Jamun Fruit Health Benefits: జీవన విధానం, విహార, వ్యవహారాలలో అనేక మార్పులు చోటు చేసుకోవడం ఆధునిక జీవనశైలిగా చెప్పుకుంటూ ఉన్నాం. మార్పు మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలి. ఆర్ధిక అభివృద్ధి మనిషి ఆరోగ్యాన్ని విఘాతం కలిగించేదిగా ఉండకూడదు. నల్లగా ఉందని వదిలేయొద్దు నేరేడు పండు ఆరోగ్యంగా ఉంచుతూ, చక్కెర వ్యాధిని తగ్గిస్తుంది.
పోటీ, ఒత్తిడితో చిత్తయిపోతున్నాం: పూర్వీకులు అందించిన ఆహార, విహార అలవాట్లను దూరం చేసి, ‘న్యూ ట్రెండ్’ అంటూ వేష భాషలందు, తినే ఆహారంతోపాటు అన్నీ మార్పురావడంతో ఏమి తింటున్నాం, అది ఎంత వరకు మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో తెలిసి కూడా ఆచరించలేక అనారోగ్యాన్ని కొని తెచ్చుకొంటున్నారు. ఆధునిక యుగంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి విషయంలో పోటీ, ఒత్తిడితో ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఆదుర్దాచెందుతూ మానసిక ఒత్తిడికి గురై బి.పి, షుగర్, గుండె నొప్పి, క్యాన్సర్ వంటి రకరకాల జబ్బులకు మానవ శరీరం పెద్ద నిలయంగా మారింది. దీనికి కారణం ఏ వైద్యులను సంప్రదించినా, పౌష్ఠికాహార నిపుణులను అడిగినా చెప్పేది ఒక్కటే.
శారీరక వ్యాయామంతోపాటు కాలానుగుణంగా వచ్చేటువంటి ఆహార ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పోషకాలతో కూడిన సంపూర్ణ ఆహారం తీసుకోపోవటమే అని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గతంలో ఎక్కడో ఒకరికో ఇద్దరికో ఉండేది. ఇప్పుడు మధుమేహం ఏ ప్రాంతంలోనైనా సర్వ సాధారణంగా మారింది. చిరుధాన్యాలతోపాటు ఆహారంలో ఆకుకూరలు, కాకర, దొండ, పొట్ల వంటి కాయగూరలు. బొప్పాయి, జామ, నేరేడు వంటి పండ్లను తీసుకోవడం వలన చక్కెర వ్యాధి అదుపులో ఉంచుకొని కాలేయాన్ని బలపరచి, రక్తాన్నివృద్ధి చేస్తుండటంతో ఆరోగ్యంగా జీవించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.
నేరేడు చెట్టు: దీనిని సంస్కృతంలో ‘జంబూ ఫలం’, తెలుగులో ‘నేరేడు పండు’, హిందీలో ‘జామూన్’, ఇంగ్లీషులో ‘బ్యాక్పామ్’, యుజేనియా ఫ్రూటికోసా. దీని శాస్త్రీయ నామం సిజిజియం కుమిని. ఇది మిర్టేసి చెందింది. ఔషధ విలువలు కలిగిన బహువార్షికపు మొక్క సుమారు 6 మీటర్ల నుంచి 20 మీటర్ల ఎత్తువరకు పెరిగే వృక్షం. పుష్పాలు దాదాపు తెలుపుగా, ఆకులు లేని కణుపుల దగ్గర గుత్తులుగా వస్తాయి. ఆకులు కోలగా, పండ్లు నున్నగా నల్లద్రాక్ష రంగులో కోలగా ఉంటాయి. కండతో, ఒకే విత్తనంతో ఉంటాయి.
నేరేడు, అల్లనేరేడు, గిన్ని కాయలు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొన్ని రకాల్లో గింజ ఎక్కువగా ఉండి గుజ్జు తక్కువగా ఉంటుంది. మరికొన్ని రకాల్లో కండ ఎక్కువ ఉండి గింజ సన్నగా ఉంటుంది. జూన్, జులై మాసాల్లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి.
ఔషధ గుణాలు: నేరేడు పండు వగరు, తీపి, పులుపు రుచి కలిగి ఉంటుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, కాపర్, సల్ఫర్, క్లోరిన్, విటమిన్ ఎ, సి, ఫోలిక్ ఆసిడ్, ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు వంటి అనేక ఔషధ గుణములున్నాయని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో నిరూపించినట్లు తెలిసింది. నేరేడు పండు, ఆకులు, గింజలు, బెరడు అన్నిటిలోను ఔషధ గుణాలు ఉన్నాయి. ఉపయోగించే విధానంలోనే మార్పు ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ : నేరేడు బెరడు, కాండం,ఆకులు, మొగ్గలు మరియు పువ్వుల నుండి తయారుచేసే డికాక్షన్లకు (కషాయాలు బ్యాక్టీరియాలను నిరోధించే గుణం కలదు. దేనికవే విడివిడిగా గానీ లేదా అన్నీ కలిపిగానీ డికాక్షన్ తయారుచేసుకోవచ్చు.
యాంటీ బ్యాక్టీరియల్: నేరేడు బెరడు, కాండం,ఆకులు, మొగ్గలు మరియు పువ్వుల నుండి తయారుచేసే డికాక్షన్లకు (కషాయాలు) బ్యాక్టీరియాలను నిరోధించే గుణం కలదు. దేనికవే విడివిడిగా గానీ లేదా అన్నీ కలిపిగానీ డికాక్షన్ తయారుచేసుకోవచ్చు.
Also Read: Jamun Cultivation: నేరేడు సాగుతో అన్నదాతలకు లక్షల్లో ఆదాయం.!
మధుమేహం: నేరేడు గింజల ఎండ బెట్టిన చూర్ణం 3 -5 గ్రాముల వంతున రోజుకు 2 సార్లు మంచి నీళ్ళతో సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. తీవ్రమైన బ్లడ్ షుగర్ని కూడా ఇది అదుపులో ఉంచుతుంది. నేరేడు విత్తనాలు, పొడపత్రి, కాసు, పసుపు, ఉసిరి వరుగు కలిపి చూర్ణంచేసి ఒక చెంచా చొప్పున రోజుకు 3 సార్లు సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
నోటిలోని పుండ్లు: నేరేడు ఆకులతో తయారుచేసిన డికాక్షన్ నోటిలోకి తీసుకొని పుక్కిటపట్టి ఊసేసిన నోటిలోని పుండ్లు, అల్సర్ వంటి వ్రణాలు తగ్గుతాయి. దీని ఆకుల కషాయం వ్రణాలను కడగడానికి వినియోగిస్తారు.
జిగట విరేచనాలు, అతిసారం: నేరేడు బెరడుతో తయారుచేసిన కషాయం సేవిస్తే అతిసారం, జిగట విరేచనాలు తగ్గుతాయి.
రక్తవిరోచనాలు, మూత్రకోశంలో రాళ్ళు: నేరేడు లేత ఆకులు, మాను బెరడు, విత్తనాల రసం తీసుకోవడం వలన మధుమేహం, రక్తవిరోచనాలను తగ్గిస్తుంది. మూత్రకోశంలోని రాళ్ళను కరిగిస్తాయి. బెరడు చూర్ణం 3 5 గ్రాములు నీళ్ళతో వ్యాధిని తగ్గిస్తుంది.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Jamun Fruit: యూరోపియన్ మార్కెట్లలో జామున్ ఫ్రూట్ కి విపరీతమైన డిమాండ్
Must Watch: