ఉద్యానశోభ

Care to be taken for Plants in Winter: చలికాలం లో మొక్కలకు తీసుకోవలసిన జాగ్రత్తలు.!

1

Care to be taken for Plants in Winter: చలికాలంలో వేసుకునే పంటలకు ఇప్పుడే నార్లు పోసుకోవాలి. నేరుగా విత్తుకునే తీగెజాతి విత్తనాలను కూడా నానబెట్టి నేరుగా విత్తుకోవాలి. ఇప్పుడు విత్తనాలను విత్తుకుంటే చలి బాగా ముదిరేసరికి మొక్కలు కొంచెం ఎదిగి ఉంటాయి. చలి పెరిగిన తర్వాత విత్తుకుంటే చలికి మొక్కలు సరిగా పెరగవు.

Care to be taken for Plants in Winter

Care to be taken for Plants in Winter

శీతాకాలంలో మొక్కల సంరక్షణ చాలా సులభం. ఈకాలంలో మొక్కలకు నీరు ఎక్కువగా ఇవ్వకూడదు. తేమను చూసి నీరు ఇవ్వాలి. మొక్కలకు నీళ్ళు ఉదయమే ఇవ్వాలి. మరీ చలిలో కాకుండా కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఇవ్వాలి.ఈ కాలంలో బోరింగ్‌ నీళ్ళు అయితే మంచిది. అవి చల్లగా ఉండవు కాబట్టి బోరింగ్‌ ఉన్నవాళ్ళు బోరింగ్‌ నీళ్ళు ఇవ్వడమే మంచిది. ప్రూనింగ్‌ (కత్తిరింపులు) వంటివి చేయకూడదు. ఎందుకంటే ఈకాలంలో మొక్కలు నిద్రాణస్థితిలో ఉంటాయి. కొత్త పెరుగుదలను అభివృద్ధి చేయలేవు.

ఈకాలంలో మొక్కలకు చేయవలసిన పనులు మొక్కలను శుభ్రపరచడం. మొక్కల పాడైన భాగాలను తీసివేయాలి. కలుపు మొక్కలను తొలగించాలి. వీటిని తొలగించకపోతే తోటలోని మొక్కలతో పాటుగా పోషకాలను తీసుకుంటాయి. తీసిన కలుపు మొక్కలను కంపోస్టులో వేసుకోవచ్చు. చలికాలంలో మట్టిని మల్చింగ్‌ చేయాలి. మల్చింగ్‌ చేయడం వలన మట్టిని వెచ్చగా ఉంచవచ్చు. మల్చింగ్‌ చేసేటప్పుడు మొక్కకు కొంచెం దూరంలో చేయాలి. చలికాలంలో మొక్కలను రీ పాటింగ్‌ చేయకూడదు. ఎక్కువగా పోషకాలు ఇవ్వకూడదు. ఇవన్నీ పండ్ల మొక్కలకు తీసుకోవలసిన జాగ్రత్తలు.
కూరగాయల మొక్కలు ఎలా పెట్టుకోవాలి, నార్లు ఎలా పోసుకోవాలి

 తెలుసుకుందాం: నారు పోసుకోవడానికి ముందుగా ఏదైనా ట్రే లాంటిది కానీ, లేదంటే సీడ్‌ లింగ్‌ ట్రే కానీ, చిన్న కుండీలు కానీ ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోవాలి. మట్టి మిశ్రమం కోసం ఇసుక, వర్మీ కంపోస్టు సమానంగా కలుపుకోవాలి. కోకోపీట్‌ వాడుకునే వాళ్ళు కోకోపీట్‌, వర్మీ కంపోస్టు సమానంగా కలుపుకోవాలి.
ఇసుక కలుపుకోవడం వలన మొలకలు కుళ్ళిపోవడం చాలా చాలా తక్కువ. పెరిలైట్‌, వర్మీ కంపోస్ట్‌ మిశ్రమంలో కూడా విత్తనాలు విత్తుకోవచ్చు. ఏ మిశ్రమం అయినా తేలికగా ఉండాలి. అలా ఉన్నప్పుడు విత్తనం త్వరగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. మిశ్రమం ట్రేలలో పోసి నీటితో తడపాలి. వాటిలో విత్తనాలు వేసి నీళ్ళు చల్లాలి.

ఈ కాలంలో విత్తనాలు సరిగా మొలకెత్తవు కాబట్టి నారు పోసిన ట్రేలు, కుండీలను ఇంట్లో వెచ్చగా ఉండే ప్రదేశాల్లో ఉంచాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత వాటిని బయట ఉంచవచ్చు. నారు పోసిన ట్రేలు, కుండీలను ఇంట్లో ఉంచే అవకాశం లేనివారు వాటిమీద ఒక ప్లాస్టిక్‌ కవర్‌ ను కానీ ప్లాస్టిక్‌ పేపర్‌ ను కానీ చుట్టి ఉంచాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత ప్లాస్టిక్‌ కవర్‌ను తీసివేయాలి.
మొలకలు వచ్చిన తర్వాత వాటిని కొంచెం ఎండకు పెట్టాలి. ఎండకు పెట్టకుండా నీడలోనే ఉంచితే అవి సాగి పోయి అంటే బాగా పొడవుగా పెరిగి పడిపోతాయి. మొలకలకు వేరు కుళ్ళు కూడా రావచ్చు. నీళ్ళు అవసరమనుకుంటేనే ఇవ్వాలి.

ఉదయం ఎండ సరిపోతుంది, వర్షం పడేట్లుగా ఉంటే తీసి షేడ్‌ లో పెట్టుకోవాలి. మొలకలు మూడు నాలుగు ఆకులు వచ్చిన తర్వాత తీసి ప్రధాన మడిలో నాటుకోవాలి. నారు మొక్కలను చలికాలంలో కూడా సాయంత్రం పూటనే నాటుకోవాలి. పాదుల విత్తనాలు విత్తుకోవాలంటే వాటి విత్తనాలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక రోజు నానబెట్టి విత్తుకుంటే త్వరగా మొలకెత్తుతాయి.
పాదులు విత్తుకోవాలంటే విత్తనాలు నేరుగా ప్రధాన మడిలో విత్తుకోవాలి. పాదుల విత్తనాలను కూడా ప్లాస్టిక్‌ గ్లాసులలో కానీ, సిడ్‌ లింగ్‌ ట్రే లో కానీ విత్తుకుని మొలకలు వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా తీసి ప్రధాన మడిలో నాటుకోవాలి.

ఇంకొక పద్ధతి: అన్ని రకాల విత్తనాలను జెర్మినేషన్‌ పేపర్‌లో ఉంచి పేపర్‌ తడిపి ఒక బాక్స్‌ లో మూసి ఉంచాలి. మొలకలు వచ్చిన తర్వాత తీసి నాటుకోవచ్చు. చలికాలంలో ఈ పద్ధతిలో త్వరగా మొలకెత్తుతాయి. మొలకలు వచ్చిన తర్వాత ప్రధాన మడిలో ఎక్కడ నాటుకోవాలి అనుకుంటే అక్కడ నాటుకోవచ్చు.

Germination Paper

Germination Paper

ఈకాలంలో పెరిగే కూరగాయలు, పూలు, ఆకుకూరలను పెంచుకుంటే దిగుబడి బాగుంటుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్‌, క్యారెట్‌, చిక్కుడు, బీన్స్‌, బీట్‌ రూట్‌, టమోటా, మిర్చి, కొత్తిమీర, మెంతికూర, పాలకూర లాంటివి పెంచుకోవాలి. బ్రస్సెల్స్‌ పెంచుకుంటే పోషకాలు కూడా బాగుంటాయి. తీగె జాతిలో సొర, పొట్ల పెంచుకోవచ్చు. బాగానే పెరుగుతాయి. బీర, కాకర, దోస లాంటివి చలికి సరిగా పెరగవు. గోరుచిక్కుడు, దొండకాయ, బెండ కూడా సరిగా పెరగవు.

బాక్టీరియా, శిలీంధ్ర వ్యాధులు, వైరస్‌ వ్యాధులు రాకుండా క్రమం తప్పకుండా వ్యాధి నిరోధకాలను పిచికారి చేయాలి. క్యాబేజీ లాంటి వాటికి అఫిడ్స్‌, పచ్చపురుగులు లాంటివి ఆశిస్తాయి. చైనీస్‌ క్యాబేజీ లాంటి వాటిని పెంచుకుంటే అఫిడ్స్‌ లాంటి చీడపీడలు ముందుగా వాటిని ఆశిస్తాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ లో వచ్చే పచ్చపరుగు నివారణకు ఏదైనా ఒక పిండి అంటే గోధుమ పిండి, బియ్యం పిండి లాంటి పిండి తీసుకొని దానికి సమానంగా బేకింగ్‌ సోడా తీసుకుని రెండిరటినీ బాగా కలిపి పచ్చపురుగు ఆశించిన మొక్కల మీద చల్లాలి. అలా చేస్తే రెండు మూడు రోజులలో పురుగు చనిపోతుంది.

Also Read: Unseasonal Rains: రైతులకు వరంగా మారిన అకాల వర్షాలు

ఇంకా బాక్టీరియా, శిలీంధ్ర వ్యాధులు రాకుండా పుల్ల మజ్జిగ ద్రావణం కానీ, బేకింగ్‌ సోడా ద్రావణం కానీ, ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్‌ ఫ్లోరొసెన్స్‌ కానీ పిచికారి చేయవచ్చు. వైరస్‌ వ్యాధులు రాకుండా ఆవు మూత్రం కానీ, ఆవు పాలు కానీ, పసుపు, వెల్లుల్లి ద్రావణం కానీ స్ప్రే చేయాలి
పుల్ల మజ్జిగ తయారీ విధానంలో ఫ్రిజ్‌ లో పెట్టని పెరుగు అయితే బాగా పనిచేస్తుంది. పెరుగును కవ్వం తో చిలికి, అలా చిలికిన మజ్జిగను నాలుగైదు రోజులు మూత పెట్టి ఉంచాలి. పుల్ల మజ్జిగ 30 మి.లీ. లీటరు నీటిలో కలిపి మొక్కలకు పిచికారి చేయాలి.

పసుపు, వెల్లుల్లి ద్రావణం: ఒక లీటరు నీటికి మూడు టేబుల్‌ స్పూన్లు పసుపు వేసి బాగా మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు పేస్ట్‌ చేసి నీటిలో కలిపి ఒక రాత్రి ఉంచి ఆ ద్రావణానికి సమానమైన నీటిని కలిపి మొక్కలకు పిచికారి చేయాలి.

బేకింగ్‌ సోడా ద్రావణం: ఒక లీటరు నీటికి 2 గ్రా. బేకింగ్‌ సోడా, 5 మి.లీ. వేపనూనె కలిపి (వేపనూనె లేకపోతే, ఏదైనా వెజిటబుల్‌ ఆయిల్‌) 2 మి.లీ. లిక్విడ్‌ సోప్‌ లేదా కుంకుడు కాయ రసం వేసి బాగా కలిపి మొక్కలకు పిచికారి చేయాలి. దీనిని అన్ని మొక్కలకు ఫంగల్‌ వ్యాధులను తగ్గించడానికి, పెస్ట్‌ లను తగ్గించడానికి ఉపయోగించవచ్చు.
ఆవు మూత్రం లీటరు నీటికి 5 ఎంఎల్‌ కలిపి స్ప్రే చేయాలి. ఆవు పాలు ఒక వంతు నీళ్ళు తొమ్మిది వంతులు కలిపి మొక్కలకు స్ప్రే చేయాలి. ఇలా చేయడం వలన వైరస్‌ వ్యాధులు రాకుండా ఉంటాయి. పసుపు, వెల్లుల్లి ద్రావణం కూడా వైరస్‌ వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది. ఈకాలంలో చీడపీడలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏదైనా స్ప్రే చేస్తూ ఉండాలి. అంటే ఆవు మూత్రం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం, వేపాకు కషాయం, వేపనూనె ఇలా ఏదో ఒకటి పిచికారి చేయాలి. ఇలా చేయడం వలన చీడపీడలు మొక్కలకు అంతగా ఆశించవు.
ఏ కాలంలో పెరిగే మొక్కలను ఆ కాలంలో పెంచుకుంటే మిద్దె తోటలో దిగుబడి ఎక్కువగా పొందవచ్చు.
-లత కృష్ణమూర్తి, ఫోన్‌ : 94418 03407

 Also Read: Unseasonal Rains: అకాల వర్షాలతో మిర్చి రైతుల ఆందోళన

Must Watch:

Leave Your Comments

Flowers in Gardening: గార్డెనింగ్‌లో వార్షిక పూలను సులభంగా పెంచుకునే విధానం.!

Previous article

Paddy Brown Plant Hopper: వరిలో సుడిదోమ సమగ్ర యాజమాన్యం నష్ట లక్షణాలు.!

Next article

You may also like