Green Manure: పచ్చి రొట్టె ఎరువులు సాధారణంగా నేలపాలిట వరాలుగా పరిగణిస్తారు. అధికంగా దిగుబడులు సాధించాలన్న ఆతృతతో నేటి రైతాంగము విపరీతంగా రసాయనిక ఎరువులు వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతిని, పంట తీవ్రమైన పోషక పదార్థాల లోపాలకు గురై, చీడపీడల ఉధృతికి లోనవుతుంది. ఈ సమస్యకు అధిగమించాడానికి సమగ్రపోషక పదార్థాల యాజమాన్యం చేపట్టాలి. దానిలో ముఖ్యభాగం పచ్చిరొట్ట ఎరువులు.
పచ్చిరొట్ట పైర్లు వాడకం వల్ల ప్రయోజనాలు
1. వీటిలో సేంద్రియ పదార్ధముంటుంది. ఇది సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధిచెంది భూసారం పెంపొందించడానికి దోహద పడుతుంది.
2. భూమిని గుల్లబరచి, నీటి నిలువ సామర్థ్యం పెంచి సులభంగా నీరు, గాలి వెర్లకు అందెల చేస్తుంది.
3. పచ్చిరొట్ట పైర్ల సాగువల్ల సూక్ష్మపోషక పదార్థాల లోపాలు రాకుండా ఉంటాయి.
4. పచ్చిరొట్ట పైర్లు భూమిలో కుళ్లేటప్పుడు, రసాయనిక ప్రక్రియలు జరిగి భూమిలోని పోషక పదార్థాలు మొక్కలకు అందుబాటులోకి వస్తాయి.
5. చాలా రకాల పచ్చిరొట్ట పైర్లు పప్పుజాతికి చెందినవి. అందుచేత గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి.
6. పాల చౌడు, నల్లచౌడు నివారిస్తాయి.
7. భూసార పరిరక్షణకు తోడ్పడతాయి.
పచ్చిరొట్ట పైర్లకు ఉండవలసిన లక్షణాలు :
1. చాలా త్వరగా పెరిగి, మెత్తని ఆకులు, పచ్చి కాండం కలిగి ఉండాలి.
2. మృదువుగా ఉండి తొందరగా కుళ్ళే స్వభావం కలిగి వుండాలి.
3. అన్ని రకాల నేలలు, శీతోష్ణస్థితికి, నీటి ఎద్దడికి తట్టుకునేటట్టుగా ఉండాలి… పప్పు జాతికి చెందినవై ఉంటే మంచిది.
పచ్చిరొట్ట పైర్ల వాడకము : పచ్చిరొట్ట పైర్ల వాడకములో రెండు పద్ధతులున్నాయి
1. పచ్చిరొట్ట పైర్లను పొలంలో చల్లి, అవి పెరిగిన తర్వాత అదే పొలంలో అక్కడికక్కడే భూమిలోకి కలియదున్ని, తర్వాత పంట వేసుకోవడం, కుళ్ళడానికి సరిపోయే రోజులు ముందుగా కలయదున్ని లేదా 50 శాతం పూత వచ్చిన తర్వాత పంటను కలియ దున్నాలి.
2. చెట్ల ఆకులు, బయటి నుండి సేకరించి, పొలంలో చేర్చి కలియదున్ని, కుళ్ళనిచ్చి, తర్వాత వేసుకోవడం.
ఎప్పుడు వేయాలి ?
ఖరీఫ్ పంటలకు ముందు వేసవిలో (మే, జూన్ మాసాలలో) తొలకరి వర్షాలు పడిన వెంటనే దున్ని ఎకరాకు 12-15 కిలోల విత్తనం చల్లాలి. జనుము ఎకరాకు 20 కిలోల విత్తనం సరిపోతుంది.
* దీర్ఘకాలిక పంటలు, పండ్లతోటలలో వరుసల మధ్య పచ్చిరొట్ట పైర్లు వేసి, పెరిగిన తర్వాత భూమిలోనికి దున్నవచ్చు.
Also Read: Kubota A211N Tractor: వ్యవసాయంలో బుల్లి ట్రాక్టర్ చేసే వింతలు.!
పచ్చిరొట్ట పైర్లలో రకాలు సాగు వివరాలు
1. జనుము: జనుము పంట ఎకరానికి 10-15 టన్నుల పచ్చి రొట్ట దిగుబడి ఇస్తుంది. ఒకటన్ను పచ్చిరొట్టలో 4 కిలోల నత్రజని ఉంటుంది. వరి పొలాలకు, ముంపు నేలలకు పనికొస్తున్నది. పూతదశ వచ్చినాక కలియ దున్నాలి.
2. జీలుగు: జీలుగా ఒక ఎకరానికి 8-10 టన్నుల పచ్చి రొట్టె దిగుబడి ఇస్తుంది. ఒకటన్ను పచ్చిరొట్టలో 5 కిలోల నత్రజని ఉంటుంది. చౌడు భూములకు అనుకూలం. 50 శాతం పూత దశవచ్చాక భూమిలో కలియ దున్నాలి.
3. వెంపల్లి: ఒక ఎకరానికి 10-15 టన్నుల పచ్చి రొట్టె దిగుబడి ఇస్తుంది. నీటి ఎద్దడికి తట్టుకుంటుంది. చాలా నిస్సారమైన నేలలో కూడా వస్తుంది.
4. పిల్లిపెసర: ఎకరానికి 4-5 టన్నుల పచ్చి రొట్టె దిగుబడి ఇస్తుంది. పూత దశలో కలియ దున్నాలి. పశుగ్రాసంగ కూడా వాడవచ్చును.
5. ఉలవ: ఒక ఎకరానికి 4-5 టన్నుల పచ్చి రొట్టె దిగుబడి ఇస్తుంది. అన్ని రకాల భూములకు అనుకూలం.
6. అలసంద: ఒక ఎకరానికి 4-6 టన్నుల పచ్చి రొట్టె దిగుబడి ఇస్తుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. తేలిక నేలలకు అనుకూలం ఒక టన్ను రొట్టలో 3.5 కిలోల నత్రజని ఉంటుంది.
7. పెసర: ఎకరానికి 6-7 టన్నుల పచ్చి రొట్టె దిగుబడి ఇస్తుంది.
ఎకరానికి 1.6 నుండి 2.0 క్వింటాళ్ళు పెసలు అదనంగా పచ్చిరొట్టలో పొందవచ్చు.
Also Read: Double Wheel Marker: మహిళ రైతులు సులువుగా ఉపయోగించడానికి డబల్ వీల్ మార్కర్ పరికరం