Gladiolus Cultivation: గ్లాడియోలస్ దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో కట్ ఫ్లవర్‌గా బాగా ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో గ్లాడియోలస్ వాణిజ్యపరంగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, సిక్కిం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్లలో సాగు చేయబడుతుంది. గ్లాడియోలస్ పూలను కట్ ఫ్లవర్ గాను అందమైన పూలగుచ్ఛల తయారీలోనూ ఎన్నో డెకరేషన్లలో ఉపయోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గ్లాడియోలస్ కేవలం 10 నుండి 12 ఎకరాల్లో మాత్రమే సాగుచేయబడుతుంది.
బొకేల తయారీ, వివిధ ఫంక్షన్లలో వీటి వాడకం విస్తృతంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కో కట్ ఫ్లవర్ డిమాండ్ను బట్టి 10`20 ధర పలుకుతోంది. ఒకసారి విత్తనం నాటితే చాలు మళ్లీ విత్తనం కొనుగోలు చేయాల్సిన పని ఉండదు. ఒక్కో దుంప నుంచి 3-4 దుంపలు వస్తాయి వాటిని రాబోయే సంవత్సరాలలో నాటుకోవడమే కాకుండా, దుంపలను అమ్ముకొని ఆదాయం పొందవచ్చు. నాణ్యమైన దుంపలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ (ఐఐహెచ్‌ఆర్) బెంగుళూరు నుండి కొనుగోలు చేయవచ్చును.
ఎక్కువ ఆదాయం కోసం ఆకర్షణీయమైన రంగులతో పుష్పించే రకాలను ఎన్నుకోవాలి :
పసుపు రంగు రకాలు : అర్కా గోల్డ్, జాక్సన్ విల్ ఐగోల్డ్, జస్టర్, సిల్వియా.
గులాబీ రంగు : అర్కా అమర్, ఫ్రెండ్షిప్.
తెలుపు రంగు రకాలు : వైట్ ప్రాస్పరిటీ, వైట్ గాడెస్.
ఎరుపు రంగు రకాలు : పూసా రెడ్ వాలెంటైన్, పూసా మన్మోహక్, అర్కా ఆయుష్.
ఊదా రంగు రకాలు : అర్కా రజిని, అర్కా ప్రథమ్.
వాతావరణం : గ్లాడియోలస్ వివిధ వాతావరణ పరిస్థితుల్లో సాగు చేసినప్పటికీ పగటి ఉష్ణోగ్రత 15 నుండి 25 డిగ్రీలు ఉండాలి. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉంటే మొక్క పెరుగుదలను నిలిపివేస్తాయి. లాంగ్ డే ట్రీట్ మెంట్(ఎక్కువ పగటి సమయం) మొక్క మొగ్గ దశ చేరడానికిపట్టే సమయాన్ని పెంచుతుంది. కానీ దీనివలన పుష్పం యొక్క నాణ్యత పెరుగుతుంది. లాంగ్ డే ట్రీట్మెంట్ వలన స్పైక్ (పూకాడల) లెన్త్ పెరిగి, మొగ్గల సంఖ్య కూడా పెరుగుతుంది. గ్లాడియోలస్ 30 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు పగటి ఉష్ణోగ్రతను తట్టుకోగలదు కాబట్టి మార్చ్ లోపు పంట కాలం అయిపోయేటట్టు చూసుకోవాలి.
నేలలు : గ్లాడియోలస్ సాగుకు ఉదజని సూచిక 6.5 నుంచి 7 మధ్య ఉండి, నీరు ఇంకే సారవంతమైన తేలిక నేలలు, ఎర్ర, ఇసుక నేలలు అనుకూలం.
ప్రవర్ధనం : గ్లాడియోలస్ వాణిజ్యపరంగా దుంపలు (కార్మ్స్) ద్వారా ప్రవర్ధనం చేస్తారు. చుట్టుకొలత 4 నుంచి 4.5 సెంటీమీటర్లు ఉన్న దుంపలను ఎన్నుకోవాలి. 4 నుంచి 4.5 సెంటిమీటర్ల పరిమాణం కంటే చిన్నగా ఉన్న దుంపలను తిరిగి నాటినప్పుడు రాబోయే సంవత్సరాల్లో గ్లాడియోలస్ ప్రవర్ధనంలో ఉపయోగించవచ్చు.
నాటడం :
గ్లాడియోలస్ జూన్ నుంచి నవంబర్ వరకు నాటుకోవచ్చు. అక్టోబర్లో నాటిన దుంపల ద్వారా నాణ్యమైన పూకాడలు పొందవచ్చు. 30I20 సెం.మీ.ఎడంతో 6-8 సెం.మీ.లోతులో గ్లాడియోలస్ దుంపలను నాటుకోవాలి. 30I20 సెం.మీ ఎడంతో ఎకరాకు 64 వేల విత్తనపు దుంపలు సరిపడతాయి. నాటేటప్పుడు దుంపలపై ఉన్న పొలుసులను తీసివేసి కార్బెండజిమ్ 1 గ్రా. మందును లీటరు నీటికి కలిపి దుంపలను 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచినట్లయితే దుంపల ద్వారా వ్యాప్తి చెందే రోగాలను నిరోధించవచ్చు. అలా శుభ్రపరిచిన దుంపలను ఒకసారి కాకుండగా దఫాలవారీగా 15 రోజుల వ్యవధిలో నాటుకుంటే నిరంతరం మార్కెట్కి పూలని అందించవచ్చు. దీనిని స్టాగర్డ్ సోయింగ్ అంటారు.
ఎరువులు :
ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల నత్రజని, 35 కిలోల భాస్వరం మరియు 35 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను వేయాలి. మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఐరన్ మరియు బోరాన్ లాంటి సూక్ష్మపోషకాల లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లోపాల అనుగుణంగా, పూల యొక్క నాణ్యత పెంచడానికి ఐరన్ సల్ఫేట్ 0.75%, జింక్ సల్ఫేట్ 0.5 % మూడు నుంచి నాలుగు ఆకుల దశలో మొక్కలపై పిచికారీ చేసుకోవాలి.
నీటి యాజమాన్యం :
గ్లాడియోలస్ దుంపల ద్వారా ప్రవర్ధనం చెందుతుంది కాబట్టి నాణ్యమైన పంట తీయడానికి సరైన విధంగా నీటి యాజమాన్యం చేపట్టడం ముఖ్యమైన అంశం. దుంప జాతి మొక్క కనుక ఎక్కువ నీరు ఇస్తే దుంప కుళ్ళిపోతుంది. తక్కువ నీరు ఇస్తే కూడా దుంప నుంచి మొలకలు తక్కువగా వచ్చి మొక్క పెరుగుదలకు అంతరాయం ఏర్పడుతోంది. భూమిలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. దుంపలు, మొలకలు వచ్చి ఆకులు పెరుగుతున్న సమయంలో నీరు తప్పనిసరిగా అందించాలి. నీటి ఎద్దడికి పంట గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణోగ్రతలు, నేల తేమను బట్టి వారానికి ఒకసారి నీరు పెట్టినా సరిపోతుంది.
అంతరకృషి :
నాలుగు నుంచి ఐదు ఆకులు ఏర్పడిన తర్వాత వరుసల మధ్య గల మట్టిని మొదలుకు ఎగదోయాలి. పూకాడలు వచ్చే సమయంలో తప్పనిసరిగా ఊతమివ్వాలి, లేనట్లయితే పూకాడ బరువు వలన ముక్కలు ఒక పక్కకి వాలిపోతాయి.
పూలకోత : నాటుకున్న తర్వాత 60 నుంచి 80 రోజులకు పూకాడలు వస్తాయి. కొన్ని లేట్ రకాల అయితే 100 నుంచి 120 రోజులకి పూకాడలు వస్తాయి. పూకాడలు కత్తిరించేటప్పుడు మొక్క పైన మూడు నుంచి నాలుగు ఆకులు ఉండేటట్టు చూసుకొని తర్వాత పూకాడలను కత్తిరించాలి పూకాడలు కత్తిరించిన వెంటనే, ఒక బకెట్లో మంచి నీళ్లు తీసుకుని అందులో కత్తిరించిన పూకాడలను ఉంచాలి. దూర మార్కెట్లకు రవాణా చేసేటప్పుడు పల్సింగ్ చేసుకోవాలి. అంటే 20 గ్రా. సుక్రోజ్ని ఒక లీటర్ నీటిలో కలిపి దాంట్లో మూడు నుంచి నాలుగు గంటల పాటు పూకాడలు ఉంచినట్లయితే పూకాడలు, ఆ సుక్రోస్ సొల్యూషన్ని గ్రహించి మూడు నుంచి నాలుగు రోజులు తాజాగా ఉండడానికి వీలు పడుతుంది.
దుంప కోత మరియు నిల్వ :
పూకాడలు కోసిన రెండు నెలల తర్వాత దుంపలను నేల నుంచి త్రవ్వి తీసుకోవాలి. దుంపలను తీసే ఒక నెల ముందు నుండి నీటి తడి ఆపివేయాలి. ఆకులు, పసుపుపచ్చగా మారి ఎండిపోయిన దశకు వచ్చినప్పుడు తేలికపాటి తడి ఇచ్చి దుంపలను త్రవ్వి తీసుకోవాలి. ఇలా తీసిన దుంపలను శుద్ధి చేసుకొని నిల్వ చేసుకోవాలి.
దుంపలను నిద్రావస్థ నుంచి తొలగించడానికి మార్గాలు :
కోల్డ్ స్టోరేజ్ : దుంపలను మూడు నుంచి నాలుగు డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మూడు నెలలు ఉంచినట్లయితే, AదీA పరిమితులు తగ్గి నిద్రావస్థను తొలగించవచ్చు. ఇలా చేయడం వల్ల నిద్రావస్థను తొలగించడంతో పాటు దుంపలు ముందే మొలకెత్తకుండా తగిన సమయంలో మొలకెత్తడంలో సహాయపడుతుంది.
ఇదిలిన్ క్లోరో హైడ్రిన్ :
ఇథిలిన్ క్లోరో హైడ్రిన్ 2 మి.లీ., లీటరు నీటికి కలిపి రెండు నుంచి మూడు నిమిషాల పాటు దుంపలను ఈ ద్రావణంలో ఉంచిన తర్వాత ఆరబెట్టి నాటుకోవాలి ఇలా చేయడం ద్వారా 30 రోజుల్లో మొలకలు వస్తాయి.
¸యోయూరియా : 2% థయోయూరియా ద్రావణంలో దుంపలను అర్ధగంట సేపు నానబెట్టడం ద్వారా కూడా నిద్రావస్థను తొలగించవచ్చు. ఇలా చేసిన తర్వాత 30 రోజులకి దుంపల నుండి మొలకలు వస్తాయి.
పొటాషియం నైట్రేట్ : 10 గ్రా. పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి కలిపినా ద్రావణంలో దుంపలను 24 గంటలసేపు ఉంచడం ద్వారా నిద్రావస్థను తొలగించవచ్చు.
గిబెరెల్లిక్ ఆమ్లం : 200 మి. గ్రా. జిబెరెల్లిక్ ఆమ్లం లీటరు నీటిలో కలిపి దుంపలను 24 గంటలు నానబెట్టినట్లయితే నిద్రావస్థను త్వరగా తొలగించవచ్చు.
గ్లాడియోలస్‌లో చీడ పీడలు :
ఎర్రనల్లి : ఎర్రనల్లి లేత దశలో పంటను ఆవరిస్తుంది, ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి ఎండిపోతాయి. దీనిని నివారించడానికి డైకోఫాల్ 3 మి.లీ., లీటరు నీటికి కలిపి ఆకుల అడుగుభాగం తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి.
తామర పురుగులు :
తామర పురుగులు ఆవరించినప్పుడు ఆకులు మరియు పూకాడల మీద వెండి రంగు గీతలు ఏర్పడి ఆకులు గోధుమరంగులోకి మారి ముడుచుకొనిపోతాయి. తల్లి, పిల్ల పురుగులు మొక్కల నుండి రసాన్ని పీల్చి బలహీనపరుస్తాయి. నివారణకు డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం వల్ల తామర పురుగులను నివారించవచ్చు.
పొగాకు లద్దె పురుగు :
పొగాకు లద్దె పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులను మాత్రమే కాకుండా పూమొగ్గలని కూడా నష్టపరుస్తాయి. లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని తినడం వలన నష్టం కలుగుతుంది. నివారణకు లైట్ ట్రాప్స్ ఉపయోగించడం వలన తల్లి పురుగులను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్వినాల్ఫాస్ 0.05% లేదా క్లోరిఫైరిఫాస్ 0.05% లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా పొగాకు లద్దె పురుగులను నివారించవచ్చు.
నులి పురుగులు :
నులిపురుగులు ఆశించినప్పుడు వేర్లు దెబ్బ తింటాయి. వీటి వలన మొక్క పెరుగుదల ఆగిపోతుంది. వేసవికాలంలో రెండు నుంచి మూడుసార్లు లోతుగా దున్ని నేలకు ఎండ తగిలేటట్టు చూడడం వల్ల పొలంలో నులిపురుగులు, వాటి గుడ్ల సముదాయం నశించిపోతాయి. బంతిపూలని అంతర పంటగా గాని, పంట మార్పిడి రూపంలో గాని నాటినప్పుడు నులిపురుగుల సంఖ్య బాగా తగ్గుతుంది. లేదా ఎకరానికి నాలుగు కిలోల ఫోరేట్ గుళికలు భూమిలో కలపాలి దీని ద్వారా కూడా నులిపురుగుల సంఖ్యను తగ్గించుకోవచ్చు.
ఎ. సౌజన్య, హార్టికల్చర్, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్,
రాజేంద్రనగర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం