ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

Vineyard: ద్రాక్ష తోటల్లో సస్యరక్షణ చర్యలు

0
Vineyard
Vineyard

Vineyard: ద్రాక్ష దిగుబడిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది .మన దేశంలో ద్రాక్ష పంటను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువగా సాగుచేస్తున్నారు. ద్రాక్ష పంటను ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ సాగుచేస్తున్నారు. ద్రాక్షలో ముఖ్యంగా పెంకు పురుగులు, కాండం తొలిచే పురుగు, పిండినల్లి, తామర పురుగులు, ఎర్ర నల్లి.

Vineyard

Vineyard

పెంకు పురుగులు(ఫ్లీ బీటిల్):-

ఫ్లీ పెంకు పురుగులు నలుపు రంగులో ఉండి కోడిగుడ్డు ఆకారంలో శరీరాన్ని కలిగి ఉండి చిన్నవిగా ఉంటాయి. పెంకు పురుగులు వాటి గుడ్లను భూమిలో పెడతాయి సుమారు 20-40 గుడ్లు పెడుతుంది . ఈ పురుగుల లార్వాలు మట్టిలో ఉంటూ,వేర్లను మరియు వేర్లపై చర్మాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పెరిగిన తరవాత లేత మొక్కలను మరియు లేత పూ మొగ్గలను తింటాయి. కలుపు మొక్కలను ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుంటాయి . పెరిగిన రెక్కల పెంకుపురుగులు ద్రాక్ష ఆకులకు చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి.మొక్కల కణజాలాన్ని పూర్తిగా నష్టపరిచి కణజాలం చుట్టూ పసుపు పచ్చ రంగు వలయం ఏర్పరుస్తాయి .దీని ఉధృతి సాధారణంగా మార్చి మరియు మే మాసాలలో కనిపిస్తుంది. ఇవి ముఖ్యంగా పూత మొగ్గలను మరియు ఆకులను పిందెలను ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. పెంకు పురుగులు ఆశించి కొరికి తినడం వలన చిగుర్లు విచ్చుకోక చనిపోతాయి .
జీవిత దశలు :- పెంకు తల్లి పురుగులు సుమారుగా 20-40 గుడ్లను భూమిలో పెడతాయి .ఇవి 4 నుండి 8 రోజుల్లో గుడ్లు పొదగబడి గొంగళి పురుగులు (లేదా) లార్వా(గ్రబ్స్) గా మారుతాయి . ఒక ఆడ పెంకు పురుగు తన జీవితకాలంలో సుమారుగా 250 – 350 గుడ్లు పెడుతుంది.గుడ్ల నుండి పొదిగిన గొంగళి పురుగులు లేత గోధుమ రంగులో ఉంటాయి.

కోశస్థదశ:- కోశస్థ దశలో గోధుమ రంగులో మట్టిలో కప్పబడి ఉంటుంది. కోశస్థ దశను 7-11 రోజుల వ్యవధిలో పూర్తి చేసుకుంటుంది.

నివారణ చర్యలు:-

కత్తిరింపుల తర్వాత 5 వ రోజు క్లోరిఫైరీఫాస్ 2.5 ml లీటరు నీటికి పిచికారి చేయాలి. 10 వ రోజు మరియు 16 వ రోజు ఇమిడాక్లోప్రిడ్ SL 0.4 మి.లీ లీటరు నీటికి పిచికారి చేయడం వలన శీతాకాలపు కత్తిరింపుల తర్వాత 20 రోజుల వరకు పురుగులు ఆశించవు. చీమలు మొక్క కాండం ద్వారా పైకి ఎక్కకుండా భూమి రెండు అడుగుల తర్వాత కాండం పైన ఉన్న బెరడు మూడు అంచుల మందం చుట్టూ తీసివేసి 10 రోజులకు ఒకసారి 10 రోజుల తర్వాత మిథైల్ పారథిమాన్ పౌడర్ గాని క్లోరిఫైరీఫాస్ పౌడర్ పూయడం వలన చీమలు ఎగబాకటం అరికట్టవచ్చు.

1)తామర పురుగులు:-

తామర పురుగులు 1-2 మిమి పొడవు ,పసుపు లేదా నలుపు రంగులోనూ ఉంటాయి. తామర పురుగులకు రెండు జతల రెక్కలు ఉంటే మరికొన్ని పురుగులకు అసలు రెక్కలు ఉండవు. మొక్కల అవశేషాలలో మట్టిలో లేదా ఇతర ఆతిథ్య మొక్కలపైన ఇవి నిద్రావస్థలో ఉంటాయి. పొడి మరియు వేడి వాతావరణం వీటి ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. పిల్ల పురుగులు లేక ఆకులను లేత కొమ్మలను అప్పుడే బయటకి వస్తున్న మరియు వచ్చిన పుష్పగుచ్చాలను ఆశిస్తాయి. ఆకులను ఆశించినప్పుడు ఆకుల పైభాగం కణాలను గీకుతూ రసాన్ని పీల్చడం వలన ఆ కణాలు చనిపోయి ఆకులు పైకి ముడుచుకొని ఉంటాయి. చిన్న వెండి చారలు ఆకుల ఈనెల మధ్యభాగంపై కనిపిస్తాయి. ఆకుల క్రింది భాగంలో తల్లి మరియు పిల్ల పురుగులు రసాన్ని పీలుస్తాయి. రసం పీల్చిన తర్వాత ఆకులు పసుపు రంగులోకి మారి రూపు మారిపోవడం జరుగుతుంది. పూ మొగ్గలను ఆశించిన ఎడల మొగ్గలు ఎండిపోవడం, కాయలు ఏర్పడిన వెంటనే వాటిని ఆశించి కాయల ఉపరితలంపై కణజాలంలోని కణాలను గీకుతూ రసాన్ని పీల్చడం వలన కాయలపై గోధుమ రంగు వలయాలు ఏర్పడతాయి కాయలు పెరిగినప్పుడు కాయల మీద పగుళ్లు ఏర్పడతాయి.

2)తామర పురుగుల నివారణ చర్యలు:-

వైరస్ మరియు తామర పురుగులు ఆశించినటువంటి ఎంపిక చేయబడిన గ్రీన్ హౌసులలో మరియు మొక్కల నర్సరీలలో పెంచిన అంటు మొక్కలను ఉపయోగించాలి.
చివరి భాగాలను కత్తిరించకుండా కొమ్మలు మొదలయ్యే ప్రాంతానికి మరియు కనులకు కొద్దిగా పైన కత్తిరించండి.
వేప నూనె 1500 పిపియమ్ 5మి.లీ /లీటరు నీటికి దానితోపాటు టిఫాల్ 3 మి.లీ కలిపి పిచికారి చేయాలి.
ఫిప్రోనిల్, డైఫెంథియురాన్ 1.5గ్రా. లీటరు నీటికి / స్పైనిటారమ్ 0.2 మి.లీ మార్చి మార్చి పిచికారి చేయాలి .
నీలం రంగు జిగురు పట్టలను ఎకరాకు 4 చొప్పున అమర్చుకోవాలి.
కోతలు కోసే నెల రోజుల ముందు నుంచే రసాయనాల పురుగుల మందులు వాడకం ఆపివేయాలి.
ఇమిడాక్లోప్రిడ్ 200ఎస్ ఎల్ 0.4 మి.లీ లీటరు నీటికి పిచికారి చేసినట్లయితే 24 రోజుల వరకు తామర పిల్ల పురుగులు మొక్కలను ఆశించకుండా ఉంటాయి.

3) పిండినల్లి :-

తల్లి మరియు పిల్ల పురుగులు అండాకారపు గులాబీ రంగు శరీరం మరియు దూది వంటి మెత్తటి పదార్థంతో కప్పబడి ఉంటాయి . పిండినల్లి గ్రుడ్లను చీమలు మోసుకెళ్ళి ద్రాక్ష గుత్తులలో పెట్టడం వలన పిల్ల పురుగులు వెలువడి రసం పీల్చడం ద్రాక్ష గుత్తులు నాశనం కావడానికి ఆస్కారమున్నది. కావున ఇవి గుంపులుగా ఆకుల అడుగుభాగాన్ని కొమ్మలపై మరియు పండ్లను ఆశించి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి. పిండి నల్లి ఎక్కువ అయినచో పండ్లు రాలి క్రింద పడతాయి. ఇవి తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వలన మసి తెగులు వృద్ధి చెంది చెట్ల కాపు కూడా తగ్గుతుంది.

పిండి నల్లి నివారణ చర్యలు:- థయోమిథాక్సామ్ 25 డబ్లు జీ @0.4గ్రా, ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యూ జీ 0.08 గ్రా నుండి 0.012గ్రా లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి .
అల్లిక రెక్కల పెరుగు (క్రిసోపా) మరియు అక్షింతల పురుగు (క్రిప్టోమస్ మంట్రాజెరి) అనే బడనికలనం మిత్ర పురుగులు తోటలలో విడుదల చేసి నీటిని నివారించవచ్చు.

4) ఎర్రనల్లి :-

మగ నల్లి పసుపు రంగులో ఉండి వెనుక భాగంలో రెండు ఎర్రటి మచ్చలు 0.33 మీ మీ కన్నా పొడవు ఉంటుంది.
ఆడ నెల్లి మోగనల్లి కంటే పొడవు 0.35 మి.మీ ల కొలత ఉంటాయి.
ఇవి ఎరుపు శరీరంతో వెనుక భాగంలో ముత్యాల వంటి మచ్చల నుండి పొడుచుకొని వచ్చిన బలమైన తెల్లటి వెంట్రుకలతో ఉంటాయి. పండ్లపై ఉన్న మొగ్గలపై ,ఆకుల దిగువ భాగంలో ఎర్రటి గుడ్లను పెడుతుంది.
ఆకులపై ప్రధాన ఈనెలపై వెంట తేలికపాటి కాంస్య రంగు మచ్చలు కనిపిస్తాయి .నల్లి పీల్చటం వల్ల చిన్న చిన్న మచ్చలు వ్యాప్తి చెందవచ్చు ,తర్వాత తుప్పు గోధుమ రంగులోకి మారతాయి. ఆకులు పై భాగంలో ముడుచుకొని మొగ్గలు మరియు పండ్లు ముందుగానే రాలిపోవడం జరుగుతుంది.
ద్రాక్ష తోటల్లో ప్రధానంగా బూజు తెగులు, బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు మరియు తుప్పు తెగులు ఎక్కువగా సోకుతాయి.
బూజు తెగులు:- ప్లాస్మాపారా విటికోల అనే శిలీంద్రం వల్ల వస్తుంది.

లక్షణాలు:- శీతాకాలం కత్తిరింపుల తర్వాత ఆకులు,కొమ్మలు మరియు అపరిపక్వ పండ్లపై ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఆకులపై ఉపరితలంపై లేత పసుపు ఆకుపచ్చ జిడ్డు మచ్చలు ఏర్పడతాయి,ఇవి క్రమంగా గోధుమ రంగులోకి మారుతాయి సంబంధిత దిగువ ఉపరితలంపై తెల్లటి శిలీధ్రం బూజు వృద్ధి చెందుతుంది.తీవ్రంగా తెగులు సోకిన ఆకులు ముందుగానే రాలిపోతాయి. కొమ్మలపై మరియు పుష్ప గుచ్చాలపై శిలీంద్రం బూజు ఏర్పడి ,తరువాత గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. పండ్లపై కూడా శిలీంద్రం వృద్ధి చెంది , తోలు మృదువుగా మారి ముడుచుకొని ,మృదువుగా తెగులు లక్షణాలు కనిపిస్తాయి. పండ్లపై పగుళ్లు రావు.

Vineyard

Vineyard

వ్యాప్తి: తెగులు సోకిన ఆకులలో ఉన్న ఊస్పోర్స్ మరియు కొమ్మలలో నిద్రాణమైన శిలీంద్రం మైసీలియం ద్వారా తెగులు సోకుతుంది .
శిలీంద్రం యొక్క స్పొరాంగియా మరియు జూస్పోర్ లు వర్షాలలో చిమ్మిన నీటి బిందువుల ద్వారా వ్యాపిస్తాయి.

అనుకూల పరిస్థితులు:- అధిక వర్షపాతం మరియు గాలిలో తేమ శాతం 80-100% ఈ తెగులు కు అనుకూలం , మరియు ఉష్ణోగ్రత 20-22°c అనుకూలం.

యాజమాన్యం:- వాతావరణ పరిస్థితులు తెగులుకు అనుకూలంగా ఉంటే 26-28 రోజులలో డైమిథోమార్ఫ్ 75 WP 1 గ్రా + మాంకోజెబ్ 75 WP 2గ్రా లీటరు నీటికి. కలిపి పిచికారి చేయాలి.
32-35 రోజులలో ఫోసటైల్ అల్యూమినియం 80WP 2గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
40-45 రోజుల్లో అజాక్సిస్ట్రోబిన్ 23 SC 0.5ml లేదా ఫోమాక్సొడాన్ 16.6%+ సెమోక్షానిల్ 22% (38.7 SC) 0.6 ml 8-10 రోజుల వ్యవధితో పిచికారి చేయడం వల్ల ఈ తెగులును అరికట్టవచ్చు.
బూడిద తెగులు:- అన్సినూలా నెకెటర్ అనే శిలీంద్రం వల్ల వస్తుంది.

లక్షణాలు:- కత్తిరింపుల తరువాత ఆకు, కాండం మరియు పండ్ల కొమ్మలపై శిలీంద్రం యొక్క తెల్లటి పొడి వృద్ధి చెందుతుంది, తరువాత గోధుమ రంగులోకి మారి ,ఆ తర్వాత నల్లగా మారుతాయి. పుష్పగుచ్ఛాలపై సోకినప్పుడు, పువ్వులు ముడత వచ్చి రాలిపోతాయి. పండ్లకు సోకినప్పుడు ముదురు రంగులోకి మారి పగుళ్లు ఏర్పడతాయి.

వ్యాప్తి : తెగులు సోకిన కొమ్మలు మరియు మొగ్గలలో నిద్రాణమైన శిలీంద్రం మైసీలియం మరియు కొనిడియా ,గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.

అనుకూల పరిస్థితులు:- పొడి వాతావరణం మరియు గాలిలో తేమశాతం 57.6 నుండి 68.2% ఉష్ణోగ్రత 20 నుండి 22 డిగ్రీల సెల్సియస్ ఈ తెగులుకు అనుకూలం.

యాజమాన్యం:- కత్తిరింపుల తర్వాత వాతావరణం అనుకూలంగా ఉంటే అకర్బన సల్ఫర్ 0.25% / డైనోకాప్ 0.05% పిచికారి చేయాలి,65వ రోజు మరియు 75వ హెక్సాకొనజోల్ 5 SC 1 మి.లీ + పొటాషియం బైకార్బొనేట్ 5 గ్రా మరియు టెబుకొనజోల్ 250EC 0.75 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
85 వ రోజు మైక్లోబూటానిల్ 10%wp 0.4 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచకారి చేయాలి.
90 వ మరియు 105 రోజులకు ట్రైఫాక్సిస్ట్రోబిన్ 25%SC+టెబుకొనజోల్ 50% SC (75 WG SC) 0.25 గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
120 వ రోజు అజాక్సిస్ట్రోబిన్ 23 SC 0.5 మి లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పక్షి కన్ను తెగులు:- ఎల్సినో ఆంఫెలినా అనే శిలీంధ్రం వల్ల వస్తుంది

లక్షణాలు:- ఆకులపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మధ్యలో బూడిద రంగులోకి మారి మచ్చలో కణజాలం ఎండిపోయి పడిపోతుంది (షాట్ హోల్). కొమ్మలు , కాండంపై గోధుమ రంగు పల్లపు మచ్చలు ఏర్పడి క్యాంకర్ గా మారతాయి. పండ్లపై ముదురు ఎరుపు రంగు మచ్చలు ఏర్పడి మధ్యలో బూడిద రంగులోకి మారి పక్షి కంటి తెగులు రూపాన్ని ఇస్తుంది.

వ్యాప్తి:- తెగులు సోకిన కొమ్మలు మరియు ఆకులలో నిద్రాణమైన శిలీంద్ర మైసీలియం, మరియు ఆస్కోస్పోర్ని మరియు కొనిడియా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.

అనుకూల పరిస్థితులు:- వాతావరణ ఉష్ణోగ్రత 10-35 °c , గాలిలో తేమశాతం 80-95% ఉండటం వల్ల ఈ తెగులు వృద్ధి చెందుతుంది.

యాజమాన్యం:- కత్తిరింపుల తర్వాత బోర్డాక్స్ మిశ్రమం ఒక శాతం పిచికారి చేయాలి.
10 వ రోజు కాపర్ సల్ఫేట్ 4.62% 0.8 మి.లీ / కాపర్ హైడ్రాక్సైడ్ 72%WP 2.5-3 గ్రా./ మాంకొజెబ్ 75WP 2గ్రా/లీటరు లేదా డైమితోమార్ఫ్ 75%WP 1.5-1.75గ్రా.లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారి చేసుకోవాలి.

తుప్పు తెగులు :- ఫాకోప్సోరా వైటిస్ అనే శిలీంద్రం వల్ల వస్తుంది.

లక్షణాలు :- ఆకుల దిగువ ఉపరితలంపై పసుపు- నారింజ రంగు యురీడియల్ స్పోర్స్ ఏర్పడతాయి. సంబంధిత ఎగువ ఉపరితలం గోదుమ రంగులోకి మారి, ఆకులు రాలిపోతాయి. తెగులు తీవ్రంగా ఉంటే కొమ్మలు, కాండంపై మరియు పండ్లపై యురీడియల్ స్పోర్స్ ఏర్పడతాయి. కొద్ది రోజుల తర్వాత యురీడియల్ స్పార్స్ , ముదురు గోదుమ రంగు టిలియా విస్ఫోటనాలుగా అభివృద్ది చెందుతుంది.

వ్యాప్తి:- తెగులు సోకిన కొమ్మల్లో యురిడియల్ స్పోర్స్, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.

అనుకూల పరిస్థితులు :- గాలిలో అధిక తేమ శాతం మరియు అత్యల్ప ఉష్ణోగ్రత ఈ తెగులుకు అనుకూలం.

యాజమాన్యం:- కత్తిరింపుల తర్వాత 1% బోర్డాక్స్ మిశ్రమం లేదా మాంకోజెబ్ 75WP 2గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మైక్లోబూటానిల్ 10% wp 0.4 / లీటరు నీటికి లేదా హెక్సాకోనజోల్ 5SC 1 మి.లీ/ లీటరు, క్లోరోథలోనిల్ 2గ్రా. లీటరు నీటికి కలిపి 10-15 రోజుల వ్యవధితో పిచికారి చేయడం వలన తుప్పు తెగులును అరికట్టవచ్చు.

Dr. M. venugopal, Dr. V. Krishnaveni
Dr.K. Kaladhar babu, Dr. Prabhavathi , Scinetist
college of Horticulture, Rajendranagar
Grapes research station, Rajendranagar

Leave Your Comments

Precautions For Sugarcane Plantation In Summer: చెరకు తోటల్లో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Previous article

Sesame Seeds: వేసవికి అనువైన నువ్వుల రకాలు – సాగు యాజమాన్యం

Next article

You may also like