Chickpea Farming: శనగ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. శనగలతోపాటు, మార్కెట్లో శనగ పప్పు, శనగ పిండి, పుట్నాలకు గిరాకీ బాగున్నది. దీంతో రైతులు పండించిన శనగ మంచి ధర పలుకుతుంది. రబీ సీజన్లో ప్రధాన పంట పప్పుశనగ. ఎక్కువగా నల్లరేగడి నేలల్లో సాగు చేస్తారు. అక్టోబరు నుంచి సాగుకు అనుకూలం. అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తేటప్పుడు పంట చివరి దశలో బెట్టకు గురై మరింత అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గవచ్చు.
సాధారణంగా శనగను వర్షాధారంగా సాగు చేస్తారు. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. శనగ వేసిన తర్వాత భూమిలో తడి ఉంటే చాలు విత్తనం మొలకెత్తుతుంది. అనంతరం వాతావరణంలో ఉండే మంచు, నీటి బిందువులను గ్రహించి పంట ఏపుగా పెరుగుతుంది. విత్తేటప్పుడు విత్తనాన్ని 5-8 సెంటీమీటర్ల లోతులో తడి మట్టి తగిలేలా విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్ల, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ఉన్నట్లు విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 33 మొక్కలు ఉండేలా చూసుకోవాలి.
శనగ విత్తిన తర్వాత 30 రోజుల వరకు చేలో ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తేముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు1-1.2 లీ. చొప్పున 200 లీ. నీటిలో కలిపి నేలపై పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి. అదే విధంగా విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు మొలకెత్తక ముందే “పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3-1.6 లీ. / 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. విత్తిన 30 నుండి 35 రోజుల దశలో గొర్రుతో అంతర కృషి చేసి కలువు నివారించుకోవచ్చు. శనగలో ఎక్కువగా తుప్పు తెగులు కనిపిస్తుంది. యూరోమైసిన్ అనే శిలీంధ్రం ద్వారా ఇది వ్యాపిస్తుంది. పైరు కుంకుమ రంగులోకి మారుతుంది.
Also Read: రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్, పగటిపూట మాత్రమే.!
తెగులు సోకిన మొక్కల ఆకులు పండు బారి ఎండిపోతాయి. ప్రాథమిక దశలోనే గుర్తించి హెక్సాకనాజోల్ 400 మి.లీ. లేదా ప్రొపాకినజోల్ 200 మి.లీ. లేదా టెబుకొనాజోల్ 160 గ్రాములు… ఎకరానికి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. నేలలోని తేమను బట్టి ఒకటి కానీ రెండు తేలికపాటి తడులు పెట్టాలి. ముఖ్యంగా రైతులు నీటి తడులు పెట్టేటప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. పూత దశకు ముందు అనగా విత్తిన 30 నుండి 35 రోజులకు ఒకసారి మరియు గింజ కట్టే దశలో విత్తిన 55 నుండి 65 రోజులకు ఒకసారి తడులను అందిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు.
శనగ పంటలో నేల స్వభావాన్ని బట్టి నేలలో లభించే పోషకాలు మోతాదును బట్టి ఎరువులు వాడాలి. ఎకరా శనగసాగుకు 8కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం, 8కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. నేలలో నిల్వలు సరిపడా ఉన్నప్పుడు భాస్వరం, పొటాష్ ఎరువులు వేయనక్కర్లేదు. ఎకరాకు 18కిలోల యూరియా, 125సింగల్ సూపర్ ఫాస్పేట్ లేదా 50కిలోల డీఏపీ వేసినట్లయితే పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరం అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ పాస్ఫేట్ రూపంలో వేసిన పంటకు కావాల్సిన గంధకం కూడా అందుతుంది.
ఈ పంటలో వేరు కుళ్ళు, ఎండు తెగుళ్లు ఎక్కువగా ఆశించి నష్టం కలుగ చేస్తాయి. వేరుకుళ్లు రాకుండా ఉండడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్ లేదా క్యాప్టాన్ మందును కలిపి విత్తుకోవాలి. పంట పరిపక్వతకు చేరినప్పుడు ఆకులు మరియు కాయలు పసుపు రంగు నుంచి ఎండు గడ్డి రంగుకి మారతాయి. ఆకులు పూర్తిగా రాలిపోతాయి. ఈ దశలో పంటకోత చేసుకోవచ్చు. కంబైన్డ్ హరివేస్టర్ సహాయంతో కూడా తీసుకోవచ్చు. కోత అనంతరం గింజలను మార్పిడి చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. విత్తనాలను 9 % శాతం తేమ ఉన్నంతవరకు ఆరబెట్టి తదుపరి నిల్వ చేసుకోవడం మంచిది.
Also Read: వరి రకాల విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన మెళకువలు.!