వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర సభ్యులు సెక్రటేరియట్ లో ఈ రోజు (నవంబర్ 21) వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ఆదర్శరైతుల నియామకం, వ్యవసాయ పనులకు ఉపాధిహామీ పథకం అనుసంధానం, వ్యవసాయ యంత్రాల పనిముట్లపై జిఎస్టీ ఎత్తివేత, విత్తనచట్టంలో మార్పులు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ లను శక్తివంతం చేసేదిశగా చేపట్టాల్సిన చర్యలు మున్నగు వాటి గురించి సవివరంగా చర్చించారు. తర్వాత వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ ఆదర్శరైతుల నియామకంపై కమిషన్ సభ్యుల సూచనలన్నిటినీ క్రోడికరించి ఒక నివేదిక సమర్పించాల్సిందిగా వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ ని ఆదేశించారు. సదరు అంశాన్ని ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకెళ్తానని కమిషన్ సభ్యులకు హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం !
కమిషన్ చర్చించిన మిగతా అంశాలన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివని, విత్తనచట్టంలో మార్పులు, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లపై జీఎస్టీ ఎత్తివేయాల్సిందిగా కేంద్రప్రభుత్వానికి ఇదివరకే విజ్ఙప్తి చేశామని, వ్యవసాయరంగానికి ఉపాధిహామి పథకాన్ని అనుసంధానం అంశాలు కేంద్రప్రభుత్వ పరిశీలనలో ఉందని, అయినప్పటికీ ఈ అంశంపై వివిధ మార్గాలలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారికి హామీ ఇచ్చారు.
ఆత్మ కమిటీల ద్వారా…
ఆత్మ (అగ్రి టెక్నాలజీ మానేజ్మెంట్ ఏజెన్సీ) కమిటీల నియమకాన్నిచేపట్టి త్వరలో వాటి ద్వారా కూడా విస్తరణ కార్యక్రమాలు నిర్వహించి వ్యవసాయరంగానికి నూతనోత్తేజం కల్పించే దిశలో ప్రభుత్వం కృషి చేస్తుందని, కమిటీల ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు మార్గ నిర్దేశ్యం చేయాల్సిందిగా కమిషన్ సభ్యులను మంత్రి కోరారు.
Leave Your Comments