Alternative Cropping Strategies: మనదేశంలో వివిధ ప్రాంతాలలో వైవిధ్య వాతావరణ పరిస్థితులు నెలకొనడం వలన ఆయా ప్రాంతాల్లో పండిరచే పంటలపై వాతావరణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పంట కాలంలో విపత్కర పరిస్థితుల వలన పంట కాలంలో బెట్ట పరిస్థితులు, అకాల వర్షాలు, అధిక వర్షాలు మరియు తుఫాన్ల తీవ్రత పెరుగుట వలన పంటల దిగుబడి గణనీయంగా తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితులలో వివిధ పంటల్లో క్రింద తెలిపిన జాగ్రత్తలు పాటించినట్లైతే పంట నష్టాన్ని తగ్గించి తద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు.
1. పంట తొలి దశలో వచ్చే బెట్ట పరిస్థితులు : అంతరకృషి, పంట అవశేషాలతో ఆఛ్చాదన
2. పంట మధ్య దశలో వచ్చే బెట్ట పరిస్థితులు : అంతరకృషి, పొటాషియం నైట్రేట్ పిచికారి, రక్షక తడి
3. పంట చివరి దశలో వచ్చే బెట్ట పరిస్థితులు : రక్షక తడి
Also Read: జంతు క్రూరత్వ నిరోధక చట్టం 1960
పంట కాలంలో విపత్కర వాతావరణ పరిస్థితులను అధిగమించడానికి అనుసరించదగిన ప్రత్యామ్నాయ ప్రణాళిక :
. ఋతుపవనాలకు అనుగుణంగా సరైన పదునులో విత్తడం
. స్వల్పకాలిక మరియు బెట్టను తట్టుకునే వంగడాల సాగు
. అంతర పంటల సరళి
. బోదెలతో కూడిన వెడల్పు మడుల మీద విత్తడం
. బోదెలు, కాలువల మీద విత్తడం
. వాలుకు అడ్డంగా విత్తడం
. తల్లిచాలు వేయడం
. భూగర్బ జలాల సద్వినియోగంతో బావులు, బోరు బావులు రీచార్జి చేసుకోవడం
. వర్షపునీటిని నిల్వచేసుకొనే నీటికుంటల ద్వారా రక్షక తడి ఇవ్వడం
పంట తొలిదశలో వచ్చే బెట్టపరిస్థితులను తట్టుకునే ప్రణాళిక :
. ఋతుపవనాలు సకాలంలో వచ్చినప్పటికీ పంటకాలంలో 15 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు వర్షాభావ పరిస్థితులలో విత్తినప్పుడు మొలక శాతంలో గణనీయంగా తగ్గుదల కనిపిస్తుంది.
. 1-3 సెం.మీ లోతులో విత్తే నువ్వులు లేదా చిరుధాన్యాలను మరియు పప్పుధాన్యాలను, 3-5 సెం.మీ లోతులో విత్తే జొన్న మరియు పొద్దుతిరుగుడు వంటి పంటలను ఎర్ర నేలల్లో విత్తినప్పుడు మొలక శాతం తక్కువ. ఇలాంటి పరిస్థితులలో తరువాత కురిసే వర్షానికి మళ్ళీ విత్తుకోవడం మేలు.
. మొక్కల సాంద్రత తగిన మోతాదులో ఉంచడం
. అంతరకృషి ద్వారా నేలపై ఏర్పడే గట్టిపొరను కదిలించి, కలుపునివారణ చేసి నేలలో తేమశాతాన్ని పెంచడం. నేలకు తగిన ఆఛ్చాదన ఇవ్వడం.
. తగినంత తేమ దొరికే వరకు పై పాటుగా ఎరువుల వాడకాన్ని నిలిపివేయాలి.
. సూక్ష్మ నీటిపారుదల పద్దతులతో ప్రత్తి, మొక్కజొన్న, మిరప మరియు కూరగాయల పంటలకు డ్రిప్ పద్ధతిలోను వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలకు స్ప్రింక్లర్ పద్ధతిలోను నీటిని ఇవ్వాలి.
పంట మధ్య కాలంలో వచ్చే బెట్టపరిస్థితులను తట్టుకునే ప్రత్యామ్నాయ ప్రణాళిక :
. త్వరితగతిన ఎక్కువ సార్లు అంతరకృషి చేయడం ద్వారా కలుపునివారణతో పాటుగా నేలకు ఆచ్చాధన కల్పించడం ద్వారా నేలలో తేమ శాతాన్ని రక్షించడం.
. విత్తిన 40-45 రోజులకు వచ్చే బెట్ట పరిస్థితులను తట్టుకోవాడానికి పంటను బట్టి మొక్కల వత్తు తీయడం (సరైన మొక్కల సాంద్రత)
. తల్లిచాలు వేసి వాన నీటిని సంరక్షించడం
. మధ్యస్థ నల్ల రేగడి నేలల్లో వరుస విడిచి వరుసలో నాగటి చాలు ఏర్పాటు చేయడం లేదా 6-8 వరుసలకు ఒక నాగటి చాలు ఏర్పాటు చేయడం ద్వారా వాన నీటిని సంరక్షించడం.
. తక్కువ లోతు కలిగిన మధ్యస్థ నల్ల రేగడి మరియు ఎర్ర నేలల్లో 10-15 మీ. కు ఒక తల్లి చాలు ఏర్పాటు చేయడం.
. పంట అవశేషాలతో నేల ఆఛ్చాదన లేదా బ్లేడు గుంటకతో నేలలో వచ్చే నెరియలు కప్పి నేలలోని తేమను సంరక్షించడం.
. వివిధ పంటల కీలక దశల్లో అదనంగా ఒక తడిని ఇచ్చి పంటను కాపాడుకోవటం.
పంట చివరి దశలో వచ్చే బెట్టపరిస్థితులను తట్టుకునే ప్రత్యామ్నాయ ప్రణాళిక :
. ఋతుపవనాలు తొందరగా ముగియడంతో వచ్చే బెట్ట పరిస్థితులు రావడంతో పాటుగా ఉష్ణోగ్రతలు పెరగడం వలన పంట అత్యంత తొందరగా పక్వదశకు వచ్చినప్పుడు గణనీయంగా దిగుబడులు తగ్గిపోవడం.
. వర్షపునీటిని నిలువవుంచిన నీటికుంటలోని నీటితో ఒక అదనపు తడినిచ్చి పంటను రక్షించడం.
. వచ్చినంత దిగుబడితో పంట కోత కోసి పశుగ్రాసాలను నిల్వచేసుకోవడం/రబీ పంటకు సన్నద్ధం కావడం.
. జొన్న-శనగ అంతర పంటల సరళిలో బెట్ట వచ్చినప్పుడు జొన్నను పశుగ్రాసానికై తీసివేస్తారు.
. మన ప్రాంతానికి ఉలవ లేదా అలసందను పంటగాను లేదా పశుగ్రాసంగా ప్రత్యామ్నాయంగా పండించవచ్చు.
Also Read: తీగజాతి కూరగాయలలో ‘‘బంక తెగులు’’ నివారణ.!