నవధాన్యాల్లో ఉలవలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని ఇంగ్లీష్ లో హార్స్ గ్రామ్ అంటారు. ముఖ్యంగా ఉలవ గుగ్గిళ్ళు, ఉలవచారు తెలుగువారికి అత్యంత ప్రియమైన వంటకాలు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉలవలు ఆహారంగా ఎక్కువగా వాడేవారు. ప్రస్తుతం మనం ఉలవల ప్రాముఖ్యత గుర్తించి తెలిసి , ప్రతి ఒక్కరూ వాడటానికి ఇష్టపడుతూన్నారు. నేడు ఉలవచారు అత్యంత ఖరీదైన వంటకం. కొన్ని రెస్టారెంట్లు ఉలవచారు బిర్యానీలతో ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఉలవలు తరుచూ ఆహారంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. ప్రతి రోజూ ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి ఉన్న అనవసరపు కొవ్వు క్రమంగా కరిగి శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. కావున వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.
ఉలవలలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండి మధుమేహం అదుపులో ఉంటుంది. పక్షవాతం, కీళ్ళవాతం, మెడనొప్పి వంటి వాత వ్యాధులతో బాధపడేవారికి ఉలవచారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో బాధపడేవారికి ఉలవచారు చాలా మంచిది. మూత్రాశయంలో ఏర్పడిన రాళ్లను సమర్థవంతంగా ఇవి కరిగిస్తాయి. తరచూ ఎక్కిళ్ళ సమస్యతో బాధపడుతున్నవారికి ఉలవలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఉలవలకు వేడి చేసే గుణం ఎక్కువగా ఉంది కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా నిత్యం వేడి ప్రదేశాల్లో పనిచేసేవారు ఉలవలను తక్కువగా తీసుకోవడం మంచిది.
ఉలవలను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Leave Your Comments