ఆంధ్రా వ్యవసాయంవార్తలు

జూలై 6 నుంచి 10  వరకు అనంతపురం, కర్నూల్ జిల్లాల రైతులకు సేద్య సూచనలు

0

Andhra Pradesh Weather Report :  ఉభయ అనంతపురం జిల్లాలో జూలై 7 మరియు 9 వ తేదిలలో చిరుజల్లుల వర్షపాత సూచనలున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 36.6-37.4  డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6-26.4 డిగ్రీల సెల్సియస్ నమోదుకావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 8.0 కి.మీ వేగంతో వీచే అవకాశముంది. గాలిలో తేమ ఉదయo పూట 62-67 శాతం,  మధ్యాహ్నం పూట 42-52 శాతం నమోదయ్యేఅవకాశముంది.

ఉభయ కర్నూల్ జిల్లాలో జూలై 8 నుండి 10 వ తేదిలలో తేలికపాటి వర్షపాత సూచనలున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 34.0-35.8 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 25.5-26.7 డిగ్రీల సెల్సియస్ నమోదుకావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 6.0 కి.మీ వేగంతో వీచే అవకాశముంది. గాలిలో తేమ ఉదయo పూట 65-78 శాతం, మధ్యాహ్నం పూట 33-48 శాతం నమోదయ్యేఅవకాశం ఉంది.

వర్షాధారపు పoటలను సరైన సమయంలో విత్తుకోడానికి విత్తనాలు, ఎరువులు, పురుగు ముందులు సేకరిoచుకొని నేలలో ఉన్న తేమను బట్టి వేరుశనగ, కంది, మొక్కజొన్న, సజ్జ, ఆముదం పంటలను విత్తుకోవాలి. రైతులు వర్షాధారoగా సాగుచేసే పంటల్లో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా చేయడం వలన మొదటి 20-30 రోజుల్లో వచ్చే కీటకాలు, తెగుళ్ళ వ్యాప్తి తక్కువగా ఉంటుంది.

వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు…
* ప్రస్తుతం జూన్ మొదటి వారంలో విత్తిన వేరుశనగ పంట శాఖీయ దశలో ఉంది. రైతులు అంతర సేద్యం చేసుకోవాలి.

* ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు ఆశించడానికి అనుకూలము. రసం పీల్చే పురుగుల ఉధృతిని గమనించడానికి వేరుశెనగ పొలంలో జిగట అట్టలు
( ఎకరానికి10) , ఫెరోమోన్ ట్రాప్స్ (ఎకరానికి 4) అమర్చుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 0.3 మి.లీ/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు నివారణకు పంట విత్తిన 10-15 రోజులలోపు ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి మగ రెక్కల పురుగులను ఆకర్షించాలి. ఎకరాకి 20 పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. 5 శాతం వేప గింజల కషాయంను గుడ్లు, పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు
పిచికారీ చేయాలి. క్వినాల్ ఫాస్ 2.0 మి.లీ. లేక వేపనూనె 5.0 మి.లీ./ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వాలకు ఏమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీ/ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
* ప్రస్తుతం పత్తి పంట కొన్ని ప్రాంతాలలో మొలక దశ నుండి పూత దశలో ఉంది. పత్తి విత్తిన రైతులు విత్తిన 20-30 రోజులప్పుడు గొర్రు,  గుంటకలతో అంతరకృషి ద్వారా కలుపు నివారణ చేయాలి.
* ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రసం పిల్చు పురుగుల ఉధృతికి అనుకూలంగా ఉన్నాయి. తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగులను అదుపు చేయాటానికి వేప నూనె 5.0 మీ.లీ లేదా 5 % వేప గింజల కషాయాన్ని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ ఉధృతిని గమనించడానికి పొలంలో పసుపు రంగు జిగట అట్టలు (ఎకరానికి 10), త్రిప్స్ ఉధృతిని గమనించడానికి ఎకరాకు 10 బ్లూ స్టికీ ట్రాప్‌లను ఏర్పాటు చేయాలి. ఉధృతిని బట్టి ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ లేదా థయామిథాక్సామ్ 25 WG  0.2 లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రా./లీటర్ నీటికి చొప్పున పిచికారి చేయాలి.
* రైతులు కూరగాయల పంటలను నాట్లు వేసే ముందు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ మరియు కార్బెండజిమ్ 3 గ్రా. కలిపిన మందు ద్రావణoలో వేర్లు ముంచిన తరువాత నాట్లు వేసుకోవాలి.

డా. ఎం. విజయ శంకర్ బాబు,
డా. జి. నారాయణ స్వామి,
డా. జి.డి. ఉమాదేవి,
వ్యవసాయ పరిశోధన స్థానం,
అనంతపురం

Leave Your Comments

జూలై 3 నుండి 7వ తేదీ వరకు పంటల సాగులో ఈ సూచనలు పాటించండి…

Previous article

నేరేడు పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

Next article

You may also like