Farmer Support: “అన్నం పరబ్రహ్మ స్వరూపం’’ అనాదిగా మన నానుడి. విశ్వాసం కూడా. అటువంటి అన్నాన్ని ముద్దగా మన నోటి వద్దకు తెచ్చేది మట్టిని పిసికి ఆరుగాలం తమ స్వేదాన్ని చిందించి వ్యవసాయం చేసే రైతన్నలు. వ్యవసాయం వృత్తిగానే కాకుండా అనాదిగా నాగరికతగా వృద్ది చెందుతూ వచ్చింది. ఇప్పటికి ఈదేశంలో దాదాపు 60 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగం మీద ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో వ్యవసాయం కీలకరంగం. వ్యవసాయం విష్ణుకుండినుల కాలం నాలుగవ శతాబ్దం నుండి ఏడవ శతాబ్దం నాటికే కొత్తపుంతలు తొక్కితుంది. ఇక్కడుండే సమశీతోష్ణ మండల వాతావరణం. ఎత్తు, పల్లాలతో కూడిన భూములు. వాగులు, వంకలు, నదీనదాలు ఉండేటువంటి పారువాటు ఈప్రాంతం ప్రత్యేకతలు.
ప్రపంచానికి వాటర్ షెడ్ పరిజ్ఞానం అందించిన ఈ బంగారు నేలను విస్మరించి, విధ్వంసంచేసి చెరువులు, కుంటల వ్యవస్థను దారుణంగా నిర్లక్ష్యం చేసి చివరకు మనుషులకు, జీవజాతికి మంచినీళ్లులేని దుర్గతిని కలిగించారు. దాని పర్యావసానమే తెలంగాణలో అనేక ఉద్యమాలు, పోరాటాలు. ఇతర సాంఘీక అసమానతలకు తోడుగా ప్రకృతి పరమైనటువంటి వనరుల సమతుల్యం లోపించి పాలకుల దూరదృష్టిలేమి కారణంగా, సంకుచితబుద్ది కారణంగా మంచినీళ్లను, సాగునీళ్లను లేకుండా కోల్పోయి సమైక్య పాలనలో మనుషులు, జీవాలు వలసబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. నూతన రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రథమ ప్రాధాన్యత గల అంశంగా ఎత్తుకోవడం కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ. దీర్ఘకాలిక ప్రణాళిక.
Also Read: Niranjan Reddy: మూడవరోజు పర్యటనలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర ప్రగతిలో వ్యవసాయరంగానిది కీలకపాత్ర. జీఎస్డీపీలో దీనివాటా 18 శాతం. వ్యవసాయరంగం బలపడితే దాని చుట్టూ అల్లుకున్న రంగాలన్ని బలపడతాయని ప్రగాఢంగా విశ్వసించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేసి సాగునీళ్లను అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్ అవసరాలు, ఆవశ్యకతలను గుర్తించి అసాధారణం అని సమైక్య పాలకులు మభ్యపెట్టి తొక్కిపట్టిన గోదావరి, కృష్ణానదుల మీద ఎత్తిపోతల పథకాలకు రీడిజైన్ చేసి కేవలం మూడేళ్లలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు. కృష్ణా నదిమీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం త్వరలో పూర్తయి అందుబాటులోకి రానున్నది. తెలంగాణ వచ్చిన వెంటనే సాగునీటి శిస్తును ఎత్తివేసి అప్పటి వరకు ఉన్న బకాయిలను రద్దుచేయడం జరిగింది. సాగునీళ్లతో పాటు వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత కరంటు పథకం, రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఏడాదికి ఎకరాకు రూ.10 వేల రైతుబంధు, వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతు కుటుంబాలలో భరోసా నింపేందుకు రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షలు అందించే రైతుభీమా పథకాన్ని ప్రారంభించారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల పంటలను వందశాతం మద్దతుధరకు కొనుగోలు చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. ఇప్పటివరకు 11 విడతలలో రైతుబంధు పథకం కింద రూ.72,815.09 కోట్లు రైతుల ఖాతాలలో నేరుగా జమచేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డ్. రైతుబీమా పథకం కింద ఇప్పటి వరకు లక్ష 8,685 రైతుకుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం కింద రూూ.5,434.25 కోట్లు అందించడం జరిగింది.
తెలంగాణ ఏర్పడే నాటికి వ్యవసాయ సంక్షోభం మూలంగా ఏ రైతుదీ రుణాలు కట్టలేని పరిస్థితి. రైతులు రుణాలు ఆశించినా బ్యాంకులది ఇవ్వలేని పరిస్థితి. సమాజంలో అత్యంత ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి రైతు. రైతుకు ఇవ్వడమే తప్ప చేయిచాచే పరిస్థితి ఉండదు. ఆ స్థితి నుండి రైతులను బయటపడేయాలన్న తాపత్రయం రాష్ట్ర ప్రభుత్వానిది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.లక్ష రుణమాఫీ చేస్తాం అని ప్రకటించారు. ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతలో 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. మరొక్కసారి రుణమాఫీ జరిగితే భవిష్యత్ లో దాని కోసం ఎదురుచూసే రైతులు ఉండరని భావించి 2018 ఎన్నికలలో మరో లక్ష రుణమాఫీకి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటప్రకారం 36 వేలకు రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఆ వెంటనే ప్రపంచాన్ని వణికించిన కరోనా విపత్తు మూలంగా రాష్ట్రప్రభుత్వం రూ.లక్ష కోట్ల ఆదాయం నష్టపోయింది. ఇదే కరోనా సంక్షోభంలో రైతాంగం తాము పండించిన పంటలు అమ్ముకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం గ్రామగ్రామాన ఏడు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలను కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చూసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుబంధు, రైతుబీమా పథకాలను కొనసాగిస్తూ వస్తున్నది. కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రభుత్వం మిగిలిన రుణమాఫీ హామీని అమలుచేస్తున్నది. రెండో విడతలో 30.33 లక్షల మంది రైతులకు రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.20,144 కోట్లకు గాను రూ.8089.74 కోట్లను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం రూ.99,999 వరకు ఉన్న రుణాలన్నీ పూర్తిగా మాఫీ అయ్యాయి. రూ.లక్ష, ఆ పైన ఉన్న రుణాలు రూ.లక్ష వరకు మరికొద్దిరోజుల్లో మాఫీకానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా 2014 నాటికి కోటీ 31 లక్షల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2022-23 నాటికి 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014-15 నాటికి 68 లక్షల టన్నులు మాత్రమే ఉన్న ధాన్యం ఉత్పత్తి 2022-23 నాటికి రికార్డు స్థాయిలో సుమారు 3.00 కోట్ల టన్నులకు చేరుకున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రూ. లక్షా 33 వేల కోట్లతో 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. ధాన్యం కాకుండా రూ.11,443.04 కోట్లతో ఇతర పంటలు కొనుగోలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు సుమారు రూ.1.59 లక్షల కోట్లు, రూ.32,700 కోట్లు వెచ్చించి విద్యుత్ మౌళిక సదుపాయాల కల్పన, సాలీనా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ రాష్ట్రంలోని రైతులందరికి ఉచిత కరంటు అందించడం జరుగుతున్నది. 2014-15 నాటికి రూ.1,12,162 ఉన్న తలసరి ఆదాయం 2022-23 రూ.3,17,115 కు చేరుకున్నది. రూ. 5349 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు పునరుద్ధరించి, 8.93 టిఎంసి ల సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ఏర్పాటుచేసి, ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించడం, రూ.572 కోట్లతో 2601 రైతు వేదికల నిర్మాణం చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా పన్ను మాఫీతో పాటు రాష్ట్రం ఏర్పడక ముందున్న రూ.41.6 కోట్ల రవాణా పన్ను రద్దు చేయడం జరిగింది. తెలంగాణ వచ్చేనాటికి 39.01 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న గోడౌన్ల సామర్థ్యం ప్రస్తుతం73.82 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంగల నూతన గోదాంలు నిర్మించడం గమనార్హం.
Also Read: PJTSAU: వ్యవసాయ విశ్వవిద్యాలయము M.P.C స్ట్రీం కోర్సులకు వాక్.ఇన్.కౌన్సిలింగ్
రైతాంగ శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో ఆర్థిక భారాన్ని మోస్తున్నది. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు ఫలితంగా తెలంగాణలోని కుటుంబాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. నికర ఆదాయం, నెలవారీ ఆదాయం లేని కుటుంబాల్లో కూడా ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బు మారకం జరుగుతున్నది. సగటున పౌరుల చేతుల నుండి జరుగుతున్న రూపాయి మారకం విషయంలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఎక్కువగా ఉన్నది. ఈ ఆర్థికచక్రం ముందుకు నడిపించడం మూలంగా అందరి చేతులకు పని లభించడం జరుగుతున్నది. వ్యవసాయ రంగం బలోపేతం మూలంగా ఇది సాధ్యం కాదు అన్న పిడివాదానికి సమాధానంగా తెలంగాణ పాలన, కేసీఆర్ ఆలోచనలు నిలిచాయి. ఆ దృక్కోణంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక రైతు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. దీని మూలంగానే వ్యవసాయరంగం తద్వారా రాష్ట్రం బలోపేతమవుతున్నది. ప్రజలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయిలో ఉండాలని, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం నిలదొక్కుకునే వరకు చేయూతనందిస్తే అంతకుమించి వ్యవసాయదారులకు చేయాల్సింది ఏమీలేదన్నది కేసీఆర్ గారి ఆలోచన. అభిలాష.
Also Read: Palamuru-Rangareddy: ఇది తెలంగాణ చారిత్రాత్మక విజయం, రైతుల విజయోత్సవాలు