ఆహారశుద్ది

తొలకరి నువ్వుల సాగు – యాజమాన్యము

0

sesame.

నూనె గింజ పంటలలో నువ్వులు ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. నూనె శాతం 45 నుండి 55 వరకు,ప్రోటీను శాతం 25 వరకు ఉండడమేకాక సెసమెలిన్ మరియు సెసామిన్ అనే యాంటీఆక్సీడెంట్స్ ఉండటం వల్ల ఎక్కువకాలం నిల్వ ఉండి. మనకు వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది. విటమిన్ “ఇ” ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి చాలా మంచిది.
తక్కువ సమయంలో, తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించెందుకు నువ్వులు పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్ లో వర్షాధారంగా పండించిన దానికంటే రబీ/వేసవిలో వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి, విత్తన నాణ్యత పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు. మన రాష్ట్రాల్లో నువ్వుల పంట ముఖ్యంగా కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఎక్కువగా పండిస్తున్నారు.

నేలలు: నీరు నిలువని తేలిక, బరువు నేలలు శ్రేష్టం.ఆమ్ల,క్షార నేలలు పనికిరావు.
నేలతయారీ: నేలను 2-4 సార్లు మెత్తగా దున్ని, 2 సార్లు గుంటకతోలి, చదును చేయాలి.
విత్తనశుద్ధి:కిలో విత్తనానికి 3 గ్రాము ధైరం/కాప్టన్/మాంకొజెబ్తో విత్తనశుద్ధి చేసి విత్తడం వల్ల నేల నుంచి సంక్రమించే తెగుళ్ళను 21 రోజుల వరకు నివారించవచ్చు.
విత్తేదూరం: వరుసల మధ్య 30 సెం.మి మరియు మొక్కల మధ్య 15 సెం.మి ఉండాలి.
విత్తే సమయం:
ప్రాంతం: కోస్తా జిల్లాలు
ఎర్లీ ఖరీఫ్: మే 15 – మే 31
లేట్ ఖరీఫ్: ——
రబీ లేదా వేసవి: డిసెంబరు 15 – జనవరి 15
ప్రాంతం: రాయలసీమ
ఎర్లీ ఖరీఫ్: మే – జూన్
లేట్ ఖరీఫ్: ——
రబీ లేదా వేసవి: జనవరి 2, 3 వారాలు
రకాలు:
రకం: గౌరి
ఋతువు: ఎర్లీ ఖరీఫ్ & రబీ
పంటకాలం(రోజుల్లో): 90
దిగుబడి(కిలోలు ఎకరాకు): 250
నూనె శాతం: 50
గుణగణాలు: ముదురు గోధుమరంగు విత్తనం, కోస్తా జిల్లాలకు అనువైనది.
రకం: మాధవి
ఋతువు: ఎర్లీ ఖరీఫ్ & రబీ
పంటకాలం(రోజుల్లో): 70–75
దిగుబడి(కిలోలు ఎకరాకు): 200
నూనె శాతం: 50-51
గుణగణాలు: లేత గోధుమ రంగు విత్తనం పలుపంటలు సరళిక అనుకూలం
రకం: ఎలమంచిలి-11 (వరాహ)
ఋతువు: ఎర్లీ ఖరీఫ్ &రబీ
పంటకాలం(రోజుల్లో): 80 – 85
దిగుబడి(కిలోలు ఎకరాకు): 360 – 400
నూనె శాతం: 52.5
గుణగణాలు: ముదురు గోధుమరంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. పంట ఒకేసారి కోతకు వస్తుంది.
రకం: ఎలమంచిలి-17(గౌతమ్)
ఋతువు: ఎర్లీ ఖరీఫ్ &రబీ
పంటకాలం(రోజుల్లో): 75 – 80
దిగుబడి(కిలోలు ఎకరాకు): 340
నూనె శాతం: 52.5
గుణగణాలు: లేత గోధుమరంగు విత్తనం కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం, ఆకుమచ్చ తెగుళ్ళను కొంతవరకు తట్టుకొంటుంది.
రకం: ఎలమంచిలి-66(శారద)
ఋతువు: ఖరీఫ్, రబీ/వేసవి
పంటకాలం(రోజుల్లో): 80 – 75, 80 – 85
దిగుబడి(కిలోలు ఎకరాకు): 600
నూనె శాతం: 51.5
గుణగణాలు: లేత గోధుమరంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. బూడిద ఆకు మచ్చ తెగుళ్ళను తట్టుకొంటుంది.
గౌరి, మాధవి, ఎలమంచి – 11,17,66 రకాలు ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనుకూలం.

ఎరువులు: ఖరీఫ్ లో ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్ఫారం ఎరువులు వేసుకోవాలి. నత్రజని సగభాగం, మొత్తం భాస్వరం మరియు పొటాష్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. మిగతా సగభాగం నత్రజని ఎరువును విత్తన నెల రోజులకు కలుపుతీసి వేయాలి. భాస్వరం ఎరువును సింగల్ సూపర్ ఫాస్ఫటే రూపంలో వాడినప్పుడు అదనంగా కాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరగుతుంది.
నీటి యాజమాన్యం(రబీ/వేసవి): విత్తిన వెంటనే మొదటి తడి యివ్వాలి. పూత, కాయ అభివృద్ధి మరియు గింజకట్టు దశల్లో తడులు యివ్వలు. విత్తిన తర్వాత 35 – 40 రోజుల నుండి 55 – 60 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి.
కలుపు, నివారణ, అంతరకృషి: పెండిమిధాలిన్ 30%లేదా అలాక్లోర్ 50% 4-5 మి.ల్లీ లీటరు చొ.న ఏదో ఒక దానిని విత్తిన వెంటనే గాని మరుసటి రోజునగాని పిచికారి చేయాలి. మొక్కలు మొలచిన 15 రోజులకు అదనపు మొక్కలను తీసి వేయాలి. విత్తన 20, 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి.

సస్యరక్షణ:
పురుగులు రసం పీల్చే పురుగులు (తెల్ల నల్లి, తామర పురుగులు, పచ్చ దోమ): పిల్ల,తల్లిపురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చి వేస్తాయి. ఆకులు పాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈ నెలు పొడవుగా సాగి క్రింది వైపుకు ముడుచుకొనిపోయి. దోశె ఆకారంగా మారి పాలిపోతాయి.
నివారణ: మోనోక్రోటోఫాస్ 1.6 మి.ల్లీ లేదా డైమిధోయేట్ 2 మి.ల్లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్లనల్లి నివారణకు డైకొఫాల్ 3 మి.ల్లీ లేదా డైమిధోయేట్ 2 మి.ల్లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకుముడత మరియు కాయతొలుచు పురుగ: తొలిదశలో చిన్న గొంగళి పురుగులు రెండు,మూడు లేత ఆకులను కలిపి గూడుకట్టి లోపలి నుండి ఆకుల్లోని పచ్చని పదార్ధాలన్నీ గోకి తినుట వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడును చేసికొని ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోనూ లేత గింజలను తింటూ పంటకు నష్టం చేస్తాయి.
నివారణ: మోనోక్రోటోఫాస్ 1.6 మి.ల్లీ లేదా క్వినాల్ ఫాస్ 2 మి.ల్లీ లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.ల్లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. పురుగు ఆశించిన ఆకులను పురుగులతో సహ ఏరి నాశనం చేయాలి.

కోడు ఈగ: చిన్న పురుగులు లేత మొగ్గ, పూత తినివేయడం వలన మొగ్గలు పువ్వుగా, కాయలుగా ఏర్పడక గింజ కట్టుక తాలు కాయలు ఏర్పడుతాయి. పురుగు ఆశించిన మొగ్గ మరియు పూత వాడి రాలిపోతుంది.
నివారణ: పురుగు ఆశించిన మొగ్గల్ని మరియు తాలుకాయల్ని ఏరి నాశనం చేయాలి. మొగ్గదశలో డైమిధోయేట్ 2 మి.ల్లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.ల్లీ లేదా ఎసిఫేట్ 1 గ్రా లీటరు నితకి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

బిహారీ గొంగళి పురుగు: తోలి దశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోని పత్రహరితాన్ని గోకి తిని జల్లేడాకులుగా చేస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు ఇతర మొక్కలపైకి ప్రాకుతూ మొగ్గలకు, పువ్వులకు మరియు కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాలను తినేస్తాయి.
నివారణ: పంటలో గుడ్లు లేక గొంగళి పురుగులను గమనించిన వెంటనే ఆకులతో సహ తీసివేసి నాశనం చేయాలి. క్లోరిపైరిఫాస్ 2.5 మి.ల్లీ లేదా ఎసిఫేట్ 1 గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు: ఎండుతెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణనికి మారి వేలాడుతాయి. తదుపరి, ఆకులు అంచులు లోనికి ముడుచుకొని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలేర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమరంగు చారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. తెగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంధ్ర బీజాలు సముదాయం కనిపిస్తుంది. తెగులు కల్గించే శీలింధ్రం భూమిలోను విత్తనాలు మరియు పంట అవశేషాలపై జీవిస్తుంది. భూమిలో అధిక ఉష్ణోగ్రత తెగులు వృద్ధికి దోహదపడుతుంది.
నివారణ: పంట మార్పిడి తిప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రా ధైర్యం లేదా కాప్టన్ లేదా కార్బండిజమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మాంకొజెబ్ 3 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకుమచ్చ(ఆల్టర్నేరియా) తెగులు: గాలిలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు తెగులు అధికంగా వ్యాపిస్తుంది . ఆకులపై కాండము మీద గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమరంగు కలిగిన చిన్న చిన్న వలయకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోతాయి, రాలిపోతాయి.
నివారణ: కిలో విత్తనాలకు 3 గ్రా చొప్పున కార్బండిజమ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంట దశలో కార్బండిజమ్ 1 గ్రా లేక మాంకొజెబ్ 3 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

కాండం ఎండుతెగులు: కాండం మీద గోధుమరంగు మచ్చలు ఏర్పడి క్రమంగా గోధుమరంగు నుండి నల్లగా మారుతుంది.
నివారణ: మాంకొజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ గాని 3 గ్రా లీటరు నితకి చొప్పున కలిపి చల్లుకోవాలి.

వెర్రితెగులు (ఫిల్లోడి): ఈ తెగులు పూత సమయంలో అశిస్తుంది మన ప్రాంతంలో సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో పువ్వులోని భాగలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
నివారణ: ఎలమంచిలి-66 రకం ఈ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన ఒక్కలను పీకి తగలబెట్టాలి. పైరు పై మిధైల్ డెమెటాన్ 1 మి.ల్లీ లేదా డైమిధోయేట్ 2 మి.ల్లీ లీటర్లు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసి దీపపుపురుగును అరికట్టాలి.

బూడిద తెగులు: ఆకులపై బూడిద వంటి పదార్ధం ఏర్పడుతుంది. గింజ బరువు తగ్గుతుంది.
నివారణ: నీటిలో కరిగే గంధకపు పొడి 3 గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
పంటకోత: ఆకులు పసుపురంగుకు మారినప్పుడు, 75% కాయలు లేత పసుపు రంగుకి వచ్చినప్పుడు పైరు కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలకిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి.
నిల్వచేయటం: గింజల్లో తేమశాతం 8 కి తగ్గేవరకు ఆరబెట్టాలి. గోనెసంచుల్లో నిల్వచేయాలి. మధ్య మధ్య పురుగు పట్టకుండా ఎండలో ఆరబెట్టాలి. వేపనూనె 2.5 మి.ల్లీ లేక బూడిద 2.5 గ్రా కిలో విత్తనానికి చొప్పున కలిపిన పురుగు పట్టదు.
ఎగుమతి ప్రాధాన్యత: తెల్లనువ్వు రకాలకు, పొట్టు తొలగించిన నువ్వు పప్పుకు ఎగుమతి ప్రాధాన్యత కలదు.ఒకే పరిమాణం గల నాణ్యమైన విత్తనం. పురుగు మందుల అవశేషాలు లేనిదిగా ఉన్న ఎడల ఎగుమతికి అనుకూలం.

పి.సౌజన్య, ఎస్.రమేష్ బాబు, ఎ.ప్రసన్నరాణి, డా.కె. తేజేశ్వరరావు మరియు డా.జి.రామారావు కృషివిజ్ఞాన కేంద్రం,విజయనగరం జిల్లా

Leave Your Comments

వ్యవసాయ వ్యర్థాలతో పశువుల మేత తయారీ

Previous article

 వర్షధార వ్యవసాయలలో నూనెగింజల సాగు – ప్రాముఖ్యత

Next article

You may also like