ఆంధ్రా వ్యవసాయంఆరోగ్యం / జీవన విధానంఆహారశుద్దివ్యవసాయ పంటలు

ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించటం ఎలా ?

0
ఆహార పదార్థాల్లో తక్కువరకం పదార్థాలను కలపడం లేదా  కొన్ని విలువైన పదార్ధాలను తీసివేయడాన్ని కల్తీ అంటారు. మన దేశంలో ఆహార భద్రతా ప్రమాణాలను 2006లో ఏర్పరచిన భారత ఆహారభద్రత, ప్రమాణాల చట్టం నిర్దేశిస్తుంది. ఈ చట్టం ద్వారా భారత ఆహారభద్రత, ప్రమాణాల అధారిటీ ఢిల్లీలో ఏర్పాటైంది. మన దేశ ఆహార ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా పెంచడం దీని లక్ష్యం.
ఆహార పదార్ధాలతో కల్తీ కారణంగా ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఒక్కోసారి మనుషుల ప్రాణాలు కూడ పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కడుపు నొప్పి, పక్షవాతం, కాలేయవ్యాధులు, డయేరియా, రక్తపోటు వంటి వ్యాధులెన్నో కల్తీ పదార్థాలు తినటం వల్ల రావచ్చు.
కల్తీని తెలుసుకొనే విధానాలు:
ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించటానికి చిన్న పరీక్షా విధానాలు, రసాయన పరీక్షలు, ప్రయోగశాలలోనూ కనుగోవచ్చు. ఆహారపదార్ధాలలో జరిగే కల్తీలు, తెలుసుకునే పరీక్షవిధానాల గురించి విపులంగా తెలుసుకుందాం.
1. ఆహార ధాన్యాలు, వాటి ఉత్పత్తులు:
  •  గోధుమలు, బియ్యం, మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, శనగలు, బార్లీ మొదలైన వాటిలో దుమ్ము, రాళ్ళు, పొట్టు, పాడైన ధాన్యం, పురుగులు, ఎలుకల జుట్టు, ఎలుకల విసర్జితాలు, ఎర్గాట్ బూజు వగైరా..కలుషితాలు ఉంటాయి. వీటితో కలుషితమైతే ఉదర వ్యాధి, కాలేయం పాడైపోవటం, క్యాన్సర్ మొదలైనవి రావచ్చు.
       కల్తీని కనుగొనునే పద్ధతి:
  • వీటిని పరీక్షగా చూడటం ద్వారా గుర్తించవచ్చు. ముదురు నీలం లేదా నలుపు రంగులో పొడవైన గింజలు కనిపిస్తే అవి ఎర్గాట్ బూజు గింజలుగా పసిగట్టవచ్చు. అంతేకాకుండా వాటిని 20  శాతం ఉప్పు ద్రావణం కలిపిన గ్లాసు నీళ్ళలో వేస్తే ఎర్గాట్ బూజు గింజలు పైకి తేలుతాయి.
  • కంది పప్పులో కేసరి పప్పు కల్తీ వల్ల పక్షవాతం వచ్చే వీలుంటుంది.
    కేసరి పప్పు కల్తీని కనుగునేందుకు కొంచెం కందిపప్పును ఒక పరీక్షానాళికలో తీసుకొని 50 మి.లీ. సజల హైడ్రోక్లోరికామ్లాన్నివేసి కలిపి 10 నిముషాల సేపు ఉంచండి. పరీక్ష నాళికలో ఎరుపు రంగు కనిపిస్తే కేసరిపప్పు కల్తీ ఉన్నట్లు తెలుసుకోవాలి.
  • పప్పు పదార్థాలలో మిఠాయి రంగు లేదా మెటానిల్ ఎల్లో, లెడ్ క్రోమేట్ వంటివి కల్తీ చేస్తారు. దీనివల్ల క్యాన్సర్, మూర్ఛవ్యాధి రావచ్చు. ఈ కల్తీని కనుగునేందుకు ఒక పరీక్ష నాళికలో కొంచెం పప్పు తీసుకొని దానిలో కొంచెం నీరు, కొంచెం సజల హైడ్రోక్లోరికామ్లాన్నికలపండి. ఎరుపు రంగు కనిపిస్తే మెటానిల్ ఎల్లోతో లేదా లెడ్ క్రోమేట్ తో కల్తీ జరిగిందని గుర్తించాలి.
  •  గోధుమ పిండి, మైదా, రవ్వలలో ఇసుక, ధూళి, పురుగుల కలుషితం వల్ల ఉదర వ్యాధి, కాలేయం పాడైపోవటం, క్యాన్సర్ వ్యాధి, రక్తహీనత వంటివి సంభవిస్తాయి. ఈ కల్తీని కనుగొనేందుకు కొంచెం పిండిని 10 మి.లీ. కార్బన్స్ టెట్రాక్లోరైడ్ లో కలపాలి. కొంతసేపటికి పరీక్ష నాళిక అడుగు భాగంలో ఇసుక, ధూళి చేరుతుంది. ఒక గ్లాసులో కొంచెం గోధుమపిండిని వేసినప్పుడు పిండిలో తవుడు ఉన్నట్లయితే అది పాత్రలోని నీటి పై భాగంలో తేలుతుంది. ఒక పరీక్ష నాళికలో కొంచెం గోధుమపిండిని వేసి, పిండిలో కొంచెం గాఢ హైడ్రో క్లోరికామ్లాన్నికలిపినప్పుడు ఆ పిండిలో చాక్ పొడి ఉన్నట్లయితే పాత్రలో పొంగు కనిపిస్తుంది.
  • శనగ పిండిలో కేసరి పిండిని కల్తీ చేయడం వల్ల పక్షవాతం, కుష్టు వ్యాధులు సంభవించవచ్చు.ఈ కల్తీని కనుగొనేందుకు ఒక పరీక్ష నాళికలో కొంచెం శనగపిండిని తీసుకొని 50 మి.లీ. సజల హైడ్రోక్లోరికామ్లాన్ని కలిపి 15 నిముషాలు వేడిచేసినప్పుడు పరీక్ష నాళికలో గులాబి రంగు నుంచి ఎరుపు రంగు కనిపించినట్లయితే కల్తీ జరిగిందని చెప్పవచ్చు.
  • బొంబాయి రవ్వలో ఇనుపరజను కల్తీ చేయటం వల్ల చిన్న పేగులు దెబ్బతింటాయి.
    ఈ కల్తీని కనుగొనేందుకు రవ్వలో అయస్కాంతం ఉంచితే ఇనుపరజను దానికి అతుక్కుంటుంది.
2. నూనెలు, కొవ్వు పదార్థాలు:
  •  వంట నూనెలో ఆర్జిమోనిన్, మినరల్ నూనె లేదా ఖనిజ నూనెతో కల్తీ చేస్తారు. ఈ కల్తీ వల్ల ఉబ్బురోగవ్యాధి, గ్లకోమా, హృదయ, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, బెరిబెరి వ్యాధులు వంటివి రావచ్చు.
    ఈ కల్తీని కనుగొనేందుకు పరీక్ష చేయదలచిన వంటనూనెకు గాఢ నత్రికామ్లాన్ని వేసి బాగా కలపాలి. ఆమ్ల ద్రావణంలో ఎరుపు ఇటుకరాయి రంగు కనిపిస్తే  తీసుకున్న నూనెలో కల్తీ ఉందని తెలుస్తుంది. ఒక స్పూన్ నూనెలో 2మి.లీ. నైట్రోజన్ ఆల్కహాలిక్ పొటాష్ ను కలపాలి. మరిగే నీటిలో పరీక్షనాళికను ముంచి 15 నిముషాలు ఉంచాలి. శుభ్రం అయిన తర్వాత 10 మి.లీ. మరిగిన నీరు కలపాలి. ఏదైనా జిడ్డు కనిపిస్తే ఖనిజ నూనె కలిపినట్లు తెలుస్తుంది.
  • కొబ్బరి నూనెలో ఆముదం కల్తీ చేస్తారు. ఈ నూనెను వంటకు వాడితే వాంతులు, విరేచనాలు, ఫిట్స్, శరీరంలో నీరు చేరటం వంటివి జరగవచ్చు. ఈ కల్తీని కనుగొనేందుకు ఒక పరీక్షనాళికలో 1 మి.లీ. నూనె తీసుకొని 10 మి.లీ. ఎసిడిఫైడ్ పెట్రోలియం ఈథర్ ను వేసి బాగా కలిపి ఒక చుక్క గాఢ సల్ఫ్యూరికామ్లంతో తయారు చేసిన అమ్మోనియం మాలిబ్డేట్ ద్రావణం వేయాలి. వెంటనే పరీక్షనాళిక అడుగుభాగం నుంచి మబ్బుతెర కనిపిస్తే కొబ్బరి నూనె ఆముదంతో కల్తీ చేసినట్లు తెలుస్తుంది లేదా కొబ్బరి నూనెను ఫ్రీజరులో ఉంచినప్పుడు కల్తీ లేని కొబ్బరి నూనె అయితే గడ్డకడుతుంది. నూనెలో కల్తీ అయితే గడ్డ కట్టదు.
  • నెయ్యిలో బంగాళదుంప, చిలగడదుంప గుజ్జు కలుపుతుంటారు. ఈ కల్తీ వల్ల అజీర్తి, కాలేయ, హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయి. దీనిని గుర్తించేందుకు ఒక అర టీ స్పూన్ నెయ్యిని గాజు పాత్రలో వేసి దానికి 2- 3 చుక్కలు అయోడిన్ కలిపినప్పుడు నీలిరంగు వస్తే అది దుంపల గుజ్జుతో కల్తీ అయిన నెయ్యిగా గుర్తించాలి.
3. పాలు, పాల పదార్థాలు:
  • పాలలో కలుషితమైన నీరు, యూరియా, పిండి పదార్థాలు, నీరు, కొవ్వు పదార్ధాలు, బట్టల సోడా, డిటెర్జెంట్ పౌడర్ వంటివి కలుపుతుంటారు. వీటితో కల్తీ చేసిన పాలు తాగితే వికారంగా ఉండడం, కడుపు నొప్పి, విరేచనాలు, అపాన వాయువు ఏర్పడటం, చర్మ వ్యాధులు, శ్వాసకోశం దెబ్బ తినటం,పేగులకు హాని చేయడం, మూత్ర ద్వారంలో దురద, పాలలో పోషక విలువలు తగ్గడం వంటివి గమనించవచ్చు.
  • కలుషితమైన నీరు కల్తీని తెలుసుకునేందుకు ఒక చుక్క పాలు మెరిసే జారుగా ఉన్న స్థలంలో వేస్తే ఆ చుక్క పాలు ఆగిపోవచ్చు లేదా నెమ్మదిగా జారటం వల్ల అక్కడ తెల్లని గుర్తు పడవచ్చు. కల్తీ పాలు అయితే వెంటనే జారిపోతాయి.
  • నీరు, కొవ్వు పదార్ధాల కల్తీ తెలుసుకునేందుకు లాక్టో మీటరుతో పాల సాంద్రతను పరీక్షించినపుడు మామూలు పాలలో అయితే విలువలు 1,030 లాక్టో మీటర్ తో పాలను పరీక్షచేసినప్పుడు వాటిలో కొవ్వు పదార్థాలతో కూడిన పాల విలువ 1030 కంటే ఎక్కువ ఉంటుంది
  •  పిండి పదార్థాల కల్తీని తెలుసుకునేందుకు పరీక్షానాళికలో కొన్నిపాలు తీసుకొని దానిని వేడి చేసి చల్లార్చి రెండు, మూడు చుక్కలు అయోడిన్ కలిపితే వెంటనే నీలి రంగు వచ్చినట్లయితే పిండి పదార్ధంతో కల్తీ అయినట్లు తెలుస్తుంది.
  • యూరియాతో కల్తీని గుర్తించేందుకు పరీక్ష నాళికలో ఒక స్పూను పాలు తీసుకొని రెండు చుక్కలు మోతైమాల్ నీలి ద్రావణం వేసినప్పుడు యూరియా కలిపిన పాలు పది నిమిషాల తర్వాత నీలి రంగులోకి మారుతాయి. యూరియేన్ స్ట్రిప్స్ తో కూడా ఈ పరీక్ష చేయవచ్చు. యూరియేన్ స్ట్రిప్స్ పై ఒక స్పూన్ పాలు వేసినప్పుడు నీలం రంగులోకి మారితే కల్తీ ఉందని తెలుస్తుంది.
  • బట్టల సోడా, డిటెర్జెంట్ పౌడర్ తో కల్తీని తెలుసుకునేందుకు ఒక పరీక్ష నాళికలో స్పూన్ పాలు తీసుకొని బ్రొమోక్రిసాల్ నీలి ద్రావణం వేయాలి. 10 నిమిషాల తర్వాత కల్తీపాలు ముదురు నీలి రంగుకు మారుతాయి.
       4. పంచదార, బెల్లం, తేనె:
  • పంచదారలోసుద్ద ముక్కపొడి ఇసుక, రాళ్ళుకలుపుతారు. వీటితో కల్తీ వల్ల ఉదర వ్యాధులు, చిన్నపేగులకు హాని కలగడం జరగొచ్చు. ఒక గ్లాసు నీటిలో పంచదారను కరిగించి కదపకుండా ఉంచితే సుద్దముక్క పొడితో కల్తీ అయితే సుద్దముక్క పొడి గ్లాసులో కిందికి చేరుతుంది. కొంచెం పంచదారను ఒక గ్లాసు నీళ్ళలో వేసినప్పుడు పంచదార నీటిలో కరిగిపోతుంది. కానీ ఇసుక, రాళ్ళు నీటిలో కరగకుండా అడుగుకి చేరతాయి.
  • తేనెలో పంచదార, బెల్లం పాకం కలుపుతుంటారు. దీనివల్ల ధన నష్టమేగాకుండా ఆ తేనె   నిల్వ ఉండదు. ఈ కల్తీని కనుగొనేందుకు కొంచెం దూదిని తేనెలో ముంచి అదూదిని అగ్గిపుల్లతో కాలిస్తే కల్తీ లేని తేనె బాగా మండుతుంది. కల్తీ ఉన్నట్లయితే దానిలో ఉన్న నీరు దూదిని కాలనివ్వదు. కాలినా చిటపట శబ్దం వస్తుంది.
  • బెల్లంలో మిఠాయి రంగు లేదా మెటానిల్ ఎల్లో కల్తీ చేస్తుంటారు. వీటితో కల్తీవల్ల మగవారిలో టెస్టిస్ దెబ్బ తింటాయి. ఈ కల్తీని కనుగొనేందుకు కొంచెం బెల్లం తీసుకొని దానికి ఒక మి.లీ. హైడ్రోక్లోరికామ్లాన్ని  కలపాలి. అప్పుడు లేత ఎరుపు (పింక్) రంగు కనిపిస్తే దానిలో మెటానిల్ ఎల్లో కల్తీ ఉందని గుర్తించాలి.
    ఆహారపదార్థాల్లో కల్తీని గురించి మరిన్ని వివరాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్.ఎమ్. అండ్ సి.ఎస్., సామాజిక విజ్ఞాన కళాశాల, గుంటూరు, ఫోన్ నంబర్: 0863-2235106, 9490719823 వారిని సంప్రదించవచ్చు.

    ఎన్. నాగేంద్ర బాబు, శాస్త్రవేత్త (విస్తరణ)
         డా. కె. ఫణి కుమార్, ప్రధాన శాస్త్రవేత్త (కీటక శాస్త్రం)
                   ఏరువాక కేంద్రం, ఏలూరు జిల్లా.

Leave Your Comments

యాసంగి వరిలో జింక్ లోపం సమస్య – ఎలా గుర్తించి, నివారించాలి ?

Previous article

ఏపీలో ఖరీఫ్ పంటల ముందస్తు అంచనా ధరలు… నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎలా ఉండొచ్చు ?

Next article

You may also like