Mulching Importance: ఇప్పటికీ 60-70 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి నేల, నీరు, వాతావరణం కాలుష్యం పెరిగిపోతోంది. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే నీటి లభ్యత తగ్గుతోంది. కొన్ని ప్రాంతాల్లో లభ్యత పెరిగినప్పటికీ అధిక ఖర్చుతో కూడుకొన్నది. కాబట్టి వ్యవసాయంలో వనరుల ఉత్పాదకతను పెంచడానికి కొన్ని పద్ధతులను ఆచరించాల్సి ఉంది. నేల, నీరు, వాతావరణ పరిరక్షణకు పాటించవలసిన మెలకువల్లో మల్చింగ్ లేదా అచ్చాదన ముఖ్యమైనది.
మల్చింగ్ అంటే ఏమిటి..?
మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరువ్యవస్థను – ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచి, మొక్క వేర్లను వేడి, చల్లదనం, వర్షాభావ పరిస్థితుల నుంచి కాపాడటాన్నే మల్చింగ్ ఆచ్ఛాదన) అంటారు. మల్చింగ్ కోసం వరిపొట్టు, రంపపుపొట్టు, ఎండిన ఆకులు, వరిగడ్డి, చెరకు పిప్పి, కొబ్బరిపీరు, పీకేసిన కలుపు, చిన్నచిన్న గులకరాళ్లు వంటి ప్రకృతి సహిత పదార్ధాలను దశాబ్దాల నుంచి వాడుతున్నప్పటికీ వాటి లభ్యత రానురాను తగ్గుతున్నందున గత 50 సంవత్సరాల్లో వివిధ కృత్రిమ పదార్థాల వాడకం గణనీయంగా పెరిగింది.
మల్చింగ్లో రకాలు: సాధారణంగా వివిధ పదార్థాలతో మల్చింగ్ చేసినప్పటికీ ప్రధానంగా రెండు రకాలుగా… సేంద్రియ, కృత్రిమ మల్చింగ్ విభజించవచ్చు.
సేంద్రియ మల్చింగ్: ప్రకృతిలో లభించే వివిధ సేంద్రియ పదార్థాలను చెట్టు బెరడు ముక్కలు, గడ్డి కత్తిరింపులు, వరి, గోధుమగడ్డి, ఆకులు, కంపోస్టు, పశువుల ఎరువు, వరిపొట్టు, రంపపు పొట్టు) వాడినప్పుడు అవి నేలలో ఉండే సూక్ష్మజీవుల సహాయంతో కాలక్రమేణ కుళ్లి నేలలో సేంద్రియ పదార్థాన్ని, పోషకాలను అందించడం, నీటి నిల్వ సామర్థ్యం పెంచడం కలుపును అదుపు చేయడం వంటి లాభాలను చేకూరుస్తాయి.
సేంద్రియ మల్చింగ్లో వాడే పదార్థాలు
చెట్టు బెరడు ముక్కలు: బెరడు ముక్కలు అధిక తేమని కలిగి ఉండటంతో పాటు తేమను అధిక సమయం వరకు నిలుపుకోగలుగుతాయి. వీటిని అధిక పొడి పరిస్థితుల్లో అధిక తేమ కలిగిన పరిస్థితుల్లో వాడవచ్చు. అధిక వర్షాలు కురిసినప్పుడు అధిక తేమను పీల్చుకోవడం ద్వారా వర్షాభావ పరిస్థితు నిలుపుకున్న తేమను మొక్కకు అందిస్తాయి. వీటిని అటవీ వ్యవసాయంలో పండ్ల తోటల్లో విరివిగా 2-4 ఇంచుల మందంలో వాడవచ్చు కానీ, కూరగారు పంటల్లో వాటి అమ్మ గుణం కారణంగా వాడరాదు.
గడ్డి కత్తిరింపులు: ఇవి చాలా విరివిగా అధిక మోతాదుల్లో లభ్యమవుతాయి. వీటి వాడకం ద్వారా నేలలో సేంద్రియ పదార్థంతో పాటు నత్రజని కూడా లభ్యమవుతుంది. పచ్చిగడ్డిని వాడినప్పుడు అవి వేర్లను వృద్ధి చేసుకొని పంట మొక్కలకు నష్టాన్ని కలుగజేస్తాయి. కావున ఎండిన గడ్డిని పల్చటి 2-3 ఇంచుల మందం గల పొరల్లో కూరగాయ పంటల్లో వాడవచ్చు.
ఎండు ఆకులు: ఇవి చాలా విరివిగా అన్ని ప్రాంతాల్లో అధిక మోతాదులో లభ్యమవుతాయి. చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో, అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలికాలంలో 3-4 ఇంచుల మందంతో ఆచ్ఛాదనగా వాడితే కుళ్లి మంచి ఎరువుగా మారి పోషకాలు అందించడంతో పాటు తేమను నిలుపుతాయి. కాని తేలికగా గాలికి ఎగిరిపోయే స్వభావం కలిగి ఉండటం వల్ల వాటిపైన చిన్న కొమ్మలను, చెట్టు బెరడును కప్పవచ్చు.
పంట వ్యర్థాలు: వరి/ గోధుమ గడ్డి/ చిరుధాన్యాల పంట వ్యర్థాలు వంటి పొలంలోనే లభ్యమయ్యే పదార్థాలను మల్చింగ్ గా వాడొచ్చు. వాటిని 6-8 అంగుళాల మందంలో పరచాలి. దీని ద్వారా నేలలో తేమ నిల్వ పెరగడమేగాక, కలుపును సమర్థంగా అరికట్టడం, వేడిని నిలువరించడంతో పాటు పోషకాలను నేలకు అందిస్తాయి. కలుపు మొక్కల గింజలు లేకుండా జాగ్రత్త పడాలి. ఈ రకం ఆచ్చాదన గడ్డి, ఎండుగడ్డి కంటే ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుంది.
Also Read: Mulching: వ్యవసాయంలో మల్చింగ్ యొక్క ప్రాముఖ్యత.!
కంపోస్టు ఎరువు/ పశువుల ఎరువు: కంపోస్టును/ ఎరువును మల్చింగ్గా వాడడం ద్వారా నేల భౌతిక, రసాయన, జీవ లక్షణాలు మెరుగుపడతాయి. అంతేకాక నేలలో తేమను నిలుపుకునే శక్తి పెరగడం, సూక్ష్మజీవులు అభివృద్ధితో పోషకాలు లభ్యత పెరుగుతుంది. కాని కలుపు నివారణ పూర్తిగా సాధ్యం కాదు.
రంపపు పొట్టు: చెక్క సంబంధిత పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో వీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. వీటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి. కానీ అధిక మొత్తంలో వాడినప్పుడు నత్రజని లోపం వచ్చే ఆస్కారం ఉంటుంది. దీంతో నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పత్రికా ప్రతులు/ కార్డ్ బోర్డు: వీటితో 2-3 సెం.మీ. మందంతో మల్చింగ్ చేయడం ద్వారా కలుపు నివారణ, నీటి నిల్వ సామర్థ్యం వంటి ప్రయోజనాలు ఉంటాయి. కానీ అధిక గాలికి ఎగిరి పోకుండా గాలి లేనప్పుడు చివర్లను చిన్న రాళ్లను గులకరాళ్లతో కప్పి నివారించుకోవచ్చు.
ఒలిచిన మొక్కజొన్న, జొన్నచొప్ప/ వేరుసెనగ పొట్టు/ కంది/ పత్తి కట్టె:
ఆర్థిక ఉత్పత్తి తీసుకున్న తర్వాత మిగిలిన పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడి కలుపు నివారణతో పాటు నీటి నిల్వ సామర్థ్యం పెంపు పోషకాలు లభ్యత నేలలో పెరుగుతుంది. జీవ ఆచ్ఛాదన: కొన్ని రకాల పప్పుజాతి పంటలైన దూలగొండి, బొబ్బెర, సుబాబుల్, జీలుగ వంటి వాటిని తొలిదశలో మొక్కలు వరుసల మధ్య పెంచడం ద్వారా కలుపు నివారణ, నేలలో ఉష్ణోగ్రత నియంత్రణ, పోషకాల లభ్యత వంటి లాభాలను పొందవచ్చు.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Polythene Mulching Technology: వేరుశెనగలో పాలిథిన్ మల్చింగ్ టెక్నాలజీ తో లాభాలు
Also Watch: