Terrace Gardening: సాదారణంగా గ్రామాల్లో ఉండే వాళ్లు ఇంటి వద్ద ఉన్న పెరట్లో ఆకుకూరలు, కూరగాయల మొక్కలు పెంచుకుంటారు. మరీ పట్టణాల్లో ఉండే వారి పరిస్థితి ఏంటి అంటే దానికీ ఓ చక్కటి పరిష్కారం ఉంది.. అదే మిద్దెపై సేద్యం. మిద్దె వ్యవసాయం ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. మేడ మీద కుండీలలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సాగు చేసుకోవచ్చు. ఇలా మొక్కలను పెంచడం వల్ల రోటీన్ పనుల ఒత్తిడి నుంచి కాసేపు రిలాక్స్ కావడంతోపాటు.. మనం సొంతంగా పెంచుకున్న వాటిని తింటున్నామనే సంతృప్తి కూడా కలుగుతుంది.
ఈ కారణంగానే పట్టణాల్లో మిద్దె పంటల సాగు (Terrace Gardening) జోరందుకుంది. వాణిజ్యపరంగా భారీ భవంతులపై వర్టికల్ విధానంలో పంటలను సాగు చేస్తున్నారు. విశాలంగా ఉండే వాణిజ్య భవనాల పై భాగంలో గ్రీన్ హౌస్‌లను ఏర్పాటు చేసి.. సేంద్రియ పద్ధతిలో, మట్టి పెద్దగా అవసరం లేకుండా.. కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు.
రసాయనాలతో పండించిన కూరగాయలు తినడం కన్నా సహజసిద్ధంగా పండించుకుని తినడంలో గల సంతృప్తి, ఆరోగ్యం వర్ణనాతీతం. రసాయనిక ఎరువుల వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదీగాక మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతేకాదు…మిద్దె తోటల వల్ల భవనాల పై కప్పు జీవిత కాలం కూడా పెరుగుతుందని, ఎంతటి వేసవిలో నైనా ఇంటి లోపల చల్లగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: గోనె సంచుల కొరత సమస్యను ఎదుర్కొంటున్న రైతులు.!
మిద్దె తోటను ఎప్పుడైనా అందుబాటులో ధరల్లో మొదలు పెట్టడం ఉత్తమం. ముందు నుంచి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. టబ్బులు , గ్రోబ్యగులు, గ్రో బెడ్స్ , పెయింట్ బక్కెట్లు, చిన్న చిన్న కుండీలను మిద్దె సాగుకు వినియోగించుకోవచ్చు. లవంగాలు, మిరియాలు, యాలకులు, జాజిపత్రి వంటి సుగంధ ద్రవ్యాల మొక్కలు సైతం మన ఇంటి మిద్దెపై పెంచుకోవచ్చు. అలానే, చల్లటి వాతావరణంలో కాసే యాపిల్ పండ్లు మొదలుకుని నేరేడు, మామిడి (Mango) , ద్రాక్ష, లిచి, స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ వంటివెన్నో డాబా మీద పెంచుకోవచ్చు.
మిద్దె తోట సాగుకు ఎర్ర మట్టి లేదా నల్ల మట్టిని మాత్రం వాడాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే.. సేంద్రియ ఎరువులైన పేడ, వేప ఆకుల వాడడం వల్ల కూరగాయలు విరివిగా ఉండడంతో పాటు, భూసారం పెరుగుతుంది. అలాగే వేప, వంటనూనెలు, చేప వ్యర్థాలు, కూరగాయ తొక్కలు, బియ్యం, పప్పు కడిగిన నీళ్లు, పులిసిన మజ్జిగ ఒకటేమిటి… ఇంట్లో వృథా అనుకున్న పదార్థాలతో ఎరువు తయారు చేసి మట్టి సారాన్ని పెంచుకోవచ్చు.
మిద్దె తోట సాగు చేసే టప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాంల ప్రారంభంలో దుంపలు, గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి వాటిని నాటుకోవాలి. మిగతా కాలాల్లో కూడా వీటిని ఉత్పత్తి చేయవచ్చు. ఇక మిద్దె తోట సాగులో నీరు ప్రధాన సమస్య. మిద్దె తోటల్లో ఎక్కువ నీరు పెట్టడం వల్ల పలు సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ నీరు వల్ల మొక్కలు ఎర్రబడి చనిపోవడమే కాకుండా, వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మట్టి పొడిగా ఉంటేనే నీరు పోయాలి. పట్ణణ, నగర ప్రాంతాల్లో అనేక కుటుంబాలు టెర్రస్ గార్డెనింగ్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ద్వారా రసాయన విశేషాలు లేని పంటలు పండించుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నారు.
Also Read: భారీగా పడిపోయిన టమాటా ధరలు.. ఛాయ్ కంటే చీప్..!