Organic Farming: సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కమల్ పటేల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో సాగులో పెరుగుతున్న పురుగుమందులు మరియు రసాయన ఎరువుల వాడకాన్ని అరికట్టడానికి ప్రభుత్వం త్వరలో పిపిజి అంటే పబ్లిక్ ప్రైవేట్ గోశాల మోడల్‌ను అమలు చేయబోతోందని ఆయన చెప్పారు. దీని కింద ప్రభుత్వ, ప్రయివేటు రంగాల సహకారంతో నర్సరీలు, పొలాలు నేరుగా గోశాలలకు అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల రైతులు, పశువుల పెంపకందారులు, గోశాలలందరికీ మేలు జరుగుతుంది. రైతులను గోశాలలకు అనుసంధానం చేసి సేంద్రియ ఎరువును అందుబాటులో ఉంచుతామన్నారు. దీంతో రసాయన రహిత వ్యవసాయం మార్గం సులభతరం అవడంతో పాటు గోశాల ఆదాయం కూడా పెరిగి స్వశక్తి వైపు పయనించనున్నారు.
మంత్రి పటేల్ మాట్లాడుతూ.. పశుసంవర్థక శాఖతో పాటు మన వ్యవసాయ శాఖ శాస్త్రీయ పరిశోధనలు చేసి రాష్ట్రంలోని గోశాలలను స్వావలంబనగా తీర్చిదిద్దుతామన్నారు. పబ్లిక్ ప్రైవేట్ గోశాల (PPG) మోడల్‌లో ప్రభుత్వం కూడా పాలుపంచుకుంటుంది. తద్వారా గోశాలలు సక్రమంగా నడుస్తాయి. ఆవు పేడ, మూత్రం సక్రమంగా వాడాలి. దీంతో పాటు రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన ఎరువులు అందాలని అయన తెలిపారు. ప్రభుత్వం రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన సేంద్రియ ఎరువులు అందేలా చూడాలన్నారు. తద్వారా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వీడాలని సూచించారు. దానివల్ల పర్యావరణం పరిరక్షించబడడంతోపాటు ఖర్చు కూడా తగ్గి ఉత్పత్తి కూడా బాగుంటుందని తద్వారా పంట ఉత్పత్తి ఎగుమతులు కూడా పెరుగుతాయన్నారు మంత్రి.
కాగా సేంద్రియ వ్యవసాయంలో మధ్యప్రదేశ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ 17.31 లక్షల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది. ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్థక శాఖలు సేంద్రియ వ్యవసాయంపై మరింత ఫోకస్ పెట్టనున్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. సేంద్రియ ఎరువు కోసం రైతులకు నేరుగా గోశాలలను అనుసంధానం చేస్తారు.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల సమాచారం ప్రకారం… మధ్యప్రదేశ్‌లో 7,73,902 మంది రైతులు రసాయన రహిత వ్యవసాయంలో పాల్గొంటున్నారు. APEDA ప్రకారం 2020-21 సంవత్సరంలో రూ. 7078.5 కోట్ల విలువైన మొత్తం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయబడ్డాయి. ఇందులో మధ్యప్రదేశ్ రూ.2683.58 కోట్లతో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి 500636.68 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే కేంద్రంలో సంఖ్య పెరగడమే కాకుండా రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
మధ్యప్రదేశ్‌లో గోశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందువల్ల సేంద్రియ ఎరువు ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. 2020-21 మధ్యప్రదేశ్‌లో 103456 మెట్రిక్ టన్నుల సేంద్రీయ ఎరువు ఉత్పత్తి చేయబడింది. ముఖ్యమంత్రి గౌ-సేవా యోజన మరియు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 1768 గోశాలలు ఉన్నాయి. వాటిలో 2.5 లక్షలకు పైగా ఆవులు ఉన్నాయి. ప్రభుత్వ గోశాలలో 1141, 76941, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న 627 గోశాలలో 1.74 లక్షల గోవులను సంరక్షిస్తున్నారు.