Precautions of Pesticides: వ్యవసాయ ఆధారితమైన మనదేశంలో రైతులు వివిధ పంటలు పండిస్తున్నారు కానీ పండిరచిన పంటలో సుమారు 30 శాతం వరకూ వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ళు ఆశించటం ద్వారా నష్టపోతున్నారు. అయితే ఈ పురుగులు, తెగుళ్ళ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి పంటను కాపాడుకోవడానికి రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల విచక్షణారహితంగా వివిధ రకాల పురుగు మందులు వాడుతున్నారు. దీనివల్ల సాగు ఖర్చు ఎక్కువ అవడం తో పాటుగా పురుగులలో పురుగుమందులను తట్టుకునే శక్తి మరియు వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతున్నాయి. రైతులు పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కావున రైతులు పురుగు మందులు కొనేటప్పుడు మరియు వినియోగించేటప్పుడు క్రింది సూచించిన మెళకువలు పాటించడం ద్వారా మంచి దిగుబడులు పొందడంతో పాటు తమ ఆరోగ్యాన్ని మరియు పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు.
ఎప్పుడు పురుగు మందుల పిచికారీ చేయరాదు : చీడపీడలు కనపడక ముందే ముందు జాగ్రత్తగా కొంతమంది రైతులు పురుగు మందులను పిచికారి చేస్తున్నారు. దీని వలన మనకు మేలు చేసే మిత్ర పురుగులు చనిపోయి వాటి ద్వారా నియంత్రించబడే చీడపీడల సంఖ్య గణనీయంగా పెరిగి పంటకు నష్టం కలిగిస్తాయి. మనకు మేలు చేసే మిత్ర పురుగులు చనిపోయి వాటి ద్వారా నియంత్రించబడే చీడపీడల సంఖ్య గణనీయంగా పెరిగి పంటకు నష్టం కలిగిస్తాయి. దీనివల్ల సస్యరక్షణ ఖర్చులు కూడా బాగా పెరిగిపోతుంది కావున రైతులు హానిచేసే పురుగుల సంఖ్య ఆర్థిక ప్రవేశ స్థాయి దాటిన తరువాత మందులు పిచికారీ చేసుకుంటే మంచిది.
పొలంలో సహజ శత్రువులు మరియు పురుగుల సంఖ్య 2ః1 నిష్పత్తిలో ఉన్నప్పుడు పురుగు మందులను పిచికారి చేయరాదు. అదేవిధంగా సహజ శత్రువులైన పరాన్న జీవులు మరియు పరాన్నభుక్కులను పొలంలో విడిచి పెట్టడానికి ఒక వారం ముందు అదేవిధంగా విడిచిన తరువాత వరకు పురుగు మందులను పిచికారి చేయరాదు.
కొంత మంది రైతులు పంట కోతకు వచ్చిన సమయంలో కోతకు రెండు నుండి మూడు రోజుల ముందు కూడా పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. దీనివలన కోత అనంతరం ఆహారపదార్థాలపై పురుగు మందుల అవశేషాలు ఉంటాయి. అవి మన శరీరంలోనికి ప్రవేశించి అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. అంతేకాకుండా పరిమితికి మించి ఆహార పదార్థాలపై పురుగుమందుల అవశేషాలు ఉంటే వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా తిరస్కరిస్తారు.
పురుగు మందులు కొనుగోలు, వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు :
- పురుగు మందులను ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన దుకాణాల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి.
- రైతులు తమ పొలాల్లో పురుగులను గమనించినట్లయితే తమ దగ్గర్లోని వ్యవసాయ అధికారులకు లేదా గ్రామంలోని ఆదర్శ రైతులకు ఆ పురుగు మందులను చూపించి వారి వద్ద నుండి వాటి యొక్క నివారణకు వాడవలసిన పురుగు మందులు మరియు వాటి యొక్క మోతాదు గురించి అడిగి తెలుసుకోవాలి.
- పురుగు మందులు కొనుగోలు చేసేటప్పుడు ఆ మందు యొక్క బ్యాచ్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ తయారు చేయబడిన తేదీ గడువు తీరు తేదీ మరియు ప్యాకింగ్‌లను సరిచూసుకోవాలి. కొనుగోలు చేసిన తరువాత దుకాణదారు నుండి తప్పనిసరిగా బిల్లు అడిగి తీసుకోవాలి.
- పురుగు మందులను ఆహారపదార్థాలు ఉంచిన సంచిలో పెట్టి తీసుకుని వెళ్ళరాదు. వాటిని విడిగా వేరే సంచిలో పెట్టి తీసుకుని వెళ్లాలి.
- ఈ మందులను సురక్షితమైన ప్రదేశంలో చిన్న పిల్లలకు మరియు పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.
- ఈ పురుగు మందులను కొన్న తరువాత వాడకానికి ముందుగా వాటి ప్యాకింగ్ మీద ఉన్న లేబుల్ మరియు వాటితో పాటు ఇచ్చిన కరపత్రంలో సమాచారాన్ని చదవాలి.
- వీటిలో మందు యొక్క మోతాదు ఏ ఏ పంటల్లో ఏ పురుగులకు ఎంత వాడాలి అలాగే మందు వాడకంలో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే ఎటువంటి ప్రథమ చికిత్స చేయాలి వంటి సమాచారం ఉంటుంది.
- రైతులు ఈ మందు యొక్క విష తీవ్రతను లేబుల్ మీద ఉన్న రంగు త్రిభుజం ఆధారంగా గుర్తించవచ్చు. ఎరుపురంగు త్రిభుజం అంటే అత్యంత విషపూరితమైనది అని, పసుపు రంగు త్రిభుజం అంటే ఎక్కువ విషపూరితం, నీలం రంగు త్రిభుజం ఉంటే సాధారణ విషపూరితం మరియు ఆకుపచ్చ త్రిభుజం ఉంటే తక్కువ పూరితం అని గుర్తించుకొని వాటికి అనుగుణంగా మందులను వినియోగించుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
- ఒకే రకమైన పురుగుమందులను పదే పదే వాడరాదు. దీనివల్ల పురుగులలో పురుగు మందులు తట్టుకునే శక్తి వస్తుంది.
- రెండు లేదా అంతకన్నా ఎక్కువ పురుగుమందులను కలిపి ఇష్టం వచ్చినట్లుగా వాడకూడదు. ఒకవేళ వాడవలసి వస్తే వాటి కలయిక గురించి ముందుగానే తెలుసుకోవాలి.
- మందులను సిఫారసు చేసిన మోతాదులోనే వినియోగించుకోవాలి. ఆ మోతాదులో పురుగు మందు ద్రావణం తయారు చేసుకోవడానికి శుభ్రమైన నీటిని వినియోగించాలి. ఉప్పు నీటిని వాడకూడదు.
- పురుగుమందులను కలిపేటప్పుడు మరియు పిచికారీ చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. ఈ మందుల నుండి వెలువడే విషవాయువులు నుండి కాపాడుకోవడానికి ముక్కు మరియు నోటికి మాస్కూలు మరియు కళ్ళకు కళ్ళజోడు ధరించాలి.
- పురుగు మందు పిచికారి చేయడానికి ఉపయోగించే స్ప్రేయర్ నాజిల్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏవైనా పదార్థాలు అడ్డు పడినట్లయితే వాటిని బ్రష్తో శుభ్రం చేయాలి. అంతేకాని నోటితో ఊదడం, లాగడం వంటివి చేయకూడదు.
- పురుగు మందులు కలపడానికి ఉపయోగించే బకెట్లు మరియు పిచికారీ ఉపయోగించే స్ప్రేయర్‌లు పిచికారీ చేసే ముందు చేసిన తరువాత మంచి నీటితో సబ్బు పెట్టి శుభ్రంగా కడగాలి.
- ఈ మందులను వాతావరణం పొడిగా ఉన్నప్పుడు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.
- మందులు పిచికారీ చేసిన వెంటనే పొలంలోనికి మనుషులు లేదా పశువులు వెళ్లకుండా చూసుకోవాలి.
-డా.ఎం స్వాతి, శాస్త్రవేత్త (సస్యరక్షణ) డా. కె.లక్ష్మణ్ సమన్వయకర్త డా. కె. తేజేశ్వరరావు (అగ్రానమి),
ఏరువాక కేంద్రం, విజయనగరం, ఫోన్ : 94930 84826.
Also Read: Precautions of Rose Cultivation: గులాబీల్లో కత్తిరింపులు చేసే సమయంలో జాగ్రత్తలు..!
Must watch: