ఉలవల్లో గింజలు బూడిద తెలుపు రంగులో, గోధుమ రంగులో, నలుపు రంగులో ఉండే రకాలున్నాయి. ఈ పంటను సాధారణంగా సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో విత్తుతారు. సాగుచేసే రకాన్ని బట్టి 90 నుంచి 110 రోజుల్లో ఉలవపంట చేతికొస్తుంది. ఎకరాకు ఆరేడు క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుంది.
వంద గ్రాముల ఉలవలలో…
వంద గ్రాముల ఉలవలలో పిండిపదార్థాలు 57 గ్రాములు, మాంసకృత్తులు 22 గ్రాములు, ఖనిజ లవణాలు 3 గ్రాములు, పీచుపదార్థం 3 గ్రాములు, ఇనుము 7 మి.గ్రా., కాల్షియం 287 మి.గ్రా., భాస్వరం 311 మి.గ్రా. పోషకాల ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
విందుభోజనాల్లో ఉలవచారుకు ఉన్న ప్రాముఖ్యత మనకు తెలియంది కాదు. శీతాకాలంలో ఉలవచారు మన ఆహారంలో తీసుకుంటే వెచ్చగా ఉంచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. శరీరంలో వేడిని, శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్నిపెంచుతుంది. ఉలవలపై పొట్టు తొలగించడం, మొలకెత్తించడం, ఉడికించడం,వేయించడం వంటివి చేస్తే దీనిలోని ఫైటిక్ యాసిడ్ గుణం గణనీయంగా తగ్గుతుంది. శరీరంలోని గ్లుకోజ్ ని అదుపు చేసే గుణం ఉలవల్లో ఉంటుంది గనుక మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. బ్లడ్ ప్రెషర్ ( బి.పి.) ని కూడా ఇవి అదుపులో ఉంచుతాయి. రక్త హీనతతో బాధపడే వారు తరచుగా ఉలవలతో చేసిన కషాయంగాని, చారు రూపంలో గానీ తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం వస్తుంది. ఎదిగే పిల్లల్లో శరీర నిర్మాణం పెంపుదలలో తోడ్పడుతాయి. శరీరంలో ఉన్నఅధిక కొవ్వును కరిగిస్తాయని చెబుతారు. ఒక కప్పు ఉలవలకు నాలుగు కప్పుల నీళ్ళు కలిపి కుక్కర్లో ఉడికించాలి. ఇలా తయారైన ఉలవ కట్టును రోజూ ఉదయం పూట చిటికెడు ఉప్పు కలిపి ఖాళీ కడుపుతో తీసుకుంటే క్రమంగా సన్నబడతారని చెబుతారు. ఉలవలను వేయించి ఒక గుడ్డలో కట్టి కాపడం పెడితే దెబ్బల వల్ల కలిగిన నొప్పులు తగ్గుతాయి. ఉలవల వల్ల ఆస్తమా, అల్సర్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. పావు కప్పు ఉలవలను చిటికెడు ఇంగువ, పావు టీ స్పూను అల్లం ముద్ద, పావు టీ స్పూను అతిమధురం వేరు చూర్ణాన్ని, తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి నెలరోజులు తీసుకుంటే అల్సర్లు తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని ఆరోగ్యప్రయోజనాలున్న ఉలవలపై చిన్నచూపెందుకు మీరు ప్రయత్నించి చూడండి.