Methods of Raising Rice Seedlings – 1. మెట్ట పద్ధతిలో నారు మడి పెంపకం: వానాకాలం ప్రారంభమై దాదాపు 20 రోజుల తర్వాత తొలకరి వర్షాలు నమోదవుతుండటంతో రైతన్నలు పంటల సాగుకు సమాయత్తం అవుతున్నారు. దుక్కులు చేసుకోవడం, ప్రత్తి మరియు మొక్క జొన్న విత్తనాలు వేసుకోవడం మరియు వరి పంటకు నారు మడిలో వేసుకోవడం చేస్తున్నారు. గత సంవత్సరం వరి పంటలో కాండం తొలుచు పురుగు ఆశించి అధికంగా దిగుబడి నష్టాన్ని కల్గించింది. ప్రస్తుత సంవత్సరంలో కూడా వర్షాలు లేటుగా పడటం మూలంగా రైతులు ఇప్పటి వరకు వరి నారు మడులు వేసుకోలేదు, కానీ రైతులు ఆందోళన చెందకుండా స్వల్ప కాలిక రకాలు 125 రోజులు అంతకంటే తక్కువ పంట కాలం కల్గిన రకాలను ఎంచుకొని అధిక దిగుబడులు పొందవచ్చును.
స్వల్ప కాలిక రకాలు అయినటువంటి తెలంగాణ సోనా, జగిత్యాల సన్నాలు, శీతల్, రామప్ప వంటి 125 రోజులలో, IR 64, 118 రకాలు 120 రోజులలో115 రోజులలో, ప్రత్యుమ్న (17004) 105 రోజులలో పంటలు కోతకు వస్తాయి కాబట్టి రైతులు ఈ రకాలను ఎంచుకొని అధిక దిగుబడులు పొందవచ్చును. అయితే ఆలస్యంగా వేసిన నారు మడి మరియు ప్రధాన పొలలో కాండం తొలుచు పురుగు మరియు ఇతర చీడ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రైతులు నారు మడి పెంపకంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి వివిధ రకాల పురుగుల ఉద్రితిని తగ్గించకోవచ్చును. ఎకరానికి నాటే పద్ధతికి దొడ్డు రకాలకు 25 కిలోలు, సన్న రకాల 20 కిలోల విత్తనం అవసరమవుతుంది.
2. నారు మడిలో నీటి యాజమాన్యం :
1. నారుమడిని బాగా దున్ని 2-3 సార్లు దమ్ముచేసి చదును చేయాలి. నీరు పెట్టటానికి, తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసి ఎత్తు నారుమళ్ళను తయారు చేయాలి. మొలక కట్టిన విత్తనాన్ని చల్లి, మొదట్లో (వారం రోజులు) ఆరు తడులు ఇచ్చి, ఆ తర్వాత మొక్క దశలో పలుచగా (2-3 సెం.మీ.) నీరు ఉంచాలి.
2. రెండు గుంటల (5 సెంట్లు) నారుమడికి 2 కిలోల నత్రజని ఒక కిలో విత్తనం చల్లేముందు, మరో కిలో విత్తిన చల్లిన 12-14 రోజులకు, 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. పశువుల పేడను లేదా ఇతర సేంద్రియ ఎరువులను దుక్కిలో వేయడం చాలా మంచిది.
3. నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితిలో రెండవ దఫా నత్రజనిని ఆలస్యంగా వేసి నారు ముదరకుండా చూడాలి.
Also Read: Dal Lake Weeds to Organic Manure: సేంద్రియ ఎరువుగా దాల్ సరస్సు కలుపు మొక్కలు.!
నారు మడిలో ఎరువుల యాజమాన్యం :
1.నారు మొలకెత్తిన తర్వాత కొనలు ముదురు గోధుమ రంగుకు మారి చనిపోతున్నట్లయితే లీటరు నీటికి 2 గ్రా. జింక సల్ఫేటు కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలి.
2. మెట్టనారుమడిలో ఇనుప ధాతు లోపాన్ని గమనిస్తే 2 నుండి 5 గ్రా. అన్నభేది G 0.5 నుండి 1 గ్రా. నిమ్మ ఉప్పు మొక్క వయస్సును బట్టి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నారు మడిలో కలుపు యాజమాన్యం :
నారుమడిలో బ్యూటాక్లోర్ లేదా ప్రెటీలాక్లోర్, సేఫనర్ 5 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి విత్తిన 8-10 రోజులకు పిచికారి చేసుకోవాలి. బిస్రిబాక్ సోడియం అనే కలుపు మందును 0.5 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పున విత్తిన 10-12 రోజులకు పిచికారి చేసుకోవాలి. నారుమడిలో ఊద, ఓలిపిడి వంటి గడ్డిజాతి కలుపు ఉన్నట్లయితే విత్తిన 15-20 రోజులకు సైహలోఫాప్ పి-బ్యుటైల్ అనే కలుపు మందును 1.5 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
నారు మడిలో ఆశించే చీడ పీడలు – వాటి నివారణ చర్యలు
నారు మడి దశలో కాండం తొలుచు పురుగు ఆశించి లేత నారు కోనల పైన గ్రుడ్లను పెట్టి ప్రధాన పొలంలో నాటిన తర్వాత పిల్ల పురుగులు బయటకు వచ్చి నష్టాన్ని కలుగచేస్తాయి. కాబట్టి రైతులు నారు పీకడానికి 7 రోజుల ముందు గుంట నారుమడికి 400 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు ఇసుకలో కలిపి చల్లి పలుచగా నీరుంచాలి. అలాగే నారు నాటే ముందు వరి నారు కొనలను తుంచడం గాని లేదా కత్తిరించడం గాని చేయాలి అవసరాన్ని బట్టి మడిలో ఇతర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
విత్తనశుద్ధి : రైతులు విత్తన శుద్ధిని తప్పకుండా చేసుకోవాలి. మెట్ట నారుమళ్ళకు అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజిమ్ తడితో పట్టించి ఆరబెట్టి తడి మరియు నారుమడిలో చల్లుకోవాలి, అదే దమ్ము నారు మడులకు లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజమ్ కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి, తరువాత మండెకట్టిన మొలకలను నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలకు లీటరు ద్రావణము సరిపోతుంది.
నిద్రావస్థను తొలగించడం :
నిద్రావస్థను తొలగించడానికి లీటరు నీటికి, తక్కువ నిద్రావస్థ (2-3 వారాలు) ఉన్న విత్తనాలకైతే 6.3 మి.లీ., ఎక్కువ నిద్రావస్థ (4-5 వారాలు) ఉన్న విత్తనాలకైతే 10 మి.లీ. గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి, కడిగి మండెకట్టాలి.
దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తే పద్ధతి :
వర్షాలు ఆలస్యంగా పడటం వలన రైతులు నేరుగా విత్తుకుంటే పంట కాలం తగ్గుతుంది. ఈ పద్ధతిలో నారు మడి పెంచాల్సిన అవసరం లేదు.
ఇటీవలి కాలంలో వరి సాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్ధతిలో 7-10 రోజుల ముందుగా ఈ కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లువేసే పని ఉండదు కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ. 3000-4000 వరకు తగ్గుతుంది.
తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చును. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిని సాగు చేసుకునే అవకాశముంది. కాలువల క్రింద ఆలస్యంగా నీరు వదిలినప్పుడు ముదురు నారుకు బదులుగా స్వల్పకాలిక రకాలను ఈ పద్ధతిలో సాగు చేసుకోవచ్చును.
దమ్ము చేసుకున్న పొలంలో వెద పద్ధతికై రకాన్ని బట్టి ఎకరాకు 10-12 కిలోల సరిపోతుంది. డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకున్నప్పుడు 8-10 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తనాన్ని మండె కట్టడం: విత్తనాలను 24 గంటలు నానబెట్టి, నానిన విత్తనాలను గోనె సంచిలో మండే కట్టి దమ్ముచేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాన్ని విత్తుకోవాలి.
డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకున్నప్పుడు విత్తనాలను 12 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టి కొద్దిగా ముక్కు పగిలిన (తెల్లపూస) గింజలను విత్తుకోవాలి.
యంత్రాలతో నాటు పద్ధతిలో పాలిథీన్ షీటు పై లేదా ట్రేలలో వరినారు పెంచే విధానం పాలిథీన్ షీటుపై నారుమళ్ళను పెంచి యంత్రాలతో నాటు వేయడం ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందుతున్నది.
నారు పెంచే మడిని రెండు సార్లు దున్నుకొని విత్తనము వేసే రోజు కన్నా 24 గంటల (తేలిక నేలలు) / 48 గంటల (బరువు నేలలు) ముందుగా దమ్ము చేసుకోవాలి. 1.5 మీ. వెడల్పుతో కొంతమేర ఎత్తైన మడులను తగినంత పొడవుగా 30 సెం.మీ. ఎడంలో తయారు చేసుకోవాలి. ఈ మడుల మీద 1.5 మీ. వెడల్పు, తగినంత పొడవు గల తెల్లని పాలిథీన్ షీటును (60 మైక్రాన్లు) మడతలు పడకుండా పరచాలి. ఒక్కో మ్యాటు 58 సెం.మీ. పొడవు ఐ 28 సెం.మీ. వెడల్పు 2 సెం.మీ ఎత్తు కొలతలు ఉండే విధంగా 8 మ్యాట్లు చేసుకోవాలి.
ఈ చెక్క ఫ్రేము ఫాలిథీన్ షీటుపై ఉంచాలి. తర్వాత దమ్ము చేసిన బురద మట్టిని రాళ్ళు లేకుండా చూసుకొని ఫ్రేములలో నింపాలి. 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి, మొలకెత్తిన వరి గింజలను ఫ్రేములోని ఒక్కో కానాలో 120 గ్రా. (సన్న గింజ), 160గ్రా. (దొడ్డు గింజ) వచ్చేటట్లుగా చల్లుకోవాలి. అనగా ఎకరాకు సన్న గింజ ఐతే 8-10 కిలోలు, దొడ్డు గింజ ఐతే 12-14 కిలోలు సరిపోతుంది.
ఆరుతడి పద్ధతి (ఎరోబిక్ రైస్) :
ఈ పద్ధతిలో నారు మడి పెంచ కుండా నేరుగా విత్తనాలను నేలలో వేస్తారు. ఎరోబిక్ వరి పద్ధతిలో వరిని మనం సాధారణంగా పండిరచే మొక్కజొన్న పంట వలె ఆరుతడి పరిస్థితులలో పండిరచడం, పంట అవసరం మేరకు నీటిని అందించడం చేస్తారు. ముఖ్యంగా మాగాణి భూముల్లో సాధారణ పద్ధతిలో సాగు చేయడానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండిరచే భూముల్లో అడపదడపా నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో ఈ పద్దతి అనుకూలంగా వుంటుంది. దమ్ము చేసి నీరు నిల్వ ఉంచవలసిన అవసరం లేదు. బెట్టను తట్టుకునే స్వల్ప కాలిక రకాలు ఈ పద్ధతికి అనుకూలం.
ప్రధాన పొలంలో తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకుని పలుమారు దున్ని, మెత్తని దుక్కి చేసి కలుపు సమస్యను లేకుండా చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఎరువులు వేసి కలియదున్ని బాగా చదును చేయాలి.
ఎకరానికి 25-30 కిలోల విత్తనము ఉపయోగించాలి. విత్తే ముందు 3 గ్రాముల కార్బండిజమ్ కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి.
శుద్ధి చేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో 20 సెం.మీ. దూరంలో నాగటి సాలు వెనకగాని, ట్రాక్టరుతో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో (ఫర్టి కమ్ సీడ్ డ్రిల్తో) గాని వేసుకోవచ్చు. విత్తనాన్ని పైపొరల్లో పడేటట్లుగా తక్కువ (2.5-5) లోతులో వేసుకోవాలి.
Also Read: Tuna Fish: ట్యూనా చేప కు అధిక డిమాండ్.!