Anthrax Disease: గొర్రెల నుంచి మనుషులకు, మనుషులంచి గొర్రెలకు సంక్రమించే సాంక్రమిక వ్యాధి. దొమ్మవ్యాధి, నెత్తురు రెక్క, నెరడు దొమ్మ వంటి పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తుంటారు. అన్ని రుతువుల్లోను ముఖ్యంగా కరువుకాటకాలు ఏర్పడినప్పుడు, వరదలు, వాతావరణం లో అకస్మిక మార్పులు సంభవించినప్పుడు ఆంత్రాక్స్ వ్యాధి ప్రభలే ప్రమాదము ఎక్కువగా ఉంటుంది .
వ్యాధి లక్షణాలు ?
ఆంత్రాక్స్ సాధారణంగా పశువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు వంటి గడ్డితినే జంతువులలో వచ్చే అంటు వ్యాధి. ఇది బాసిల్లస్ ఆంత్రాక్స్ అను స్పోర్స్ ఏర్పరచే బాక్టీరియా వల్ల వస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ జంతువుల నుంచి ఆంత్రాక్స్ మనుషులకు సోకే ప్రమాదం ఉంది.
ఆంత్రాక్స్ ఎలా వ్యాపిస్తుంది ? ఎవరికి వ్యాపిస్తుంది ?
పశు సంపద ప్రధాన పాత్ర వహించే వ్యవసాయక ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువ. గొర్రెల ద్వారా లేదా వాటి ఉత్పత్తుల ద్వారా ఆంత్రాక్స్ మనుషులకు సోకుతుంది. చనిపోయిన గొర్రెల కు సంబంధించిన ముడిసరుకుల కర్మాగారాలలో పనిచేసేవారు విదేశాల నుంచి జంతు సంబంధమైన ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునేవారు ఆంత్రాక్స్ బారినపడే అవకాశాలు ఉన్నాయి.
మనుషులలో ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే విధానాన్ని బట్టి చర్మం సంబంధిత, శ్వాసకోశ సంబంధిత మరియు జీర్ణకోశ సంబంధిత ఆంత్రాక్స్ అను మూడు రకాలుగా ఉంటుంది. చనిపోయిన గొర్రెల శరీరాన్ని పూడ్చి లేదా కాల్చకుండా వదిలేస్తే వాటికి సంభందించిన ఆంత్రాసిస్ స్పోర్స్ మట్టిలో సైతం చాలా ఏళ్ళు మనగలుగుతాయి. ఆంత్రాక్స్ స్పోర్స్లను పీల్చడం ద్వారా, ఆంత్రాక్స్ వ్యాధి బారిన పడిన జంతు లేదా గొర్రెల మాంసాన్ని సరిగ్గా వండకుండా తినడం వల్ల అనగా గాలి, నీటి, మేత ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
ఆంత్రాక్స్ లక్షణాలేమిటి ?
వ్యాధి సోకిన విధానాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా వ్యాధి సోకిన వారం రోజుల్లో ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడతాయి.
చర్మ సంబంధిత ఆంత్రాక్స్ :
ఆంత్రాక్స్ సోకిన జంతువుల/గొర్రెల ఉన్ని, చర్మం, వెంట్రుకలు మొదలైన ఉత్పత్తులకు సంబంధించిన కర్మాగారాలలో పని చేసేవారిక చర్మంపై ఉన్న గాయాల ద్వారా వ్యాధి కారక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ భాగంలో ఏధైనా పురుగుకుట్టిందేమో అన్నట్లుగా వాపు వస్తుంది. అది ఒకటి, రెండు రోజుల్లో ఉబికి అల్సర్ గా పరిణమిస్తుంది. మధ్యలో నల్లటి మచ్చలాగా ఏర్పడుతుంది.
ఎలాంటి చికిత్స జరగని సందర్భంలో 20% చర్మ సంబంధిత ఆంత్రాక్స్ కేసులు మరణానికి దారి తీస్తాయి. తగిన చికిత్సతో మరణాన్ని నివారించవచ్చు.
శ్వాసకోశ సంబంధిత ఆంత్రాక్స్ :
గాలిలో ఉన్న ఆంత్రాక్స్ స్పోర్స్ పీల్చడం వలన వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. తొలి దశలో జలుబులా అనిపిస్తుంది. తరువాత శ్వాస పీల్చడంలో ఇబ్బందులు, అకస్మాత్తుగా శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. శ్వాసకోశ సంబంధిత ఆంత్రాక్స్ ప్రాణాంతకరము.
Also Read: Acacia Tree Medicinal Uses: ఎన్నో ఆయుర్వేద గుణాలున్న తుమ్మ చెట్టు గురించి మీకు తెలుసా.!

Anthrax Disease
జీర్ణకోశ సంబంధిత ఆంత్రాక్స్ :
ఆంత్రాక్స్ బాసిల్లస్ తో కలుషితమైన మాంసాన్ని సరిగా వండకుండా తినడం వల్ల ఇది వస్తుంది. నీరసం, ఆకలి మందగించడం, వాంతులు, జ్వరం, రక్తపు విరోచనాలు, గొంతునొప్పి మరియు కడుపులో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ తరహా ఆంత్రాక్స్ బారిన పడ్డ కేసుల్లో 25%నుండి 60% వరకు మరణాలు సంభవిస్తాయి.
ఆంత్రాక్స్ ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ?
ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ ఆధార ప్రదేశాలలోను, ప్రజారోగ్య కార్యక్రమాలు సరిగా చేపట్టని దేశాల్లోను, గొర్రెల పెంపకము చేపట్టే ప్రదేశాలలోనూ, గొర్రెల ఉత్పత్తులు ను పరిశ్రమగా ఉండే చోట్ల మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను కనిపిస్తుంది.
ఆంత్రాక్స్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుందా ?
ఆంత్రాక్స్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకదు. మరియు ఒక గొర్రె నుండి మరొక గొర్రెకు కూడా సోకదు.
ఆంత్రాక్స్ తో చనిపోయిన గొర్రె ను గుర్తు పట్టడము ఎలా?
ఆంత్రాక్స్‌తో చనిపోయిన గొర్రె మూతి , ముక్కు, గుదము మొదలగు భాహ్య రంద్రాల నుండి నురగతో కూడిన నల్లని గడ్డ కట్టని రక్తము వస్తుంది.
ఈ వ్యాధి సోకిన గొర్రెలు చూడటానికి బాగానే ఉంటాయి. కాని ఉదయం లేచేసరికి చనిపోయి ఉంటాయి.
ఆంత్రాక్స్ ను నియంత్రించడం ఎలా ?
ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే దేశాలలో గొర్రెలకు టీకాలు వేయడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చును మరియు వ్యాధి బారిన పడిన గొర్రెల కళేబరాలను కాల్చివేయడం ద్వారా స్పోర్స్ ను నాశనం చేయడం, వాటి మాంసాన్ని తినకుండా ఉండడం, వాటి ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చును.
ఆంత్రాక్స్‌కు టీకా ఉందా ?
ఆంత్రాక్స్‌కు టీకా ఉంది. గొర్రెలకు ప్రతి సంవత్సరము సెప్టెంబరు నెలలో పశు సంవర్ధక శాఖ ద్వార గొర్రెలకు ఉచితముగా సరఫరా చేయుచున్నారు. మనుషులకు సంభందించి కూడా టీకా ఉండి. కానీ అంతగా మనుగడలో లేదు.
ఆంత్రాక్స్ టీకాను ఎవరు వేయించుకోవాలి ?
. పశువైద్య సిబ్బంది
. ప్రయోగశాలల్లో ఆంత్రాక్స్ బాక్టీరియాతో ప్రత్యక్షంగా పనిచేసేవారు
. జంతు సంబంధ ఉత్పత్తుల పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, సిబ్బంది
. జీవాయుధాల ప్రమాదం పొంచి ఉన్నచోట విధులు నిర్వహించే రక్షణ సిబ్బంది
. గొర్రెల కాపలదారులు మరియు గొర్రెలు
ఆంత్రాక్స్ వ్యాధిని నిర్థారించటం ఎలా ?
ఆంత్రాక్స్ వ్యాధితో చనిపోయిన గొర్రెల రక్తాన్ని చెవి కొనను కోసి రక్తపు గాజు పలకలను తయారుచేసి మిథైల్ బ్లూ స్టెయినింగ్ ద్వార ఆంత్రాక్స్ స్పోర్స్ ను గమనించవచ్చును. మరియు నిర్ధారణ చేసుకునవచ్చును.
ఆంత్రాక్స్ ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తి రక్తంలోని నిర్ధిష్ట యాంటీ బాడీస్‌ను లెక్కించటం, రక్తం, చర్మం, శ్వాసద్రవాల పదార్థాల నుంచి ఆంత్రాసిస్ వేరు చేయడం ద్వారా ఆంత్రాక్స్ వ్యాధిని నిర్థారించవచ్చు.
ఆంత్రాక్స్‌కు చికిత్స ఉందా ?
చికిత్స ఉంది. వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభించడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమగును. వైద్యుల సలహా మేరకు పెన్సిలిన్, డాక్సిసైక్లిన్, ఎరిత్రోమైసిన్ లేదా సిప్రోప్లాక్సాసిన్ మందులు వాడితే వ్యాధినయమగును.
గొర్రెల మందలో ఉన్న ఒకటి చనిపోయి నిర్ధారణ అయితే మిగతా గోర్రేలన్నింటికి డాక్సిసైక్లిన్ పౌడర్‌ను వరుసగా ఉదయము, సాయంత్రము 3-5 రోజులు త్రాపవలెను.
ఆంత్రాక్స్ వ్యాధిని నివారణ ఎలా ?
. ఆంత్రాక్స్ వ్యాధి తో నిర్ధారణ అయిన గొర్రె శరీరాన్ని పోస్టు మార్టం చేయకూడదు. ఆంత్రాక్స్ స్పోర్స్ మట్టిలో దాదాపుగా 30 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. కావున చనిపోయిన గొర్రెల శరీరాన్ని ఖచితముగా కాల్చాలి లేదా గొయ్యి తీసి సున్నమును చల్లి పాతి పెట్టాలి.
. ఏ మందలో చనిపోయిందో తెలుసుకుని ఆ మంద ఉండే ఊరుకు మరియు చుట్టూ పక్కల ఐదు కిలోమీటర్ల మేర గొర్రెలకు అన్నిటికి రింగ్ ఆంత్రాక్స్ వాక్షినేషన్ 3-5 సంవత్సరాల వరకు వ్యాక్షినేషన్ చేయించాలి.
. వ్యాధి సోకిన జీవాలు తిన్న గడ్డి గాని లేదా దాణా గాని కాల్చి వేయాలి.
. వ్యాధి సోకిన జీవాలు చర్మము, ఉన్ని, మాంసము, కొమ్ములు వినియోగించకూడదు.
. వ్యాధి సోకిన ప్రాంతాలను గుర్తించి అటు వైపు గొర్రెలను మేతకు తీసుకెళ్ళకూడదు.
Also Read: Tunikaku Collection: తునికాకు సేకరణకు వేళాయెరా.!
Also Watch: