ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, సరదాగా మనతో ఆడుకోడానికి ఒక తోడు ఉండాలని అనిపించినప్పుడు.. ముఖ్యంగా లైఫ్లో లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు అందరికీ అనిపించేది ఒకటే.. మనకు ఓ కుక్కపిల్ల ఉంటే బాగుండుకదా.. అని. ఇంట్లో ఎంతో ఇష్టంగా కుక్కపిల్లలను పెంచుకోవడం ఎవరైనా చేసే పనే. ఈ క్రమంలోనే వాటిని ముద్దుచేసేటప్పుడు.. అవి మనల్నినాకడం, వాటి లాలాజలం మనపై కార్చడం, ముద్దులు పెట్టడం వంటి పనులు చేస్తుంటాయి. అలా చేసేటప్పుడు మనం కూడా వాటికి ముద్దులు పెడుతుంటాం.. అయితే, అవి అలా నాకడం, ముద్దులు పెట్టడం చేస్తే.. మన ప్రాణానికే ప్రమాదమని వైద్యులు అంటున్నారు.
ఎవ్వరికీ తెలియని నిజం ఎంటంటే.. కుక్క లాలాజలంలో.. క్యాప్నోసైటోఫాగా కానిమోర్సస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి కుక్క మనల్ని కరిస్తే.. ఈ బాక్టీరియా మన శరీరంలోకి వెళ్లి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. అయితే, కుక్కలు ముద్దు పెట్టి, నాకినప్పుడు.. మన శరీరంపై ఏవైనా గాయాలుంటే వాటి ద్వారా ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు. దానివల్ల ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు అంటున్నారు.
ఎప్పుడైనా కుక్కతో ముద్దాడుతున్నప్పుడు మన చర్మంపై వాపు, ఎర్రని మచ్చలు, జ్వరం, కడుపునొప్పి వంటి లక్షణాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను కుక్కల నుంచి దూరంగా ఉంచాలని సలహా ఇచ్చారు.