Chilli Cultivation: మిరపను మన తెలుగు రైతులు ఎర్ర బంగారంగా పిలిచుకుంటారు. ఈ పంటలో కొన్ని మెళకువలు పాటిస్తే సంపద కుడా ఆ స్థాయిలో ఉంటుంది. మిరప పంటకు ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు అనువైనవి. పంట సాగు భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి ముందుగా పచ్చిరొట్ట లేదా మినుము పంటను వేసుకొని భూమిలో కలియ దున్నాలి. దీనివల్ల భూమికి సహజ పోషకాలు లభిస్తాయి. 10-15 రోజుల తరువాత ట్రాక్టర్ కల్టివేటర్ తో నేల మెత్తగా దుక్కి అయ్యేవరకు 2-3 సార్లు దున్నుకోవాలి.
నారు పెంచడానికి నేలకు కొంచం ఎత్తులో మట్టిని బెడ్లుగా చేసుకోవాలి. నాలుగు మూలాలు సమన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. నారుమడిలో విత్తనాల మధ్య దూరం ఒక్క అంగుళం దూరం ఉండేలా వేసుకోవాలి. సేల్టర్ లో నారు వెయ్యనివారు నారు మొక్కలకి ఎక్కువ ఎండ తగలకుండా నీడ కోసం జాలి పరదా లేదా వస్త్రాన్ని టెంటులగా పైన వేసుకోవాలి. మొక్క వయస్సు 35 -40 రోజుల మధ్యలో మొక్కలను నేలల్లో నాటుకోవడానికి సిద్ధం చేసుకోవాలి.
మొక్కలను నాటుకునే విధానం
మొక్కలను నీటి వసతి నేలల్లో నాటుకునేప్పుడు మొక్కల సాధారణ దూరాలు 24 × 24 అంగుళాలు (ఇంచులు), లేదా 26 X 26 అంగుళాలు, లేదా 28× 28 అంగుళాల దూరం నేల స్వభావాన్ని బట్టి దురాన్ని ఎంచుకొని రెండువైపులా అచ్చులుగా దునుకోవాలి. ఇలా రెండువైపులా అచ్చులుగా వెయ్యడం వల్ల మొక్కల మధ్య సమాన దూరాలు, కలుపు యంత్రాలు లేదా కలుపు నాగలి అనువుగా ఉండడం వల్ల కూలీల వినియోగం తగ్గుతుంది. అలాగే మొక్క ఎదుగుదలకు కూడా బాగుంటుంది. మొక్కలు పెట్టడానికి తీసిన రంధ్రాలలో కొద్దిగా నీరు పోసి వేర్లు మడత పడకుండా జాగ్రతగా నాటుకోవాలి. డ్రిప్ పద్ధతి (Drip Irrigation) లో నాటుకునేటప్పుడు మొక్కల మధ్య దూరం 30 – 45 సె.మీ దూరం అనువైనది.
Also Read: ఉల్లినారు మొక్క నాటుకునే చిట్కాలు, కలుపు, తెగులు నివారణలు.!
మిరప పంట దిగుబడి తగ్గించడానికి కలుపు పెద్ద సమస్య. కలుపు నివారణకు మొక్కలు నాటిన 20-25 రోజుల తరువాత కలుపు గొర్రు లేదా గుంటుకలను ప్రతి 15-20 రోజులకు ఒక్కసారి దున్నాలి. మొక్క నేలమొత్తన్ని కప్పివేసేవరకు 4-5 సార్లు దున్నాలి. కలుపు గొర్రు లేదా గుంటుకల వల్ల మొక్క వేర్లు నేలలోకి విస్తరించి మొక్క ఎదుగుదల బాగుంటుంది. రెండువైపులా సాల్లుగా మొక్కలు నాటుకున్న వారికీ మొక్కల మధ్య ఉన్న కలుపు కూడా పోవడం వల్ల కలుపు కూలీల వినియోగం తక్కువగా ఉండటం జరుగుతుంది.
కలుపు నివారణకు రసాయనాలు మొక్కలను నటుకునే 1-2 రోజుల ముందు పెండిమిథాలిన్ 1.5 మీ.లీ/ 1 లీటర్ కలుకొని పిచికారి చేసుకోవాలి. పంటలో కలుపుమొక్కలు ఉన్నట్లయితే మొక్కలు నాటిన 25 రోజుల తరువాత క్వైజాలోఫాస్ ఇథైల్ ఎకరానికి 400-500 మీ.లీ మొక్కలపై పడకుండా జాగ్రతగా పిచికారి చెయ్యాలి. డ్రిప్ ద్వారా పంటకు సాగు చేసినప్పుడు ప్లాస్టిక్ మల్చింగ్ వినియోగించడం వల్ల కలుపును నివారించవచ్చు.
మొక్కలను నాటిన 20-25 రోజులలోపు ఎకరానికి నత్రజని 120 కిలోలు, భాస్వరం 24 కిలోలు, పోటాష్ 48 కిలోలు కలుపుకొని వేసుకోవాలి. మొక్క పెరుగుదలను బట్టి నత్రజని ఎరువులను అందించాలి. పూత, కాయ నాణ్యత కోసం పోటాష్ ను 2-3 సార్లు అందిచాలి. వర్షాలు ఎక్కువగా వాడుతున్నపుడు మొక్కలు నేలనుండి పోషకలను తీసుకోలేదు . కాబట్టి 13.0.45 లేదా 19.19.19 ఎరువును 8 గ్రా’ 1 లీటర్ నీటిలో కలుపుకొని పైపాటుగా పిచికారి చేసుకోవాలి.
మిర్చి పంట దిగుబడి తగ్గడానికి పొగాకు లద్దె పురుగు ముఖ్య కారణం. ఈ పురుగు సాయత్రం, రాత్రి సమయాల్లో మొక్క యొక్క ఆకులను ఆహారంగా తీసుకుంటుంది. కావున నివారణ కోసం రసాయన మందులను సాయంత్రా సమయాల్లో పిచికారి చెయ్యడం మంచిది. నోవాల్యూరాన్ 10% 1 మీ.లీ / 1 లీటర్ నీటికి లేదా లూఫేన్యురాన్ 5.4% EC 1.25 మీ.లీ / 1 లీటర్ నీటికి లేదా థాయోడికార్బ్ 75% WP 1.5 గ్రాము / 1 లీటర్ నీటికి కలుపుకొని 20-25 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చెయ్యడం ద్వారా పొగాకు లద్దెపురుగు పూర్తిగా నివారించవచ్చు. ఇలాంటి పద్ధతులు పాటించి మిర్చి పంటను సాగు చేస్తే మంచి లాభాలు వాస్తు, పంట దిగుబడి కూడా మంచిగా ఉంటుంది.
Also Read: విత్తన నిర్మాణం నుండి ఫలం పొందే వరకు పొద్దు తిరుగుడు పంట మార్గదర్శిక.!