Water Shed Scheme: నీరు పాడి, నీరు పంట, నీరు ఫలం, నీరు మొలక, నీరు వృక్షం, నీరు జీవం, నీరు జీవితం, నీరే సర్వం, నీరే సమస్తం. ఇలా మన దైనందిన జీవితంలో నీరు లేకుండా చేయగలిగేది ఏమీ లేదని చెప్పవచ్చు. మబ్బు రాల్చే ఒక్కొక్క వాన చినుకును (చుక్కను) మట్టి గర్భంలో పొదిగించి ఓ కొత్త మొక్కను ఈ ఆకుపచ్చని ప్రపంచానికి పరిచయం చేయడం సృష్టి అద్భుత ప్రక్రియ. ప్రకృతి చేసే ఈ ఇంద్రజాలానికి రైతు మరింత తోడ్పాటు అందించేలా వాటర్‌షెడ్ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
వాటర్ షెడ్ ముఖ్య ఉద్దేశం :
పరుగెత్తే నీటిని నడిచేట్లు చేయడం, నడిచే నీటిని భూమిలో ఇంకించి భూగర్భ జల సంపదలకు సక్రమ వినియోగం చేయడం, తద్వారా ఆయా ప్రాంతాల్లోని పశు, వ్యవసాయ ఉత్పాదకతలను పెంచి ఆ ప్రాంత ప్రజల జీవనోపాదులను మెరుగుపరచుకోవడం ఇత్యాది అంశాలు ముఖ్యమైనవి.
అనావృష్టి పీడిత ప్రాంతాల సమస్యలను పరిష్కరించడానికి శాస్త్రజ్ఞులు చక్కని కార్యక్రమాలు రూపొందించగా వాటిని అనేక సంస్థలు అమలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమాలు అమలు జరిగినప్పుడు ఎంతో కొంత భూగర్భజలం పెరిగి కొన్ని బోరుబావుల ద్వారా కొంత నీటితో సాగు జరుగుతుంది. అది కేవలం ఒక డెసిమల్ (దశాంశం లేదా శతాంశం) మాత్రమే. పరీవాహక ప్రాంతాల అభివృద్ధి ధ్యేయమంతా సాగునీటి విస్తీర్ణాన్ని పెంచడం మాత్రమే కాదు (అది యాదృచ్ఛికంగా వచ్చే లాభమే).
రైతులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల వాటర్‌షెడ్ కార్యక్రమాలంటే కేవలం ప్రవాహాల కడ్డంగా నిర్మించే వదులు రాతి నిర్మాణాలు, చెక్‌డ్యామ్‌లు లేదా కమతపు కుంటలు మాత్రమే అనుకుంటున్నారు. ఈ పనుల వల్ల రైతు కూలీలకు, కాంట్రాక్టర్లకు పనికల్పించే నిధులు కోకొల్లలుగా వస్తూ ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
Also Read: చెఱకు పంట లో నీటి యాజమాన్యం
అసలు వాటర్‌షెడ్ కార్యక్రమాల ధ్యేయమేమిటో చర్చించుకుందాం..
అడవుల నరికివేత, అమితంగా పశువుల మేపకం, విచక్షణా రహితమైన భూవినియోగం, అలాగే విచక్షణా రహితమైన సేద్య పద్ధతులను అవలంబించడం మూలంగా పరీవాహక ప్రాంతాలు విపరీతంగా నేల కోతకు గురై వర్షాలను కోల్పోయి, కురిసిన వర్షపు నీరు నేలలో ఇంకక సముద్రం పాలయ్యే పరిస్థితులేర్పడి వాటి ఉత్పాదకతను కోల్పోయి, నిర్వీర్యమై ఆ ప్రాంతవాసుల బతుకుతెరువులు భారంగా తయారయ్యాయి.
వీటన్నింటినీ సరిదిద్ది ప్రజలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే వాటర్‌షెడ్ కార్యక్రమాల ప్రధాన ధ్యేయం.
ఒక వాటర్‌షెడ్‌లో సేద్యయోగ్యమైన నేల, సేద్యయోగ్యం కాని నేల, అలాగే వాగులు లేదా ప్రవాహాలు చిన్నపాటి లోయలూ ఉంటాయి. వాటర్షెడ్లను శిఖరం నుండి లోయకు ట్రీట్మెంట్ (నిర్వహణ) చేస్తారు. ‘‘ఎక్కడ పడిన వర్షపు నీటి చుక్కను అక్కడ ఇంకేలా చేయడం’’, ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం.
ఈ ధ్యేయాన్ని సాధించడానికి మనం వాలు నేలలు గల రైతాంగానికే చక్కని మార్గం చూపాలి. అదే వాలుకడ్డంగా (కాంటూరు) సేద్యం వాలుకడ్డంగా దున్నాలి, వాలుకడ్డంగా విత్తాలి, వాలుకడ్డంగా అంతరకృషి చేయాలి. ఇవే మెట్ట రైతుకు వేద మంత్రాలు, మూల సూత్రాలు కావాలి. ఈ అంశంపై నూటికి నూరు శాతం సాధిస్తే అవి ఎంతో సాధించిన వాటర్షెడ్లు అనవచ్చు.
వాలుకడ్డంగా సేద్యం చేస్తూ కొద్ది మాత్రం పెట్టుబడులు పెట్టినప్పుడు, దిగుబడులు ఇబ్బడిముబ్బడవుతాయి. సాగునీటి దిగుబడులకు సరితూగుతాయి. రైతు ఆర్థికస్థితి పెరుగుతుంది. అదే మనం తరచూ మాట్లాడే రైతుల భాగస్వామ్యం, పరీవాహక ప్రాంతాల కార్యక్రమాల చరిత్ర మూడు దశాబ్దాలకు మించినా, వాటిపై సరైన అవగాహన లేదనే చెప్పాలి.
పరీవాహక ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను భూసార తరగతుల ఆధారంగా (లాండ్ కెపాసిటీ క్లాసిఫికేషన్) నిర్వహించాలి. అయితే ఈ నేల ఈ తరగతికి చెందిందని గుర్తించడంతోనే సరిపోదు. ఆయా తరగతి నేలలకు తగిన ట్రీట్మెంట్ (చికిత్స) జరగాలి. తొలి నాలుగు తరగతులకు చెందిన సేద్యయోగ్యమైన నేలల్లో చక్కటి పండ్ల తోటల పెంపకం అంటే నీరు పారించనవసరం లేని నేలల్లో తోటల నాట్లు జరగాలి. అలాగే ఆరోతరగతి నేలల్లో శాస్త్రీయమైన పచ్చికబయళ్లు పెంచాలి. ఇలా చేసిన నాడు ఎక్కడ పడిన వర్షపు నీరు అక్కడే ఉండి, భూగర్భజలం గణనీయంగా పెరుగుతుంది. ప్రవాహాలు రెండు మూడు నెలలు అధికంగా ప్రవహిస్తాయి. పశువులకు ఎక్కువ కాలం తాగు నీరు సునాయాసంగా అందుతుంది. ఇలా చేయడమే రైతులను నిజంగా వాటర్‌షెడ్ పథకాల్లో భాగస్వాములను చేసినట్లవుతుంది.
ఇలా ఎక్కడ పడిన వర్షపు నీరు అక్కడే ఇంకేలా ప్రవాహాలకు చేరే మిగులు జలాలకు మాత్రమే మనం శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి. అవన్నీ నాణ్యంగా, పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించినప్పుడే అదొక సంపూర్ణమైన వాటర్‌షెడ్ నిర్వహణ అనిపించుకుంటుంది. రైతులు పంటకాలాల్లో నేలలకు చెందిన వాటర్‌షెడ్ పథకాల అమలు పనిలో నిమగ్నం కాగా వ్యవసాయ పనులు లేని సీజన్లో నిర్మాణాల పనులు చేసి ఆర్థికంగా చక్కగా నిలదొక్కుకుంటారు. ఈ విధంగా నేలలకు సంబంధించిన పనులకు ప్రాధాన్యతనిస్తూ వాటర్‌షెడ్ పనులు జరిగితే రైతుల ఆర్థిక స్థితిగతులు బాగుపడడానికి ఒకటి రెండేళ్ళ కంటే మించకపోవచ్చు.
ఇలా వాటర్‌షెడ్ పథకాల సమర్ధవంతమైన నిర్వహణకు నిర్వాహకులు తదనుగుణమైన సాహిత్యాన్ని చదవడంతో పాటు నిష్ణాతులతో తరచూ సంప్రదింపులు జరపాలి. వాటర్షెడ్ల శాస్త్రీయ నిర్వహణ అంటే వాలుకడ్డంగా దున్నాలి, వాలుకడ్డంగా విత్తాలి, వాలుకడ్డంగా అంతరకృషి చేయాలి అనేవి ప్రధాన సూత్రాలుగా ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి.
Also Read: చెరువుల్లో ఉండే గుర్రపుడెక్క యాజమాన్యం.!
Leave Your Comments