Nutrient Deficiencies of Citrus: చీని, నిమ్మ తోటల్లో ఎరువుల యాజమాన్యం కీలకమైనది. పోషణ సరిగా లేనిచో చీడపీడలు అధికంగా ఆశించడమే కాకుండా, మంచి దిగుబడిని ఇవ్వాల్సిన చెట్లు సరైన పోషణ లేకపోతే 10 సంవత్సరాలు లోపే క్షీణించి పోతాయి. నత్రజని ఎరువును 25 శాతం పశువుల ఎరువు రూపంలోనూ, 25 శాతం పిండి ఎరువు (వేపపిండి / ఆముదం) రూపంలోను, మిగిలిన 50 % రసాయనిక ఎరువు రూపంలో రెండుసార్లు అనగా మొదటిసారి డిసెంబర్ ` జనవరి మాసాల్లో, రెండవసారి జూన్`జూలై మాసాల్లో వేయాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనూ, పొటాష్ ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో రెండు దఫాలుగా సమపాళ్ళలో వేయాలి. ఎకరానికి 25 కిలోల జనుము మొక్కల మధ్య అంతర పాటగా వేసుకొని 45 – 48 రోజుల తరువాత దాదాపు 50 శాతం పూత దశలో కత్తిరించి పాదుల్లో వేయాలి. వర్మీకంపోస్టు వాడితే పశువుల ఎరువు మోతాదును తగ్గించవచ్చును. పూతకు వదిలే ముందు, చెట్లను ఎండబెట్టి, ఎరువులు వేసి, పుష్కలంగా నీరు పెట్టలి. సేంద్రీయ ఎరువులు వాడటం వలన భూమిలో సత్తువ, తేమను నిల్వ వుంచుకొనే సామర్థ్యం పెరిగి చెట్లు బాగా కాపునిస్తాయి. ఎరువులను చెట్ల పాదులలో ట్రెంచ్ పద్ధతిలో వేయాలి.
నత్రజని :
నత్రజని లోపిస్తే ఆకులు పసుపు రంగుకు మారడం, మొక్క ఎదగకపోవడం వంటివి జరుగుతాయి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను వాడుకోవాలి.
భాస్వరం :
భాస్వరం వేర్ల అభివృద్ధికి పని చేస్తుంది. భాస్వరం లోపిస్తే ఆకులు ఎరుపు, ఊదా రంగులోకి మారుతాయి. సిఫారసు చేసిన మోతాదులో భాస్వరం ఎరువులను వాడుకోవాలి.
పొటాషియం :
సాధారణంగా సున్నం ఎక్కువగా ఉన్న నేలల్లో, సూపర్ ఫాస్ఫెట్ అధికంగా వేసిన నేలల్లో పొటాషియం లోపాలు కనిపిస్తాయి. పొటాషియం లోపినచ్చినప్పుడు, ఆకులు మెలికలు తిరిగి, ముడుచుకొనిపోతాయి. మొక్కల పెరుగుదల తగ్గిపోతుంది. ఆకుల అంచులు పసుపు వర్ణంలోకి మారతాయి. పిందెలు వేసే దశలో పొటాషియం లోపిస్తే, పిందెలు ఎక్కువగా రాలిపోతాయి, కాయల పరిమాణం తగ్గుతుంది. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. నేలలో పొటాషియం లోపాన్ని సరిదిద్దటానికి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ద్వారా నేలలో వేసి పొటాషియం లోపాన్ని సరిదిద్దవచ్చు. ఒక శాతం పొటాషియంనైట్రేట్ ద్రావణాన్ని చెట్టు అంతా తడిచేలా పిచికారి చేసి కూడా లోపాన్ని సవరించవచ్చు.
Also Read: ప్రత్తిలో ఎరువుల వినియోగం.!
జింకు :
జింకు లోపించినప్పుడు, కొత్తగా పెరిగే కొమ్మలు, లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగాలు పసుపు రంగుకు మారతాయి. ఆకుల మధ్య కాండం పొడవు తగ్గి, ఆకులు గుబురుగా అగుపడతాయి. కొమ్మల చివర్లు ఎండిపోతాయి. కొమ్మలు పైనుండి కింది వరకు క్రమంగా ఎండిపోతాయి. పండ్లు చిన్నవిగా, తొక్క మందంగా ఉండడమే కాక రుచిని కోల్పోతాయి ఉండవు. కాయల నాణ్యతతో పాటు దిగుబడి కూడా తగ్గిపోతుంది. జింకు లోపాన్ని సవరించుటకు 100 గ్రాములు జింకు సల్ఫేటును చెట్టు మొదలులో మట్టిలో కలిసేలా వేయాలి. వారం వ్యవధిలో రెండు, మూడు సార్లు 0.25 శాతం జింకుసల్ఫేట్ ద్రావణాన్ని పిచికారి చేసి కూడా జింకు లోపాన్ని సరిదిద్దవచ్చు.
మాంగనీసు :
సాధారణంగా జింకు లోపాలు కనిపించే సందర్భాలలో మాంగనీసు లోపాలు కూడా కనిపిస్తాయి మాంగనీసు లోపించినప్పుడు ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడడి, క్రమంగా అవి గచ్చకాయ రంగుకు లేదా తెల్లగా మారతాయి. ఆకులు క్రిందికి ముడుచుకొని బోర్లించిన గిన్నె లాగా కనిపిస్తాయి. ఆకుల పై మాంగనీసు లోప లక్షణాలు జింకు లోప లక్షణాలను పోలి ఉంటాయి. అయితే మాంగనీసు లోపించినప్పుడు ఆకు పరిమాణం తగ్గదు. మాంగనీసు లోపాన్ని సవరించడానికి మాంగనీసు సల్ఫేట్ (0.20 శాతము) ద్రావణాన్ని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
ఇనుము :
సున్నపు పొరలు ఎక్కువగా ఉన్న భూముల్లో, మరియు సాగు నీటిలో బైకార్బోనేట్లు, కార్బోనేటులు అధికంగా వున్నపుడు ఇనుము లోపం ఎక్కువగా కనిపిస్తుంది. లేత ఆకుల్లో ఈనెలు మాత్రం అకుపచ్చగా ఉండి, మిగిలిన భాగమంతా పసుపుగా మారుతుంది. ఆకులన్నీ క్రమంగా పాలిపోయి తెలుపు రంగులోకి మారుతాయి. కాయలు రాలిపోతాయి. 1 శాతం అన్నభేధి ద్రావణాన్ని (10 గ్రా అన్నభేది G5 గ్రా నాన్నం ప్రతి లీటరు నీటికి) లోప లక్షణాలు తగ్గే వరకు వారం వ్యవధిలో పిచికారి చేయాలి.
రాగి :
జింకు, ఇనుము మరియు మాంగనీసు లోపాలు అగుపడే నేలల్లో బోర్డో మిశ్రమం వాడని సందర్భాలలో రాగి లోపం కనిపించవచ్చు.
కొమ్మల చివర్లనుండి లేత ఆకులు రాలిపోతాయి. కొమ్మ చివరి నుండి క్రిందకి ఎండిపోతుంది. ఆకులు, కాండము మరియు కాయలపై ఇటుక రంగు ఎండు మచ్చలు ఏర్పడతాయి. కాయలపై బుడిపెల్లాంటి మచ్చలు వస్తాయి. కాయల పరిమాణం తగ్గుతుంది. కాయల నడుమ బంక ఏర్పడుతుంది. కొమ్మలపై నుంచి కూడా బంక కారవచ్చు. తెగుళ్ళ నివారణకు ఉపయోగించే రాగి ధాతు సంబంధిత మందులను పిచికారి చేసి కొన్ని శిలీంద్ర తెగుళ్ళను అరికట్టడమే కాక రాగి ధాతు లోపం కూడ నివారించవచ్చు.
మెగ్నీషియం :
కాల్షియం, మెగ్నీషియం, పొటాష్ల మధ్య సమతుల్యం లేనపుడు ఈ పోషక లోపం కనిపించవచ్చు. మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు ప్రధానమైన మధ్య ఈనెకు ఇరువైపులా పసుపు పచ్చని మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు క్రమేపి పెద్దవై కేవలం ప్రధాన ఈనెకు ఇరువైపులా తిరుగబడిన ‘‘ప’’ ఆకారంలో ఆకుపచ్చని ప్రదేశం ఏర్పడుతుంది. ఆ తరువాత ఆకులు రాలిపోతాయి. ఒక శాతం మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలు పిచికారి చేసి ఈ పోషక లోపాన్ని సవరించవచ్చు.
బహుళపోషక లోపాలు :
చాలా సందర్భాలలో, ముఖ్యంగా నేలల్లో సహజంగా అధికంగా సున్నం ఉన్నప్పుడు జింకు, ఇనుము, మాంగనీసు, బోరాన్ లోపాలు ఒకేసారి కన్పిస్తాయి. ఇట్టి సందర్భాలలో వేర్వేరు పోషక లోపాల్ని ప్రత్యేకంగా గుర్తించడం కష్టం. ఈ లోపాలు అన్నిటినీ సమిష్టిగా పల్లాకు తెగులు అని పిలుస్తారు. ఈ లోపాలను ఈ క్రింది తెలిపిన పోషక మిశ్రమాన్ని పిచికారి చేసి సరిదిద్దుకోవచ్చు.
జింకు సల్ఫేట్ 1 గ్రా.
మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రా.
మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రా.
పెర్రస్ సల్ఫేట్ బోరాక్స్ 1 గ్రా.
సున్నం 6 గ్రా.
యూరియా 10 గ్రా.
నీరు 1 లీటరు
లేత మొక్కలు సంవత్సరానికి 4-5 సార్లు చిగురిస్తాయి. కావున ఈ సమయంలో పల్లాకు వ్యాధి నివారణకు లీటరు నీటికి జింకు సల్ఫేట్ 5 గ్రా. G మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రా. G మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రా. G ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రా. G బోరాక్స్ 1 గ్రా. G కాల్షియం / సున్నం 6 గ్రా. G యూరియా 10 గ్రా. మిశ్రమాన్ని సంవత్సరానికి 4 సార్లు (జూన్, జులై, జనవరి, ఫిబ్రవరి) పిచికారి చేయాలి. నిప్పారిన లేత ఆకుల మీద పిందె బఠాణీ పరిమాణంలో ఉన్నప్పుడు పిచికారి చేయాలి. సున్నపు నేలల్లోని నిమ్మ తోటల్లో ఇనుప ధాతు లోపం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి 20 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ మరియు 2 గ్రా. నిమ్మఉప్పు 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 దఫాలుగా పిచికారి చేయాలి.
Also Read: గోల్డెన్ రైస్ ప్రాముఖ్యత.!