Telangana Farmers: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వడగండ్ల వాన రైతుల్లో కంటనీరు మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ వడగండ్ల వాన వల్ల కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎన్నో రకాల పంటలు నేలమట్టం అయ్యాయి. కొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కూరగాయల పంటలు, మొక్కజొన్న, వరి మరియు మిరప వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి మరియు బత్తాయి వంటి పండ్ల తోటల్లో పండ్లు మొత్తం నేలరాలాయి. అత్యధికంగా వరి పంటకు భారీ నష్టం సంభవించింది. పొట్టకు వచ్చిన వరి కావడంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానకు సులభంగా నేలరాలాయి.
Also Read: Siddipet Puliraju: రైతు ఆత్మహత్యలు లేని వ్యవసాయం చూడాలన్నదే ఆయన కోరిక.!
ముఖ్యమంత్రి కే సీ ఆర్ గారు పలు జిల్లాల్లో పర్యటించి, నష్టపోయిన రైతులను ఓదార్చి, నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ సారి కేవలం భూమి ఉన్న రైతులకే కాకుండా, కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ అధికారులు, పంటపొలాల్లో పర్యటించి, రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 1.31 లక్షల మంది నష్టపోయిన రైతులకు రూ. 151.46 కోట్లను ప్రభుత్వం రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుండి ప్రారంభించనుంది.