ఈ నెల పంటమన వ్యవసాయంవ్యవసాయ పంటలు

అరటిలో ఎరువులు మరియు సూక్ష్మ పోషకాల యాజమాన్యం

0

అరటి సాగులో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్తానంలో వుంది. అరటి సాగులో అత్యంత ముఖ్యమైనది ఎరువులు మరియు సూక్ష్మ పోషకాల యాజమాన్యం. అరటి పంటలో ఎరువులను దేని ఆధారంగా వేస్తె అత్యంత లాభదాయకంగా వుంటుంది, పోషకాల యాజమాన్యం ఎలా చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయో తెలుసుకుందాము.

అరటిలో కొన్ని రకాలు తక్కువ మరికొన్ని రకాలు ఎక్కువ సాంద్రతలో నాటడంవల్ల, ఎకరాల లెక్కన ఎరువులు వేయడం సరైన పద్ధతి కాదు. అరటి పంటకు ఎరువులను ప్రతి చెట్టుకి లెక్కించి వేయాలి.

నత్రజని మరియు పొటాష్ యాజమాన్యం: నత్రజని, పొటాష్ ఎరువులను అరటి చెట్టుకు రెండు వైపులా 30-40 సెం.మీ దూరంలో,10 సెం.మీ లోతు గుంటలలో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన ప్రతిసారీ తేలికపాటి తడి ఇవ్వాలి. ఈ ఎరువుల వాడకాన్ని అరటిలో రెండు రకాలుగా విభజించవచ్చు.

  1. గెల వేయక ముందు: గెల వేయక ముందు 75శాతం నత్రజని, పొటాష్ ఎరువులను వేయాలి. ఈ దశలో హస్తాలు, కాయల సంఖ్యను నిర్ణయిస్తాయి.
  2.  గెల వేసిన తర్వాత: మిగిలిన 25 శాతం నత్రజని, పొటాష్ ఎరువులను వేయాలి. దీని వల్ల కాయల సైజు, గెల నాణ్యత, బరువుతో పాటు దిగుబడులు పెరుగుతాయి.
  1. దీర్గ కాలిక రకాలు: ఉదా. కర్పూర చెక్కర కేళి, కొవ్వూరు బొంత వంటి రకాలు సారవంతమైన నేలలో సాగు చేస్తున్నప్పుడు అరటి పిలక నాటిన తర్వాత 4 దఫాలుగా 45, 90, 135, 180 రోజులల్లో మొక్కకి 50 గ్రాముల చొప్పున 200 గ్రాముల నత్రజని మరియు 200 గ్రాముల పొటాష్ వేసుకోవాలి. ఎర్ర గరప నేలలో సాగు చేసినట్లయితే 6 దఫాలుగా పిలక నాటిన తర్వాత 30, 60, 90, 120, 150 మరియు 180 రోజులల్లో మొక్కకి 50 గ్రామముల చొప్పున 300 గ్రాములు నత్రజని మరియు 300 గ్రాములు పొటాష్ వేసుకోవాలి.
  2. స్వల్ప కాలిక రకాలు: ఉదా. పెద్దపచ్చ అరటి, పొట్టి పచ్చ అరటి. సారవంతమయిన నేలలో సాగు చేసినట్లయితి 4 దఫాలుగా పిలక నాటిన తర్వాత 40, 80, 120, 160 రోజులల్లో మొక్కకి 50 గ్రామముల చొప్పున 200 గ్రాముల నత్రజని మరియు 200 గ్రాముల పొటాష్ వేసుకోవాలి. ఎర్ర గరప నేలలో సాగు చేసినట్లయితే 6 దఫాలుగా పిలక నాటిన తర్వాత 25 , 50, 75, 100, 125 మరియు 150 రోజులలో మొక్కకి 50 గ్రాముల చొప్పున 300 గ్రాములు నత్రజని మరియు 300 గ్రాములు పొటాష్ వేసుకోవాలి.

భాస్వరం ఎరువు వేసే విధానం: అన్ని అరటి రకాల్లో ఒక్కో మొక్కకు 50గ్రా. భాస్వరాన్ని ఇచ్చే ఎరువును వేయాలి. భాస్వరo, మొక్క నాటిన కొద్ది కాలం వరకు మాత్రమే ఉపయోగించుకొంటుంది. భాస్వరపు ఎరువును 300 గ్రా. సూపర్ ఫాస్ఫేటు రూపంలో బాగా చివికిన 5 కిలోల పశువుల ఎరువుతో కలిపి, గుంట నుండి తవ్విన మట్టికి కలిపి గుంతను పూడ్చుకోవాలి. సూపర్ వాడినప్పుడు అందులోని గంధకం, కాల్షియం వంటి సూక్ష్మపోషకాలు కూడా పంటకు లభ్యమవుతాయి. ముఖ్యంగా గమనించవలసింది పై పాటుగా భాస్వరం ఎరువును వేయరాదు.

పోషకాల యాజమాన్యం:

పొటాష్ ధాతు లోపం: అరటి ఆకుల అంచుల వెంబడి పసుపు రంగులోకి మారి, క్రమేపి ఆకు మొత్తం పండుబారి ఎండిపోవును. మొక్కకు 80గ్రా. చొప్పున మ్యూరేట్ ఆఫ్ పోటాష్ 40 రోజుల వ్యవధిలో 4 దఫాలు వేసుకోవాలి. ఆకులపై  సల్పేటు ఆఫ్ పోటాష్ 1 లీటరు నీటికి 5గ్రా.చొప్పున కలిపి పిచికారి చేయాలి.

7 interesting facts about banana flowers – Kumaio®

సూక్ష్మ పోషకాల యాజమాన్యం

జింకు ధాతు లోపం: ఆకుల ఈనెల వెంబడి తెల్లని చారలు ప్రారంభమై ఆకులు పాలిపోయినట్లు కనబడతాయి. ఆకుల అడుగు భాగాన ముదురు ఊదా రంగు ఏర్పడుతుంది. దీని నివారణకు ఒక్కో మొక్కకు 10 గ్రా. జింకు సల్ఫేటు భూమిలో వేయాలి. ఆకులపై 2 గ్రా. జింకు సల్ఫేటును లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

బోరాన్ ధాతు లోపం: ఆకుల ఈనెలు ఉబ్బెత్తుగా ఉండి, ఆకులు బిరుసుగానూ, పెళుసుగానూ ఉండును. ఆకుల పై నిలువుగా (పెద్ద ఈనెకు సమాంతరంగా) చారలు ఏర్పడతాయి. 2 గ్రా. బోరాక్సు మందును లీటరు నీటికి కలిపి ఆకులపై 10 రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారి చేయాలి.

ఇనుము ధాతు లోపం: ఇనుము ధాతువు లోపించినప్పుడు అరటి చెట్టు లేత ఆకులు తెలుపు చారలతో ఉంటాయి. ధాతు లోపం అధికంగా ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెలుపు రంగుకు మారి క్రమేపి ఎండిపోతాయి. అరటి చెట్టు పెరుగుదల తగ్గిపోతుంది. అన్నభేధి 5 గ్రా. , నిమ్మ ఉప్పు 2.5గ్రా. చొప్పున, 1లీ. నీటికి కలిపి, అరటి ఆకులు పూర్తిగా తడిసేలా 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి ఇనుపధాతు లోపాన్ని నివారించవచ్చు.

మాంగనీసు ధాతు లోపం: ఈ మాంగనీసు ధాతులోపం వల్ల ముదురు ఆకులపై నిర్ణీత ఆకారం లేని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగు మచ్చ మధ్యలో ఎండిపోతుంది. లోవం తీవ్రమైనప్పుడు ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. పిలకల లేత ఆకులు, ఆకుమచ్చ చారలతో కూడిన తెలుపు వర్ణము కలిగి ఉంటాయి. లోపం తీవ్రమైనప్పుడు లేత తెలుపు రంగు ఆకులు ఎండిపోతాయి. తల్లి చెట్టు ఎదుగుదల ఆగిపోతుంది. మాంగనీసు సల్ఫేటు 2 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి ఆకులన్ని తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసి మాంగనీసు లోపాన్ని సవరించవచ్చును.

డ్రిప్ పద్ధతిలో ఎరువుల యాజమాన్యం: డ్రిప్ పద్ధతిలో ఎరువులు వేసేటప్పుడు సారవంతమైన నేలల్లో సిఫార్సు చేసిన ఎరువుల మోతాదులో 60 శాతం, తేలిక నేలల్లో (ఎర్ర గరప) సిఫార్సు చేసిన మోతాదులో 75శాతం ఎరువులు వేస్తే సరిపోతుంది.సారవంతమైన నేలల్లో డ్రిప్ పద్ధతిలో 3 వ వారం నుండి 25వ వారం వరకు ప్రతివారం ప్రతి మొక్కకు 10 గ్రా. యూరియా, 7 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇవ్వాలి.మరలా గెల వేసిన తరువాత అంటే 33వ వారం నుంచి 36వ వారం వరకు, ప్రతి వారం మొదలు 139గ్రా. యూరియా, 10 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో నీటిని ఇవ్వడం వల్ల నీటి వినియోగం 40-50 శాతం తగ్గడమే కాకుండా ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. దీని వల్ల మొక్క ఏపుగా పెరిగి మామూలు కన్నా 25-30 రోజులు ముందుగా గెల వస్తుంది. గెలలు త్వరగా పక్వానికి రావడమే కాకుండా గెలల పరిమాణం, నాణ్యత కూడా పెరుగుతుంది.

Increase Banana Cultivation Using Drip Irrigation

టిష్యూ కల్చర్ ద్వారా పెంచిన మొక్కలలో ఎరువుల యాజమాన్యం: పాలిథీన్ సంచుల్లో పెంచిన టిష్యూ మొక్కలు చిన్నవిగా ఉండి, పరిమిత వేరు పెరుగుదల  కలిగి ఉండటం వల్ల మామూలుగా సిఫార్సు చేసిన ఎరువుల మోతాదును సమర్థవంత వినియోగించుకోవు కాబట్టి అరటిలో సిఫారసు చేసిన నత్రజని, పొటాష్ ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కు దఫాలుగా వేయాలి.

టిష్యూ కల్చర్ ద్వారా ప్రవర్ధనం చేయబడి ఎక్కువ సాగులో ఉన్న పచ్చ అరటి రకాలకు, మొక్కలు నాటిన తరువాత నత్రజని, పొటాష్ ఎరువులను ఒక్కొక్క దఫాకు  15 గ్రా. చొప్పున 15,30,45 రోజులకు, 20 గ్రా. చొప్పున60, 75, 90 రోజులకు,30 గ్రా.చొప్పున 110, 120, 150 రోజులకు మొక్కలకు రెండు వైపులా గుంటలలో వేసి మట్టితో కప్పి తేలిక పాటి తడి ఇవ్వాలి.

Increase Banana growth and micronutrients level | Aries AgroBanana Expert System

Leave Your Comments

పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయ పంటల్లో నివారణ చర్యలు మరియు జాగ్రత్తలు

Previous article

బర్డ్ ఫ్లూ దుష్ప్రభావాలు-నియంత్రణా చర్యలు

Next article

You may also like