సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్దమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంగా వర్ణించవచ్చు.సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను మరియు నేలలో గల సూక్ష్మజీవుల పనితనాన్ని వృద్ది పరుస్తుంది . ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్నివిస్మరిస్తూ సేద్య, జీవసంబంధ మరియు యాంత్రిక పద్ధతులతో వ్యవసాయం చేయాలి.
నేల సంరక్షణ:
నేలపై లేదా భూమిపై పైరు వ్యర్ధపదార్ధాలను కప్పడం వలన నేలను సూర్యరశ్మి , గాలి మరియు వర్షపు నీటి కోతనుండి ఎటువంటి ఆర్ధిక నష్టం లేకుండా, మట్టిని ఎంత మాత్రం నష్టపోకుండా సంరక్షింప వచ్చును . ఎక్కువగా మరియు లోతుగా దుక్కి చేయుట వలన నేల కోతకు గురి కావడమే కాక నేలలోని సూక్ష్మజీవులు సంఖ్యా తగ్గిపోతుంది. కనుక నేలను అవసరమైనంత మేరకు మాత్రమే తక్కువగా దుక్కి చేయవలెను.
వ్యవసాయం లేదా పంటల సాగు మరియు పశుపోషణ పరస్పరం అన్ని విధాల సహాయం చేసుకొంటు వృద్ధి అయ్యేలా తప్పనిసరిగా పాటించవలెను.
సేంద్రీయ వ్యవసాయంలో మిశ్రమ పంటలు:సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంటలు , పలు లేదా బహు పంటలు మరియు అంతర పంటలు తప్పని సరిగా సాగు చేయవలెను . వివిధ పంట మొక్కలు భూమిలోని వేర్వేరు లోతుల నుండి వాటికి కావలసిన పోషక పదార్ధాలను గ్రహిస్తాయి. కొన్ని పంటలు కలిపి మిశ్రమ పంటలుగా సాగు చేస్తే పంటలు బాగా పండుతాయి.కొన్ని పంటలు కలిపి వేస్తే పంట నష్టం వస్తుంది . కాబట్టి రెండు లేదా అంతకన్నా ఎక్కువ రకాల పంటలను వాటి అవసరాలను బట్టి సాగు చేయవచ్చును . అంతేగాక మిశ్రమ మరియు పలు పంటలను సాగు చేయడం వలన పురుగుల తాకిడిని తగ్గించవచ్చును. నేలను ఆరోగ్యంగా ఉంచుటలో మరియు సూక్ష్మజీవులు సహజ సిద్ధంగా పనిచేయడంలో పంట మార్పిడి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
సేంద్రీయ పదార్దాల పునరుత్పత్తి :
సేంద్రియ పదార్థమును తిరిగి మోతాదులో ఉంచుటకు గాను పొలం లేక గ్రామం నుండి ఉత్పతైన జీవ పదార్థమున పునరుత్పత్తి చేసి తిరిగి పొలంలో కలపవలెను. కొమ్మలు , పెడ , మూత్రం , విసర్జనాలు వంటింటి వ్యర్ధాలు మరియు పైరు వ్యర్ధాలు మొదలైనవి నేరుగా పోలంలో కప్పడం ద్వారా లేదా కంపోస్టు ద్వారా తిరిగి నేలలో కలపవలెను.
సేంద్రీయ జీవన ఎరువులను ఉపయోగించుట:
మొక్కల చుట్టూ ఉండే వేర్లను ఏవేని పదార్దాలతో కప్పి ఉంచడాన్ని మల్చింగ్ అ౦టారు. ఈ పద్దతికి ఎ౦డిన ఆకులు, ర౦పపు పొట్టు, చెఱకు పిప్పి మరియు చిన్న చిన్న గులక రాళ్ళు మొదలైన వాటిని వాడుతారు.
లాభాలు:
భూమి పైనున్న తేమను ఆవిరికాకుండా నివారించడం వల్ల వివిధ పంటలకు సుమారు 30-70 శాతం వరకు నీరు ఆదా అవుతు౦ది. డ్రిప్ పద్దతితో కలిపి వాడిన ఎడల అదన౦గా 20 శాత౦ నీరు ఆదా అవుతు౦ది. కలుపు నివారణ సూర్యరశ్మిని కలుపు మొక్కలకు లభి౦చకు౦డా చేయడ౦ వల్ల సుమారు 60-90 శాత౦ వరకు పరిరక్షిస్తుంది. మట్టికోత నివారణ మల్చిషీటు వర్షపు నీటి వలన కలిగే మట్టి కోతను నివారిస్తు౦ది. తద్వారా భూసారాన్ని పరిరక్షీస్తు౦ది. నేల ఉష్ణోగ్రత నియంత్రణ – మొక్క చుట్టూ ఉ౦డే నేల ఉష్ణోగ్రతను నియ౦త్రిస్తు౦ది. అధిక దిగుబడి మరియు మ౦చి నాణ్యత మొక్క వేళ్ళ దగ్గర వాతావరణ పరిస్థితులు కలగటం వలన ఏపుగా పెరిగి దిగుబడులు (20-60 శాతం) పె౦చడమే కాక మరి౦త నాణ్యత పొందవచ్చు. భూమిలోని తెగుళ్ళు మరియు క్రిమి కీటకాల నివారణ పారదర్శక షీటు ద్వార సూర్యరశ్మీని ఉపయోగి౦చి భూమిలోని తెగుళ్ళు మరియు క్రిమి కీటకాలను నివారించవచ్చు.
పచ్చి రొట్ట పైర్లు లేదా ఎరువులు:
జీలుగ, జనుము మొదలగు అధిక జీవపదార్ధం గల మొక్కలను పొల౦లో పె౦చి, భూమిలో కలియదున్నడాన్ని పచ్చిరొట్ట ఎరువు వేయడ౦ అ౦టారు.
లాభాలు:
నేల భౌతిక స్వభావం, నేల సార౦ వృద్ది చె౦దుతు౦ది. నేలలో సుక్ష్మజీవుల వృద్దికి, తద్వారా మొక్కలకు అవసరమైన పోషకాల లభ్యతకు ఉపయోగపడి ప౦టల అధిక దిగుబడి దోహద౦చేస్తు౦ది. నీటిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకొనే సామర్ధ్యమును నేలకు ఆపాది౦చుతు౦ది.
ద్రవ రూప సేంద్రీయ ఎరువులు వాడే విధానం:
వృక్ష సంబంధ వ్యర్ధాలైనటువంటి… పచ్చిరొట్ట మొక్కలు-జనుము, జీలుగ, సేస్బీనియా, మరియు వివిధ పప్పు జాతికి చెందిన మొక్కలు.
పచ్చిరొట్ట చెట్ల ఆకులు – వేప ఆకులు, కానుగ ఆకులు, సుబాబుల్ ఆకులు, మరియు పరిసర ప్రాంతాలలో లభ్యమయ్యే ఔషద మొక్కల ఆకులు.
లేత కాండం – లాన్ట్టేనా, జిల్లేడు మరియు పరిసర ప్రాంతాలలో దొరికే లేత మొక్కల కాండములు. ద్రవరూప సేంద్రియ ఎరువును పైరుపై వాడడానికి ము౦దు ఒక భాగ౦ సేంద్రియ ఎరువును 10భాగాలు నీటితో కలిపి వాడుకొనవచ్చును.
ప్రయోజనాలు: ఇది పైర్లుపై శక్తినిచ్చె బలవర్దక౦గా మరియు పైర్ల పెరుగుదలను ప్రోత్సహించే ప్రేరకంగా పని చేస్తు౦ది. వృక్ష సంబంధిత ద్రవ రూప సేంద్రియ ఎరువును తయారు చేయడ౦లో వేప,జిల్లేడు మొదలగు మొక్కల మూల పదార్దములను వాడినట్లయుతే పురుగులు, తెగుళను నివారించే జీవరసాయన మ౦దుగా పనిచేస్తు౦ది. మొక్కలకు అవసరమైన ముఖ్య పోషకాల లభ్యతను పె౦చుతు౦ది.
కలుపు యాజమాన్యం:
తగిన ప౦ట మార్పిడి,అంతర ప౦టలు మరియు మిశ్రమ ప౦టలు వేయుట వలన కలుపు యాజమాన్యం సమర్ధవ౦తముగా చేయవచ్చును. మనుషులతో తీయించు కలుపును పొలంలో కప్పడం ద్వారా నేలను సారాన్ని స౦రక్షించ వచ్చు మరియు కొత్తగా కలుపు పెరుగుటను నివారించును.
సేంద్రీయ వ్యవసాయం-చీడపీడల యాజమాన్యం:
సేంద్రియ పద్ధతిలో పంటల వారిగా పురుగులను, తెగుళ్ళను సాగు పద్ధతుల ద్వారా,మరియు జీవనియంత్రణ పద్ధతుల ద్వారా అరికట్టవలెను.
ఎర పంటలు :
పురుగులు గ్రుడ్లను పెట్టడానికి, తినడానికి ఎక్కువగా ఇష్టపడే పంటను ముఖ్య పంట యొక్క చేను గట్లపైగాని , చేను మద్యలో గాని ఎరపంటలుగా వేయవచ్చు . అలా వేసినట్లయితే పురుగులు వాటిపై గ్రుడ్లు పెడతాయి. తరువాత ఎర పంటలను పెరికి వేసి కల్చివేయడమో లేదా పుడ్చివేయడమో చేయవచ్చు. ఉదాహరణకు క్యాబేజి పంటలో ఆవాలు ఎర పంటగా వేసి, క్యాబేజి తొలుచులద్దె పురుగును, ఆకులల్లు పురుగును మరియు తేనె మంచు పురుగును నివారించవచ్చును.ప్రత్తిలో బంతి మొక్కకు ఎరపంటగా వేసి కాయతొలుచు పురుగును, కురగాయాలలో మొక్కజొన్నను ఎరపంటగా వేసి కాయతొలుచు పురుగులను సమర్ద్ధవంతంగా నియంత్రించవచ్చు.
అంతర పంటలు:
ఒకపంటతో వేరొక పంటను కలిపి అంతరాపంటగా వేయడం వలన వివిధ పంటలలో గల బాహ్యస్వరూప లేదా జల్లే రసాయనాల తేడవలన అతిధేయ పంటను పురుగులు గుర్తించడంలో ఇబ్బంది పడడం వలన పురుగుల సంతతి జీవించడం తగ్గుతుంది . ఉదాహరణకు క్యాబేజీని టమాటో లేదా క్యారెట్ పంటలతో అంతరపంటగా వేసిన డైమండ్ మచ్చల పురుగును , వేరుశనగలో అలసందలను అంతరపంటలుగా వేయడం వలన ఆకుతొలుచు పురుగును, చెరకులో పెసరను అంతరపంటగా వేయుటవలన పీక పురుగును నియంత్రించవచ్చును.