సింధనూరు తాలూకా రైతులు ఖరీష్ లో కోలుకోలేకపోయాం.. రబీ అయినా మమల్ని గట్టెక్కించగలదన్న ఆశతో ఉన్నట్లు సింధనూరు తాలూకా రైతులు రెండో పంట వరిపై గంపెడాశలు పెట్టుకున్నారు. రెండో పంట సజావుగానే సాగుతోంది. రెండున్నర నెల ప్రాయంలో సాగుబడి ఉంది. నేటికీ పెద్దగా పురుగులు, కీటకాలు, తెగుళ్ల సమస్య తలెత్తలేదు. ఇంకో రెండు నెలలు ఇలాగే సాగితే తక్కువ ఖర్చుతో గట్టెక్కుతామని అంటున్నారు. కాలువలు కట్టేసేలోగా పంట చేతికందుతుందన్న ఆశతో సింధనూరు తాలూకా అంతటా అధికశాతంలో ఆర్.ఎన్.ఆర్ రకం వరిని పండిస్తున్నారు. కొన్ని చోట్ల గంగాకావేరి, కావేరీ సోనా రకాలు కూడా వేశారు. తొలి పంట అన్ని రకాలుగా నష్టాలనే మిగిల్చిందని చెబుతున్నారు. ఆది నుంచి అధికంగా కలుపు, అదనపు కూలీల ఖర్చు, పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు, కంకులు నేల రాలడంతో మళ్లీ కూలీల ఖర్చు, తడి నేలల్లో హడావుడిలో అయినకాడికి యంత్రాలకు బాడుగలు చెల్లించి నూర్పిళ్ళు చేయించగా చిట్ట చివరికి బస్తాకు రూ. 1000 దాటని ధాన్యం ధరతో తొలకరి సేద్యంలో పైసా మిగలలేదని సింధనూరు రైతులు గణాంకాలతో తమ కష్టాలు ఏకరవుపెట్టారు.