అరటి తోటలో అంతర పంటలు సాగుచేస్తూ మెరుగైన దిగుబడులు సాధించవచ్చు. ఏన్కూరు మండలం కు చెందిన యువరైతు యాళ్ల కళ్యాణ్ బిందు తుంపర్ల సేద్యం విధానంలో ఏటా పంటమార్పిడి చేస్తూ ఆదాయానికి బాట వేసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఒక పంటపై నష్టం వచ్చినా మరో పంటతో పూడ్చుకుంటున్నారు.
అరటి ఏడాది పంట. గత పదేళ్లుగా ఐదెకరాల్లో సాధారణ అరటి, కూర అరటి సాగుచేస్తున్నారు. దీనిలో ఏటా అంతర పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం గడిస్తున్నారు. అరటి సాగుకు పెట్టుబడి రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు అవుతుంది. ఎకరాకు 20 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. టన్నుకు రూ. పదివేల ధర పలుకుతుంది. ఎకరాకు రూ. 3 లక్షలు వెరసి మొత్తం ఐదెకరాలకు రూ. 15 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ పంట ఉండగానే అంతరపంటగా తీగ టమాటా సాగు చేస్తున్నారు. ఇది 90 రోజుల పంట. ఎకరాకు రూ. 50 వేలు చొప్పున ఐదెకరాలకు రూ. 2.5 లక్షల ఆదాయం వస్తుంది. పెట్టుబడి రూ. 50 వేలు వేసుకుంటే రూ. 2 లక్షలు మిగులుబాటు అవుతుందని చెప్పారు. వేసవిలో పుచ్చ సాగు చేస్తానని, ఇంచుమించు టమాటా వల్లే మిగులుబాటు ఉంటుందంటున్నారు. మార్కెటింగ్ కష్టాలు కూడా లేకుండా కొత్తగూడెం, ఖమ్మం, వైరా ప్రాంతాల నుంచి వ్యాపారులే ఇక్కడికి వచ్చి కూరగాయలు, అరటి గెలలు తీసుకెళ్తుంటారు. తన అంతర కృషిని చూసేందుకు ఇతర ప్రాంత రైతులు క్షేత్ర ప్రదర్శనకు వస్తున్నారు.
అరటితోటలో అంతరపంటలు సాగు..మెరుగైన దిగుబడులు
Leave Your Comments