార్బోప్యూరాన్ 3జి గుళికలను ఇసుకలో కలిపి చల్లితే ప్రధాన పొలంలో పంటను 15-20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుండి కాపాడుకోవచ్చు.
జులై మాసం తెలంగాణ సోన (RNR 15048) వరి రకం నారుమడి పోసేందుకు అనుకూలం.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో రాష్ట్రంలో అక్కడక్కడ వరి పంటలో కాండం తొలిచే పురుగు గమనించడమైనది. దీని నివారణకు 10 కిలోల కార్బోఫ్యురాన్ 3 జి గుళికలను వేసుకోవాలి. వరి సాగు చేసే రైతులు వరిగట్లను శుభ్రంగా ఉంచుకోవాలి లేనట్లయితే గట్లమీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశిస్తుంది. వరి మొక్కలను పోలిన ఉద,వడిపిలి గడ్డిజాతి కలుపు మొక్కల నివారణకు 7.5మి.లీ. సైహలోఫాప్ పి-బ్యుటైల్ మందును 5లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వయస్సు గల వరి నారుమడిలో పిచికారి చేయాలి.
పత్తి :
పత్తి పంటను జులై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. వర్షాదార పత్తి పంట బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకున్నట్లయితే తేమ సంరక్షించుకోవటంతో పాటు ఎక్కువ వర్షాలు పడినప్పుడు కాలువల ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలంగా ఉంటుంది.
* పత్తిలో అక్కడక్కడ రసం పీల్చే పురుగులు గమనించడమైనది. ముందు జాగ్రత్తగా కాండానికి మందు పూసే పద్దతిలో మొనోక్రోటోఫాస్ + నీరు (1:4 నిష్పత్తి) మిశ్రమ ద్రావణాన్ని 30, 45 రోజుల పంట దశలో కాండం మీద పూయాలి.
పత్తి పంట విత్తిన 2 వారాల తర్వాత ముందు నివారణ చర్యలో భాగంగా రసం పీల్చే పురుగులను నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు, 5 నీలం రంగు జిగురు అట్టలను అమర్చాలి. మొదటి దఫా పైపాటు నత్రజని, పొటాషియం ఇచ్చే ఎరువులను 20 రోజుల తరువాత భూమిలో తేమ ఉన్నప్పుడు అందించాలి.
మొక్కజొన్న:
మొక్కజొన్న పంటను జులై 15వ తేదీ వరకు మధ్య, దీర్ఘకాలిక (90-100 రోజులు మరియు 100-120 రోజులు) రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకునేందుకు అనుకూల సమయం. మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు గనుక పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి. ముందు నివారణ చర్యలో భాగంగా పంట విత్తిన 15రోజుల వ్యవధిలో కత్తెర పురుగు నివారణకు 1500 పి.పి.ఎం. వేపనూనెను 5 మీ.లీ./ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లింగాకర్షక బుట్టలను అమర్చడం ద్వారా కత్తెర పురుగు ఉదృతిని గమనించవచ్చు. ఆఖరి దుక్కిలో మొత్తం భాస్వారం, 1/3వ వంతు నత్రజని, సగం పొటాష్ ఇచ్చే ఎరవులను చివరి దుక్కిలో వేసుకోవాలి.
జొన్న:
జొన్నలో మొవ్వ తొలచు ఈగ గమనించడమైనది. దీని నివారణకు 2మి.లీ. కార్బోసల్ఫాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆముదం: ఆముదం పంటను జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు.
కంది:
కంది పంటను జులై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. కందిని ఎకపంటగా లేదా పత్తి, మొక్కజొన్న, జొన్న, సోయాచిక్కుడు, పెసలు, మినుములతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. కంది పంటను విత్తే ముందు 2.5గ్రా. కాప్టాన్ లేదా 3గ్రా. థైరామ్ మరియు 10గ్రా. ట్రైకోడెర్మా విరిడె మందులను కిలో విత్తనానికి కలిపి విత్తుకున్నట్లయితే విత్తనం లేదా భూమి ద్వారా సంక్రమించే శిలీంద్రాల నుండి పంటను కాపాడవచ్చు.
పెసర, మినుము:
పెసర, మినుము పంటలను జులై 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. వీటిని ఎకపంటగా లేదా పత్తి, కందితో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. వరి సాగు చేసే పొలాల్లో, ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాలలో పెసరను పైరుగా లేదా పచ్చి రొట్టగా విత్తుకోవాలి. పెసర, మినుము విత్తిన 2 వారాల తర్వాత ముందు నివారణ చర్యలో భాగంగా రసం పీల్చే పురుగుల నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు, 5 నీలం రంగు జిగురు అట్టలను అమర్చాలి.
సోయాచిక్కుడు:
సోయాచిక్కుడు పంటను జులై మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. నీటి వసతి గల తేలికపాటి నేలలు కూడా సోయాచిక్కుడు సాగుకు అనుకూలం.
ఎత్తు మడులు, కాలువల పద్ధతిలో విత్తుకున్నట్లయితే విత్తన మోతాదు తగ్గటంతోపాటు సరైన సాంద్రతలో మొక్కలు ఉండి, సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు వస్తాయి.
ఈ పద్ధతిలో భూమిలో ఎక్కువ తేమ నిలువ ఉండి పంట నీటి యద్దడిని తట్టుకుంటుంది. అదేవిధంగా ఎక్కువైన నీటిని పొలం నుండి తీసివేయటానికి కాలువలు ఉపయోగపడతాయి. సోయాచిక్కుడు పంట విత్తిన 2 వారాల తర్వాత, కాండం తొలిచే ఈగ, తెల్లదోమను నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు,5 తెలుపు జిగురు అట్టలను అమర్చాలి.
ముందస్తు నివారణ చర్యలలో బాగంగా సోయాచిక్కుడులో స్టెమ్ గిర్డర్ను నివారించడానికి 1500 పి. పి. ఎం. వేపనూనే 5 మీ.లీ./ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
వేరుశనగ:
వేరుశనగ పంటను జులై 15 వరకు విత్తుకోవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేరుశనగలో మొదలుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు మొక్కల మొదళ్ళ దగ్గర 2గ్రా. కార్బండజిమ్ + మ్యాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి నేలను తడపాలి.
చెరకు:
తోట వయస్సు నాలుగు నెలలప్పుడు (జూన్ – జులై మాసాల్లో) మొక్కల మొదళ్ళకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీని వలన అధిక వర్షాలు, తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు.
కూరగాయలు:
కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్లైతే నివారణకు 1500 పి. పి. ఎం. వేపనూనె 5 మీ.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకటానికి అనుకూలం. ఈ తెగులు నివారణకు 1 గ్రా. కార్బెండజిమ్ లేదా 1 మి.లీ. ప్రోపికోనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. తీగ జాతి కూరగాయ పంటలు విత్తటానికి అనుకూల సమయం. మిరప, టమాట, వంగ, బంతి పంటలను ఎత్తు మడులమీద నారు పోయడం ద్వారా నారుకుళ్ళు తెగులు నివారించవచ్చు.
బత్తాయి, నిమ్మ:
కొత్తగా తోటలు పెట్టె రైతులు 60 సెం.మీ. పొడవు, వెడల్పు, లోతు గల గుంతలు తీసి, దానిలో 5కిలోల పశువుల ఎరువు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రా. క్లోరిపైరిఫాస్ పొడి మందులను పై మట్టికి కలిపి గుంతలను నింపుకోవాలి. నాణ్యమైన మొక్కలు నాటుకోవాలి.
బత్తాయి, నిమ్మలో సిట్రస్ క్యాంకర్(గజ్జి తెగులు) నియంత్రించడానికి 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ మరియు 30 గ్రాములు కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందుని 10 లీటర్ల నీటికి కలిపి 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి..
మామిడి:
రైతులు కోత అనంతరం 2-4 వారాల తరువాత ఎండు కొమ్మలను, తెగులు సోకిన కొమ్మలను, అడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించినట్లయితే గాలి, వెలుతురు మొక్కకు బాగా లబిస్తుంది. పోయిన సంవత్సరం వచ్చిన పూత కాడలను వెనుకకు కత్తిరించుకొని 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తోటలో రాలిపోయిన, కుళ్ళిపోయిన, తెగుళ్ళు ఆశించిన కాయలతో పాటు ఎండు ఆకులను, కొమ్మలను సేకరించి తోటలకు దూరంగా కాల్చివేయాలి.
పశుపోషణ:
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్ళలో కొక్కెర తెగులు సోకటానికి అనుకూలం. దీని నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో చిటుకు, పి.పి.ఆర్ వ్యాధులు, ఆవులు, గేదెలలో గొంతువాపు వ్యాధి సోకటానికి అనుకూలంగా ఉంటుంది. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయాలి.
డా. పి.లీలా రాణి,ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ),
వ్యవసాయ వాతావరణ విభాగం, రాజేంద్రనగర్