అంతర్జాతీయ మృత్తికా దినోత్సవాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం ఘనంగా నిర్వహించింది. శనివారం ఉదయం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు. దీనిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ విద్య, పరిశోధనలో అనేక అధ్భుతాలు సాధిస్తున్న బిజెపి ఎస్ఏయుతో కలిసి పనిచేయడానికి తమ బ్యాంక్ ఎల్లవేళలా సిద్ధంగా ఉందన్నారు. రైతులు వ్యవసాయం సాగించడానికి తమ బ్యాంక్ అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తుంది అన్నారు. భారతదేశంలో వ్యవసాయ, గ్రామీణ సమాజానికి సేవలు అందించడంలో తమ ఎస్బీఐ ప్రధమస్థానంలో ఉందని అమిత్ జింగ్రాన్ వివరించారు.
స్వాతంత్య్రం సాధించినప్పటి నుండి నేటివరకు రైతాంగం, శాస్త్రవేత్తల నిరంతర కృషివల్ల దేశ వ్యవసాయరంగంలో అపార అభివృద్ధి సాధించగలిగిందని పిజెటిఎస్ఎయు ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు. ఆహారధాన్యాలు సహా వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తిలో దేశం చాలా ముందంజలో ఉందన్నారు. అయితే, నేడు వ్యవసాయరంగం అనేక సవాళ్లని ఎదుర్కొంటుందని ప్రవీణ్ రావు అన్నారు.
Also Read : యాసంగికి ప్రత్యామ్నాయం మక్కలే
మారుతున్న ఆహార అలవాట్లు, ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అనేక పరిణామాలు వ్యవసాయంపై పరిమితులు విధిస్తున్నాయన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల భూ వనరులు క్షీణత, ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత లోపిస్తుందన్నారు. అదేవిదంగా ఆహారధాన్యాల వృధా కూడా ఎక్కువ అవుతుందని ప్రవీణ్ రావు అన్నారు.
నేడు వ్యవసాయరంగంలో మూడవ దశ విప్లవం నడుస్తోందని ప్రవీణ్ రావు అన్నారు. ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్, సెన్సర్లు, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలతో వ్యవసాయాన్ని పరిపుష్టం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. అదేవిధంగా పరిమిత వనరులతో పర్యావరణ స్పృహతో పోషకాలున్న ఆహార ఉత్పత్తుల్ని పండించడంపై ప్రస్తుత, భవిష్యత్తు తరాలు దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రవీణ్ రావు సూచించారు. మృత్తికా దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, వకృత్వ పోటీలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. భూసార పరిరక్షణ పై లఘు చిత్రాలు రూపొందించిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో డీన్ పీజి స్టడీస్ డా.అనిత, డీన్ అగ్రికల్చర్ డా. సీమ, ఎస్ బి ఐ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అండ్ జనరల్ మేనేజర్ బోగరామనారాయణ, వ్యవసాయ కళా శాల అసోసియేట్ డీన్ డా. నరేందర్ రెడ్డితోపాటువిశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, బోధన, బోధనే తర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్ బి ఐ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Also Read : ఆర్థిక శాఖకు వన్నె తెచ్చిన రోశయ్య