Integrated Farming: వ్యవసాయాన్ని అనుబంధ రంగాలైన ఉద్యాన పంటలు, పశుపోషణ, జీవాలు పెంపకం, అటవీ వ్యవసాయం మొదలైన వాటితో పాటుగా కుటీర పరిశ్రమలైన పుట్టగొడుగుల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, వర్మి కంపోస్టింగ్ మరియు బయోగ్యాస్ వంటి వాటితో కలిపి చేసుకోవడాన్ని సమగ్ర వ్యవసాయం అని అంటారు. ఇందులో ఒక వ్యవస్థనుండి లభించే ఉత్పత్తులు లేక వ్యర్ధాలు మరో వ్యవస్థకు వనరులుగా లేక పెట్టుబడులుగా ఉపయోగపడతాయి. దీని వలన సాగు ఖర్చులు పూర్తిగా తగ్గుతాయి. సమగ్ర వ్యవసాయం చేయడం వలన రైతులకు ఎన్నో లాభాలు ఉన్నాయి. దీని ద్వారా వ్యవసాయం అనేది కుటుంబ ఆహార మరియు పోషక భద్రతను సాధించవచ్చు.
ఆదాయాన్ని క్రమబద్ధంగా సంవత్సరం పొడవునా పొందవచ్చు. అననుకూల వాతావరణ పరిస్థితులలో కూడా అనుకున్న ఆదాయం పొందుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా పొందవచ్చు. పశువులకు మేతగా ఉపయోగపడని పంటలు వ్యర్థాలను కాల్చి వేయకుండా కంపోస్టుగా లేదా వర్మి కంపోస్టుగా తయారు చేసుకొని పంటలకు వేసుకున్నట్లయితే భూసారని కాపాడుకోవడమే కాకుండా రసాయన ఎరువుల వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు. సంవత్సరం పొడవునా ఉపాధి పొందవచ్చు. పశువులకు మేకలకు కుందేళ్ళకు కోళ్లకు మేత కూడా లభిస్తుంది. పర్యావరణాన్ని కాపాడుతూ రైతు ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి ప్రతి రైతు కమతాలలో పంటలతో పాటు పాడి కోళ్లు గొర్రెలు, మేకల పెంపకం చేపడితే రైతులు పూర్తి భద్రతతో ఉండటం మంచిది. రైతులకు మంచి ఆదాయం రావాలంటే ధాన్యపు జాతి మరియు కాయ జాతి పశుగ్రాసం పెంపకం తప్పనిసరి.
Also Read: రైతుల సౌలభ్యం మరియు సబ్సిడీ పథకాలు”.!
వ్యవసాయంలో పశుగ్రాసాల ప్రాముఖ్యత
జీవాల పెంపకం ఉన్నప్పుడు తప్పనిసరిగా రైతులు తమకున్న భూమిలో పశుగ్రాస సాగుపై కొంత భూమిని కేటాయించుకోవాలి. పావు ఎకరా భూమిలో నీటి ఆధారంగా పండించే పశుగ్రాసాలతో రెండు పాడిపశువులను లాభసాటిగా పోషించుకోవచ్చు. నీటి వసతితో ఏడాది పొడవునా కోతకు వచ్చే నేపియర్ పశుగ్రాస రకాలని ఎంపిక చేసుకోవాలి. పశువులకు పచ్చిమేత వేసేటప్పుడు గట్టి జాతి మరియు కాయ జాతికి చెందిన పశుగ్రాసాలు 3.1 నిష్పత్తిలో ఉన్నట్లయితే పశువులకు సమతుల్య ఆహారం అందుతుంది. కావున కాయజాతి పశుగ్రాసాలు కూడా వేసుకోయాలి. బహు వార్షిక పశుగ్రాసాలు కానీ ఏకవార్షిక పశుగ్రాసాలు కానీ, చలికాలంలో పెరుగుదల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో అవసరానికి మించి ఉత్పత్తి అయినా పచ్చిగడ్డిని సైలేజ్ పద్ధతిలో మాగబెట్టుకొని 40 రోజుల తర్వాత నుండి వాడుకోవచ్చు.
పశువుల యొక్క శరీర బరువును బట్టి 30 కిలోల పశుగ్రాసం తగ్గకుండా వేసుకోవాలి. పాడి పెంపకంలో అధిక పాల ఉత్పత్తికి కాయ జాతి పశుగ్రాసాలు లేక లెగ్యూమ్ పశుగ్రాసాలు చాలా అత్యవసరం. ఒక్కో పశువుకు లెగ్యూమ్ పశుగ్రాసాలు 5 కిలోలు చొప్పున వేసుకోవాలి. పశువులకు ఈ విధంగా ధాన్యపు జాతి పశుగ్రాసం మరియు కాయ జాతి పశుగ్రాసంను కల్పించినట్లయితే దాణాపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు.
పశుగ్రాసాల ఆవశ్యకతను గుర్తించి, సాగు చేస్తూ పాడి మరి ఇతర పశువులను పెంచుతున్న రైతులు రోజువారీ ఆదాయంతో ఉపాదిని పోందవచ్చు. ఇతర వనరుల లభ్యత చేకూరటం ద్వారా సుస్థిరమైన వ్యవసాయం చేపడుతూ అప్పులు ఆత్మహత్యలు లేని జీవనం గడుపుతున్నారు. ప్రతి రైతులు ఇదే బాటలో నడిచి సుస్థిర వ్యవసాయం చేపట్టాలని ఆశిద్దాం.
Also Read: 80 శాతం సబ్సిడీపై విత్తనాలు.!