Vegetable Cultivation: తీగజాతి కూరగాయలు అయినటువంటి చిక్కుడు, ఫ్రెంచ్ చిక్కుడు, బెండ, గోరు చిక్కుడు, మునగ లాంటి కూరగాయ పంటలలో విత్తన పరిమాణం పెద్దదిగా ఉంటుంది. కాబట్టి వీటిని నేరుగా పొలంలోనే విత్తుకోవచ్చు. విత్తన పరిమాణం చిన్నగా ఉన్నటువంటి టమాట, వంగ, క్యాబేజి, కాలీఫ్లవర్, మిరప, ఉల్లి లాంటి పంటలలో ముందుగా నారుమడులలో పెంచుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఇందువలన కూరగాయల సాగులో నారుమడి యాజమాన్యం ప్రముఖ పాత్ర వహిస్తుంది.
విత్తన శుద్ధి :
విత్తనాల ద్వారా సంక్రమించే రోగాలు, పురుగుల నివారణకు విత్తన శుద్ధి తప్పని సరి. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, నారుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, వైరస్ తెగుళ్ళకు విత్తన శుద్ధి చేయడం వలన మొదటి దశలోనే చాలా వరకు నివారించబడుతుంది. విత్తన శుద్ధి క్రమాన్ని గమనించినట్లయితే క్యాబేజి, కాలీఫ్లవర్ కూరగాయలను ఆశించే నల్లకుళ్ళు తెగులు, వంగను ఆశించే ఫోమాప్సిస్ ఎండు తెగులు నివారణకు విత్తనాన్ని 500సెల్సియస్ ఉష్ణోగ్రతల గల వేడి నీటిలో 30 నిమిషాలు విత్తనాలను ముంచి ఆరబెట్టాలి.
సేంద్రీయ పద్ధతిలో విత్తనాలను విత్తన శుద్ధి చేసుకున్నట్లైయితే ట్రైకోడెర్మా విరిడి 4-5 గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తుకుంటే నేల ద్వారా వచ్చే వడలు / ఎండు తెగులు చాలా వరకు నివారించబడుతుంది.
నారుమడుల పెంపకం :
నారు మడులు పెంచే స్థలం గాలి, వెలుతురు ధారాళంగా ఉండి, నీటి వసతికి దగ్గరగా ఉండాలి. నేలను 3-4 సార్లు బాగా దుక్కి దున్ని, పెళ్ళలు విరగొట్టి, చదును చేయాలి. 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 15 సెం.మీ. ఎత్తుగల మళ్ళను 10 (40 చదరపు మీటర్లు) తయారు చేసుకోవాలి. ఈ విధంగా 40 చ.మీ. స్థలంలో పెంచిన నారు ఒక ఎకరాకు సరిపోతుంది.
Also Read: రైతన్నకో ప్రశ్న.!
ఎతైన నారు మళ్ళ వలన నీరు నిలవకుండా క్రిందకి జారిపోతుంది. దీని వలన నారు కుళ్ళు తెగులు నివారించబడుతుంది. ఈ మళ్ళను తెల్లటి పాలిథీన్ కాగింతలో మే నెలలో కప్పి 2 వారాల వరకు సూర్యరశ్మి ద్వారా అధిక ఎండ వేడికి గురిచేయుట వలన నేలలోని శీలీంధ్రాలు చాలా వరకు చనిపోతాయి. 40 చ.మీ. నారుమడికి 40 కిలోలు బాగా మాగిన పశువుల ఎరువు, 2 కిలోల అజోస్పైరిల్లం లేదా అజటోబాక్టర్ కలపాలి.
నారుమడులలో విత్తన శుద్ధి చేసిన విత్తనాలను 10 సెం.మీ. ఎండలో మిశ్రమంతో కప్పాలి. విత్తనాన్ని చాలా పలుచగా విత్తుకోవడం వలన మొలకలకు గాలి బాగా తగిలి నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. దగ్గరగా గుంపులుగా పెరిగే నారు సన్నగా పొడవుగా పెరగటమే గాక గాలి బాగా తగలక నారుకుళ్ళు రోగం వచ్చే అవకాశం ఎక్కువ. ఆ తర్వాత విత్తనాలు మొలకెత్తే వరకు రోజ్కాన్ ద్వారా వెంటనే తడులు ఇవ్వాలి. నారు మళ్ళను శుభ్రమైన ఎండుగడ్డితో కప్పాలి. ఇలా కప్పడం వలన అధిక వర్షాల వలన లేదా నీరు పెట్టినప్పుడు విత్తనాల స్థాన చలనం అవ్వకుండా ఉండడమే గాక చలి కాలంలో అయితే అధిక చలి నుండి, వేసవి కాలంలో అయితే అధిక వేడిని నుండి రక్షింపబడి విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. నేలలోని తేమ బాగా నిలిచి ఉంటుంది. విత్తనం మొలకెత్తినట్లు మొదటి అంకురం కనబడగానే పైన కప్పిన గడ్డిపోరను తీసివేయాలి.
మొక్కలు బాగా వత్తుగా వచ్చిన దగ్గర మొక్కలు ఉండేలా చూసినచో ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చును. నారు మళ్ళలో కలుపును వెంట వెంటనే తీసివేయాలి. నారు మొక్కలు త్వరగా పెరగడానికి గాను నత్రజని ఎరువుల వాడకం లేదా అధికంగా నీటి తడులు ఇవ్వడం లాంటివి చేయరాదు. నారు పీకడానికి వారం రోజుల ముందు నీరు ఇవ్వడం తగ్గించి నారు మొక్కలు గట్టిపడేలా చూడాలి. నారు మొక్కలు ఒక్కదానికి 6-12 గంటల ముందు మడులను నీటిలో తడపాలి. ఈ విధంగా పెంచిన నారు 8-10 సెం.మీ.ల ఎత్తు, 2-3 ఆరోగ్యవంతమైన ఆకులను 4-5 వారాల వయస్సు కలిగిన నారును ప్రధాన క్షేత్రంలో నాటుకోవాలి.
Also Read: మామిడిలో కోత అనంతరం చేపట్టవలసిన కీలక పద్ధతులు.!