Allola Divya Reddy: తల్లి పాలకు, మాతృ ప్రేమకు సాటైనవేమీ ఈ లోకంలో లేవు. అలాగే తల్లిపాలకు ధీటైనవేమైనా వున్నాయా అంటే అవి ఆవు పాలు మాత్రమేనని తరతరాల అనుభవాలు చెబుతున్నాయి. అందుకేనేమో గంగి గోవు పాలు గరిటెడైనను చాలని వేమన శతక కారుడు రచించిన పద్యం చెప్పకనే చెబుతుంది . ఎవరికైనా బాల్యం తొలి పాఠం ఇదే నూరిపోస్తుంది. అదే ఆమె మనసులో ఆలోచనలను రేపింది. తపనంటూ వుండాలి కానీ తలపెట్టినదేదైనా తడబడకుండా ముందడుగు వేసేయగలనని నిరూపించిన శ్రీమతి అల్లోల దివ్యారెడ్డి గురించి తెలుసుకోవాల్సినదెంతో ఉంది.
ఒక అనుభవం ఒక ఆలోచన ఆమెను తట్టి లేపింది. దివ్యా రెడ్డి తన ఆలోచనలను, అనుభవాలను చెబుతూ ఉంటే పదే పదే వినాలనిపిస్తుంది. ఓ అన్వేషణ ఒక అద్భుత ఆవిష్కరణకు సోపానం అయిందని ఏరువాక సవినయంగా గుర్తించింది. దేశీయ ‘గో ఆధారిత వ్యవసాయంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని భావించారు దివ్యారెడ్డి. తొలుత తన చిన్నారుల కోసం గోవుల్ని పెంచేందుకు శ్రీకారం చుట్టిన ఆమె ఇప్పుడు వేల మంది చిన్నారులకు స్వచ్ఛమైన పాలనందించే స్థాయికి ఎదిగిన ఆమె సంకల్పాన్ని ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు.
మార్కెట్‌లో దొరికే కల్తీ పాలతో పిల్లలను పెంచడానికి ఆమెలోని తల్లి మనసు అంగీకరించలేదు. స్వచ్ఛమైన పాలనందించాలనే సంకల్పంతో ఒక అడుగు వేశారు. ఆమె స్థాపించిన క్లిమామ్ డైరీ ఫార్మ్ ఇప్పుడు దేశీ ఆవులతో కళకళలాడుతుంది. ఇద్దరు చిన్న పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికే ఒక మహిళకు రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. అలాంటి సమయంలో ఈ డైరీ ఫార్మ్ ప్రాజెక్టును తలకెత్తుకున్నారు దివ్య. అది కొంత బరువైన బాధ్యతే అయినా… తన లక్ష్యం ముందు ఆ బాధ్యత చిన్నదిగా అనిపించిందామెకి. సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తూ… సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన ప్రస్థానం కొనసాగిస్తున్నారు అల్లోల దివ్యారెడ్డి.
దేశీయ జాతి ఆవు పాలు, పెరుగు, నెయ్యి సర్వోత్తమమైనవన్న భావన కలిగిన వెంటనే వాటికోసం దాదాపు 5 వేల కిలోమీటర్లు దివ్యారెడ్డి ప్రయాణించింది. చివరకు గుజరాత్ వెళ్లి దేశీ ఆవుల్ని కొనుగోలు చేసి హైదరాబాద్ కి కూతవేటు దూరంలో గోశాల ప్రారంభించారు. అలా స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు క్లిమామ్ వెల్‌నెస్ ఫామ్స్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో కేవలం తమ ఇంటి అవసరాలు, బంధువులకు మాత్రమే సరఫరా చేసిన ఈ పాలు ఇప్పుడు సిటీలో వందల మందికి సరఫరా చేసే స్థాయికి తీసుకెళ్లారు.
నగరం మెచ్చిన క్లిమామ్ :
క్లిమామ్ పాల ఉత్పతికి సంబంధించి ప్రతి విషయంలో కూడా శాస్త్రీయ పద్ధతి పాటిస్తున్నారు. అక్కడ ఎలాంటి కెమికల్స్ వినియోగించరు, పిండిన తాజా పాలను అక్కడినుంచి అటే వినియోగదారులకు పంపడంలో వీరికి వీరే సాటి. మామూలుగా అయితే నేటి పాలు రేపటికి కానీ వినియోగదారుల వద్దకు చేరవు. కాని వీరి డైరీకి ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ ఇస్తే తాజాగా పిండిన పాలను రెండు మూడు గంటల లోపే పాలను గమ్యానికి చేరుస్తుంటారు. అందుకే దివ్యారెడ్డి డైరీ ఫామ్ పాలకు హైదరాబాద్‌లో చాలా డిమాండ్ ఉంది. దివ్యారెడ్డి ఫామ్‌లో పాలు మాత్రమే కాకుండా పాల ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తెచ్చారు. వ్యాపార దృక్పథంతో ఎన్నో అవకాశాలున్నా దివ్యారెడ్డి మాత్రం స్వచ్చమైన పాలనందించాలనే ఆదర్శంగా పెట్టుకున్నారు. అందుకే ఆమెది స్వచ్ఛ సంకల్పం.
దూడ కడుపు నిండిన తర్వాతే పాలు సేకరిస్తాం:
క్లిమామ్ గోశాలలో మొట్ట మొదటగా పుట్టిన దూడకు పుష్కరి అని పేరు పెట్టారు. ఎందుకంటే అది పుష్కరాల సమయంలో పుట్టింది. బయటవారిని గోశాలలో అడుగుపెట్టనీయరు . వాటి ప్రపంచంలో అవి హాయిగా ఉండే వాతావరణాన్ని గోశాలలో కల్పించారు. పాలను చేతితోనే పితుకుతారు తప్పించి మిషన్లు వాడరు. ఎందుకంటే యంత్రాల వినియోగం వల్ల అవి గాయపడతాయి. గోశాలలో దూడకు పాలిచ్చిన తర్వాతే ఆవుల నుంచి పాలను సేకరిస్తారు. ఆవుల బ్రీడింగ్‌ను కూడా సహజంగా జరిగేలా చూస్తారు. క్లిమమ్ గోశాలలో ప్రకృతి సిద్ధంగా బ్రీడింగ్ జరుగుతుంది.
కరోనా వేళా తల్లిలా …
కరోనా నేపథ్యంలో జనజీవనం స్తంభించింది. తద్వారా పేదలు, జీవాలకు తల్లిలా మారారు అల్లోల దివ్యారెడ్డి. నగర ప్రధాన ఆసుపత్రుల వద్ద కరోనా బాధిత కుటుంబాలకు అన్నదానం నిర్వహించి పెద్ద మనసు చాటుకున్నారు. లాక్ డౌన్ వల్ల హోటళ్లు, రెస్టారెంట్‌లు లేకపోవటంతో కరోనా బాధిత సహాయకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి క్లిమామ్ భోజన సౌకర్యాన్ని కల్పించారు. మహమ్మారి సమయంలో పేదలకు అన్నదానం చేయడంతోపాటు నగర శివారులో మూగ జీవాల ఆకలిని తీర్చారు. మూగజీవాల కోసం అన్వేషణ మొదలుపెట్టి వాటికి పండ్లు, ఇతర ఆహార పదార్ధాలను అందించి తల్లి మనసు చాటారు.
బిజినెస్ ఎలా ఉంది?
నేను చేస్తున్న పనిని ఎన్నడూ వ్యాపారంలా చూడలేదు. లాభాల గురించి ఆలోచించ లేదు. గోశాల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నదే. కానీ ఆ పని నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. అందుకే లాభాల కన్నా సామాజిక కోణంలోంచి ఈ పనిని చూస్తున్నాను. గోశాలను సేంద్రియ పద్ధతిలో నిర్వహించడం వల్ల వెంటనే ప్రగతిశీల నిర్వహణ తేలికవుతుందని దివ్యా రెడ్డి అనుభవ పూర్వకంగా చెబుతున్నారు. చాలామంది తల్లులు ఈ పాలు తాగి వారి పిల్లలు ఎంతో ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఉన్నారని చెప్తుంటారు అని దివ్యారెడ్డి అంటున్నారు.
గుజరాత్ సందర్శన సమయంలోనే గో సంరక్షణ , పోషణ వంటి అంశాలపై అధ్యయనం చేయడం వల్ల ఆమె ఈ రంగంలో అనేక పతకాలు పురస్కారాల ప్రశంశలు పొందారు. ఆమె సాధించిన పతకాలు, పురస్కారాలు మరింత మందిని గోశాలల నిర్వహణ, గో సంరక్షణ ,పోషణ వైపు మళ్లించేందుకు దోహద పడ్డాయి. దేశీయ ఆవుల సంరక్షణతో పాటు , డైరీ నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న దివ్యారెడ్డి పేరు దేశవ్యాప్తంగా సుపరిచితులే.
మహిళా వ్యాపారులకు క్లిమామ్ ఆహ్వానం:
పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో మహిళల పాత్ర పెరగాలని అల్లోల దివ్యారెడ్డి చెప్తున్నారు. అంతేకాకుండా ఆర్గానిక్ వ్యాపార రంగంలో మహిళా వ్యాపారులకు దివ్యారెడ్డి క్లిమామ్ ఫామ్ స్టోర్ ద్వారా సదవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ స్టోర్ లో ఇతర ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పెట్టాలని భావించే మహిళా వ్యాపారులకు క్లిమామ్ ది బెస్ట్ ఫ్లాట్ ఫార్మ్. కేబీఆర్ పార్కులాంటి ప్రకృతి వనానికి అనుకుని విశాలమైన ప్రాంగణంలో కొలువుదీరిన క్లిమామ్ ఫామ్ కేఫ్ మహిళా వ్యాపారులకు అనువైన ప్రదేశం. ఈ కేఫ్ లో మీరు ఏ విధమైన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. నగరంలో ప్రముఖులు నివసించే ప్రదేశం కావడంతో బిజినెస్ అద్భుతంగ సాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడటంతో ఈ రంగంలో పెట్టుబడులు పెడితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మంచి లాభాలను ఆర్జించవచ్చు. కాగా.. మహిళలకు సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో ఫౌండర్ దివ్యారెడ్డి ఔత్సాహిక మహిళలకు తన వంతు సాయంగా క్లిమామ్ స్టోర్ ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు. మరింత సమాచారం కోసం 94400 28864 సంప్రదించగలరు.
సూపర్ ఉమెన్ దివ్యారెడ్డిని వరించిన అవార్డులు:
* ఎకో-కాన్షియస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2016: సౌత్‌స్కోప్ మరియు రిట్జ్ మ్యాగజైన్‌లు దివ్యారెడ్డికి 2016 సంవత్సరపు ఎకో-కాన్షియస్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును అందించాయి.
* బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2017: స్వచ్ఛమైన జాతి భారతీయ ఆవులను పెంచడంలో మరియు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన A2 పాలను ప్రజలకు అందుబాటులో ఉంచడంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా సాక్షి టీవీ అల్లోల దివ్య రెడ్డికి ప్రతిష్టాత్మకమైన బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2017 అవార్డును అందించింది.
* జాతీయ గోపాల్ రత్న అవార్డు: దేశవాళీ గిర్ ఆవుల పెంపకంలో మరియు వాటి పాల ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు అత్యుత్తమ నిర్వహణ పద్ధతులను అనుసరించినందుకు గాను, ఉత్తమ గోశాలను రూపొందించినందుకు భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ గోపాల్ రత్న అవార్డు 2018 లో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రాధామోహన్‌సింగ్ చేతుల మీదుగా అల్లోల దివ్యారెడ్డికి అందజేశారు. విశేషం ఏంటంటే ఈ అవార్డు అందుకున్న ఏకైక మహిళా దివ్యారెడ్డి కావడం.
*రైతు నేస్తం 2019 అవార్డు: గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు శ్రీమతి అల్లోల దివ్య రెడ్డికి ప్రతిష్టాత్మక రైతు నేస్తం 2019 అవార్డుతో సత్కరించారు.
* COWE – ఇన్స్పిరేషన్ ఆఫ్ ది ఇయర్ 2019: శ్రీమతి అల్లోల దివ్య రెడ్డి సమాజానికి ఆమె చేసిన ఆదర్శప్రాయమైన సేవకు గాను COWE – ఇన్‌స్పిరేషన్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డును అందుకున్నారు.
* కాఫీ టేబుల్ బుక్: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా 2019లో అత్యుత్తమ మహిళా సాధకుల గురించి ఒక కాఫీ టేబుల్ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇందులో శ్రీమతి అల్లోల దివ్య రెడ్డి ప్రయాణం కూడా ప్రచురించబడింది.
* కళావాహిని మహిళా పారిశ్రామికవేత్త అవార్డు 2020: కళావాహిని అవార్డ్స్ 30వ వార్షికోత్సవ కార్యక్రమంలో మహిళా పారిశ్రామికవేత్తల రంగంలో కళావాహిని ఏకశిల స్మారక స్పూర్తి శ్రీ పురస్కారంతో శ్రీమతి అల్లోల దివ్యారెడ్డిని సత్కరించారు.
* పవర్ ఉమెన్ అవార్డు – మహిళా దినోత్సవం 2021: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021 సందర్భంగా కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ గౌరవనీయ స్పీకర్ బసవరాజ్ హొరట్టి శ్రీమతి అల్లోల దివ్య రెడ్డిని సత్కరించారు.
* బెస్ట్ డైరీ ఫార్మర్ అవార్డు 2021: శ్రీమతి అల్లోల దివ్య రెడ్డిని డా. సి.కృష్ణారావు ట్రస్ట్ ఉత్తమ పాడి రైతు అవార్డుతో సత్కరించింది, దేశీ ఆవులను సంరక్షించే విజయవంతమైన గోశాల నిర్మాణానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా రాష్ట్ర మరియు కేంద్ర పశుసంవర్ధక శాఖ ధృవీకరించింది.
* ‘పవర్ ఉమెన్’ అవార్డు – అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూర్‌లోని టౌన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటక స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి, పరిశ్రమల శాఖ మంత్రి జగదీశ్ షెట్టర్ దివ్యారెడ్డికి ఈ అవార్డును అందజేశారు
* బెస్ట్ డైరీ ఫార్మర్ అవార్డు 2021: శ్రీమతి అల్లోల దివ్య రెడ్డిని డా. సి.కృష్ణారావు ట్రస్ట్ ఉత్తమ పాడి రైతు అవార్డుతో సత్కరించింది, దేశీ ఆవులను సంరక్షించే విజయవంతమైన గోశాల నిర్మాణానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా రాష్ట్ర మరియు కేంద్ర పశుసంవర్ధక శాఖ ధృవీకరించింది.
* గత సంవత్సరం క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యా రెడ్డి ప్రతిష్టాత్మక పవర్ ఉమెన్ అవార్డుకు ఎంపికయ్యారు. బెంగళూర్‌లోని టౌన్ హాల్‌లో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అల్లోల దివ్యారెడ్డి ఈ అవార్డును కర్ణాటక స్పీకర్ విశ్వేశ్వర్‌హెగ్డే కగేరి, పరిశ్రమల శాఖ మంత్రి జగదీష్‌షెట్కార్ చేతుల మీదుగా అందుకున్నారు.
క్లిమామ్ పేరుతో అల్లోల దివ్యారెడ్డి అందిస్తున్న సేవలను కొనియాడుతూ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ” ఏరువాక ” మాసపత్రిక శుభాభినందనలు తెలియ చేస్తోంది.