Fertilization of Cotton: ప్రత్తి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పండిరచే ఒక ప్రధానమైన పంట. ఈ పంట సుమారు 17.61 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో, సాగు చేయబడి, 53 లక్షల బేళ్ళ ఉత్పత్తిని మరియు హెక్టారుకు 512 కిలోల (దూది) ఉత్పాదకతను ఇచ్చినది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రత్తి సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉండి జాతీయోత్పత్తిలో ముఖ్య భూమిక పోషిస్తుంది.
ప్రపంచంలోని ప్రత్తి పండిరచు దేశాలలో భారతదేశం ప్రత్తి విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. 2019-20 సంవత్సరంలో దేశంలో ప్రత్తి సుమారు 125.8 లక్షల హెక్టార్లలో సాగు చేయబడి 360 లక్షల బేళ్ళ ఉత్పత్తిని మరియు హెక్టారుకు 486 కిలోల (దూది) ఉత్పాదకతను ఇచ్చినది (గణాంకాలు ఎ.ఐ.సి.ఆర్.పి. ప్రత్తి -2019-20).
నేలలు :
లోతైన నల్లరేగడి భూములు ప్రత్తి సాగుకు అనుకూలం. నీటి వసతి గల మధ్యస్థ భూములలో కూడా ప్రత్తి పంటను సాగు చేసుకోవచ్చును. ఇసుక నేలలు, మరీ తేలికపాటి చల్కా భూములు ప్రత్తి సాగుకు వర్షాధారంగా అనుకూలం కావు. ఉదజని సూచిక 6-8 గల భూములలో ప్రత్తిని సాగు చేయవచ్చు.
సిఫారసు చేసిన ఎరువులు (ఎకరాకు కిలోల్లో) ప్రత్తి సాగు చేయు భూములలో ప్రతి సంవత్సరం ఎకరాకు 4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువును దుక్కిలో చల్లి కలియదున్నాలి.
సాధారణ / సూటి రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరము మరియు 18 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. హైబ్రిడ్ రకాలకు ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము మరియు 24 కిలోల పొటాష్ నిచ్చు ఎరువులను వేయాలి.
Also Read: గోల్డెన్ రైస్ ప్రాముఖ్యత.!
సిఫారసు చేసిన భాస్వరము మొత్తాన్ని, సింగిల్ సూపర్ ఫాస్పేటు రూపంలో (రకాలకు 100 కిలోలు, హైబ్రీడ్లకు 150 కిలోలు) ఎకరానికి విత్తేముందు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి లేదా విత్తిన 15 రోజుల లోపు కూడా వేసుకోవచ్చు.
సాధారణ రకాలకైతే సిఫారసు చేసిన నత్రజని మరియు పొటాష్‌ను మూడు సమభాగాలుగా చేసి విత్తిన 30,60,90 రోజులకు మొక్క మొదళ్ళలో 7-10 సెం.మీ. దూరంలో పాదులు తీసి వేయాలి. బిటి హైబ్రిడ్లకు సిఫారసు. చేసిన నత్రజని మరియు పొటాష్ లను నాలుగు సమభాగాలుగా చేసి విత్తిన 20,40,60, 80 రోజులకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం.మీ. దూరంలో పాదులు తీసివేయాలి.
పై పాటుగా వేయు నత్రజని, పొటాష్‌లను యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించాలి. ఎకరాకు రకాలకైతే ప్రతీసారి 25 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను 3 సార్లు – 30,60,90 రోజులలో, హైబ్రిడ్లకైతే 20,40,60,80 రోజులకు అందించాలి.
ప్రధాన పోషకాలను సింగిల్ సూపర్ పాస్ఫేట్, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కాంప్లెక్స్ ఎరువులను వాడినప్పుడు – ఎకరాకు 50 కిలోల డి.ఎ.పి.ని విత్తినప్పుడు వేసి, పై పాటుగా యూరియా, పొటాష్‌ను పై విధంగానే అందించాలి. ముఖ్యంగా పైపాటుగా డి.ఎ.పి. లేదా 20:20:20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీని వలన ఖర్చు పెరగడమే కాకుండా, భూమిలో భాస్వరము నిల్వలు ఎక్కువై చౌడు భూములుగా మారతాయి మరియు ఇతర సూక్ష్మ పోషక లోపాలు కూడా పెరుగుతాయి.
పైన సూచించిన అన్ని ఎరువుల మోతాదును భూసార పరీక్షలననుసరించి, ఏదైనా పోషకాల లోపం ఉన్నప్పుడు, ఆ పోషకాన్ని సిఫారసు కంటే 30% ఎక్కువగా, పోషకం అధికంగా ఉన్నప్పుడు ఆ పోషకాన్ని సిఫారసు కంటే 30% తక్కువగా మరియు పోషకం మధ్యస్థంగా ఉన్నప్పుడు, సిఫారసు చేసిన ఎరువులను మాత్రమే వాడితే ఫలితం బాగుంటుంది. ఎక్కువ కాలం ప్రత్తి సాగు చేస్తున్న భూములలో, ప్రత్యేకంగా వేరు తెగుళ్ళు ఆశించే భూములలో మాత్రం వంట మార్పిడితో పాటు, ఎకరాకు 200 కిలోల వేపపిండిని రెండు – మూడు సంవత్సరాలు వేయాలి.
Also Read: జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా హానికారక పురుగుల నివారణ.!