సాధారణంగా ఏ పంటకైన సిఫార్సు చేసిన మోతాదులో పోషకాలు అందించడం వలన పంట పెరుగుదల బాగా ఉండడంతో పాటు మంచి నాణ్యతతో కూడిన దిగుబడులు వస్తాయి. అయితే పంటకు అన్ని రకాల పోషకాలు అందించడం అనేది చాలా ముఖ్యం. అప్పుడే ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. దీనికి గాను రైతులు అన్ని రకాల పోషకాలకు సంబంధించిన ఎరువులు పంటకు వాడాల్సి ఉంటుంది. కాని రసాయనిక ఎరువులలో ప్రతి రైతు తప్పనిసరిగా వాడే ఎరువు యూరియా.
యూరియా అంటే ఏమిటి ?
యూరియా అనేది సాధారణంగా ఉపయోగించే నత్రజని కలిగిన ఎరువు, ఇది పంటల పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది తెల్లటి, స్ఫటికాకార ఘనం కలిగి, ఇది నీటిలో కరుగుతుంది మరియు అధిక నత్రజని శాతం కలిగి ఉంటుంది, బరువు ప్రకారం 46% నత్రజని ఉంటుంది. యూరియా అమ్మోనియా మరియు కార్బన్ డయాక్సైడ్ నుండి తయారవుతుంది మరియు అధిక నత్రజని శాతం కలిగి మరియు తక్కువ ధర కారణంగా వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది పంటలకు నత్రజని యొక్క ప్రధాన మూలం, మరియు సరైన మొత్తంలో ఉపయోగించినప్పుడు, ఇది పంట దిగుబడిని మెరుగుపరుస్తుంది మరియు మొత్తం వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది.
అధిక మోతాదులో వాడడం వల్ల కలిగే నష్టాలు :
యూరియా పంటకు నత్రజని అనే పోషకాన్ని అందిస్తుంది. ఈ నత్రజని పంట పెరుగుదలకు మరియు ఉత్పత్తికి చాలా ఉపయోగపడుతుంది. అయితే యూరియా ధర తక్కువగా ఉండటం, నీటిలో తొందరగా కరిగి పొలం వెంటనే పచ్చబడే స్వభావం కలిగి ఉండటం వలన రైతులు మోతాదుకు మించి అధికంగా యూరియాను వేస్తున్నారు. ఎకరా వరి పైరుకు సిఫారసు చేయబడిన నత్రజని మోతాదు 48 కిలోలు. ఈ మోతాదు అందించడానికి 100 కిలోలు అంటే రెండు బస్తాల యూరియా అవసరం. ఇందులో 33 కిలోలు దమ్ములో, 33 కిలోలు దుబ్బు చేసే సమయంలో మిగిలిన 33 కిలోలు అంకురం దశలో మూడు భాగాలుగా వేసుకోవాలి. అంతకు మించి యూరియా వేయడం వలన ఖర్చు పెరగడమే గాక, నేల సారవంతం తగ్గిపోతుంది. నేలలో సేంద్రీయ పదార్ధం తగ్గి నేల నిస్సారమవుతుంది. మొక్కకు కావలసిన పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. దాంతో పాటు సూక్ష్మ పోషక లోపాలు అధికమవుతాయి. యూరియా అధికంగా వేయడం వలన శాఖీయోత్పత్తి అధికంగా జరిగి పంట ఏపుగా పెరిగి చీడపీడల ఉదృతి అధికమువుతుంది. వరి పంటకు యూరియా అధికంగా ‘‘వేయడం వలన అగ్గి తెగులు, ఆకు ఎండు తెగులు మరియు దోమ ఉధృతి అధికంగా కనబడుతుంది. అంతేగాక -మోతాదుకు మించివేసిన నత్రజని ఆవిరి రూపంలో మరియు నీటి ద్వారా నెలలోపలి పొరల్లోకి ఇంకి వృథా అవుతుంది. భూగర్భ-జలాలు నైట్రేట్ నత్రజనితో కలుషితం అవుతాయి. నేలలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుంది. యూరియాలో ఆమ్లత్వస్వభావం ఉండటం వలన ఎక్కువ కాలం అధికంగా వాడితే ఆమ్ల నేలలుగా మారే ప్రమాదం ఉంది. నేల ఆరోగ్యం మరియు లక్షణాలు దెబ్బ తినడం, పంట నాణ్యత తగ్గించడం మరియు పర్యావరణ కాలుష్యం కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. నెలలో అమోనియా మోతాదు పెరిగి పంటకు అవసరమైన పోషకాలు అందకుండా చేయడం వల్ల పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది.
మొక్కల పెరుగుదలకు మరియు ధాన్యం దిగుబడికి ఎరువులు చాలా అవసరం, అయితే యూరియా మరియు ఇతర ఎరువుల మితిమీరిన వినియోగం పోషకాల వినియోగంలో అసమతుల్యతకు దారి తీసింది. ఎరువుల వినియోగానికి పంట దిగుబడి ప్రతిస్పందన తగ్గింది, రైతులు నత్రజనిని అసమానంగా ఉపయోగించడం ఒక ముఖ్య కారణం. భారతదేశంలో నత్రజని వినియోగ సామర్థ్యం క్షీణించిందని ఇటీవలి పరిశోధనలో తేలింది, వివిధ పోషకాలను కలిగి ఉన్న ఇతర ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం అవసరం.
యూరియా ఎరువు వేసే విధానం గనుక చూసినట్లయితే వరి పంటకు యూరియాను బురద పదునులోనే వేసినట్లయితే అందులోని అమ్మోనియా నేలకు అంటి పెట్టుకొని వేర్లకు అందుబాటులో ఉంటుంది. ఆరు తడి పైర్లకు యూరియా వేసినపుడు భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి ఎరువు వేసి మట్టితో కప్పి వేయాలి. ప్రస్తుతం యూరియాను వేపనూనె పూత పూయబడి సన్న గుళికల యూరియాను ఎక్కువగా అడుగుతున్నారు. అయితే ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం ఏమంటే పెద్ద గుళికల యూరియాని వరి పంటకు వేసుకోవడం మంచిది. నెమ్మదిగా కరిగి మొక్కకు అందుతుంది. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియాను వేసుకోవటం వలన తేను తక్కువగా ఉన్నప్పటికి తొందరగా కరిగి మొక్కకు అందుతుంది. చౌడు నేలల్లో పండిరచే పంటలకు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వేసుకోవాలి మరియు పైపాటుగా కూడా యూరియా పిచికారి చేసుకోవాలి.