Vegetable Price Control Measures: జనాభా వేగంగా పెరుగుతోంది. జనాభా ఆహార అవసరాలు తీర్చేందుకు పెద్ద ఎత్తున ఆహార పంటల సాగు చేస్తున్నారు. అయినా ఒక్కోసారి వరదలు, కరువు, చీడపీడల వల్ల పంట నష్టం తప్పడం లేదు. అలాంటి సమయంలో కూరగాయలు, ధాన్యం ధరలు పెరిగిపోయి జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం టమోటా ధరలు చుక్కలనంటుతున్నా యి. వేసవిలో సాగు చేసిన పంట దెబ్బతినిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు మిశ్రమ సాగు విధానాలను అవలంభించాలి వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోని డాబాలపైన సేంద్రియ సాగు ద్వారా ఇంటి అవసరాలకు సరిపడే కూరగాయలు పండించుకోవచ్చు. అంతే కాదు ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే లక్షల్లో ఆర్జించవచ్చు.
టెర్రస్ సాగు
టెర్రస్ గార్డెన్ గురించి చాలా మందికి తెలుసు. కానీ భవనాలపైన చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా ఇంటిల్లిపాదికీ కావాల్సిన
కూరగాయలు పండ్లు పండించుకోవచ్చు. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలతో పనిలేకుండా సేంద్రియ పద్దతిలో ఆరోగ్యకరమైన
ఉత్పత్తులను తీయవచ్చు. కేవలం వ్యవసాయ పొలాల్లోనే కాదు, ఖాళీ జాగాల్లో, ఇంటి పైకప్పు పైన కూరగాయలు, పండ్లు, ఆకుకూరల సాగు ద్వారా ధరలను కూడా నియంత్రించవచ్చని వ్యవసాయ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇంటి పైకప్పుపై కనీసం వంద చదరపు అడుగుల స్థలంలో కూడా ఏటా 300 కిలోల కూరగాయల దిగుబడి తీయవచ్చని పరిశోధనల ద్వారా తేలింది.
Also Read: Nano Tractor: వ్యవసాయ పనులను సులభతరం చేస్తున్న నానో ట్రాక్టర్.!
వ్యవసాయ భూములపై ఒత్తిడి తగ్గించాలి
పెరిగిపోతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చేందుకు సాగు భూములపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో భూములు సారాన్ని కోల్పోతున్నాయి. మరోవైపు పట్టణాలు వేగంగా విస్తరించడంతో సాగు భూమి తగ్గిపోతుంది. వీటికి తోడు ఎల్ నినో, లానినో ప్రభావంతో వరదలు, కరవు పరిస్థితులు వెంటాడుతున్నాయి. వీటిని అధిగమించి ఆహార అవసరాలు తీర్చుకోవాలంటే పెరటి సేద్యం, మిద్దె సేద్యం తప్పనిసరి, పట్టణాల్లో, గ్రామాల్లో ఏ కొద్ది ఖాళీ స్థలం ఉన్నా అందులో సేంద్రీయ పద్దతిలో కూరగాయలు సాగు చేసుకోవాలి. ఖాళీ స్థలాలు అందుబాటులో లేకుంటే ఇంటి పైకప్పులపై కూరగాయల సాగు చేపట్టవచ్చు. విశ్రాంత ఉద్యోగులు, గృహిణులే కాదు, వారాంతంలో ఉద్యోగులు గార్డెన్ లో పని చేయడం ద్వారా ఆరోగ్యంతోపాటు, ఇంటికి కావాల్సిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించుకోవచ్చు. ఎక్కువ ఖాళీ స్థలం, ఇంటి పై కప్పు అందుబాటులో ఉంటే నెలకు కనీసం రూ.10 వేల నుంచి లక్షల్లో ఆర్జించవచ్చు.
ఏం చేయాలి
ఇంటి పైకప్పుపై నేరుగా మట్టి పోసి సాగు చేయడం సాధ్యం కాదు. అందుకే కుండీలు ఏర్పాటు చేసుకోవాలి. లేదా పాలిథీన్ షీట్ కవర్ వేసుకుని చిన్న చిన్న గదులు తయారు చేసుకోవాలి. వర్షపు నీరు, మొక్కలకు పోసిన నీడి తడి ఇంటి పైకప్పుకు చేరకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇంకా కొంచెం పెట్టుబడి పెట్టగలిగితే షేడ్ నెట్, పాలీహౌస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటే ఏడాదంతా కూరగాయలు, పండ్లు, ఆకుకూరల దిగుబడి తీయవచ్చు. మీ ఇంటి అవసరాలకే కాదు. మీ కాలనీలోని అందరి అవసరాలు తీర్చవచ్చు. డబ్బు కూడా సంపాదించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో టెర్రస్ గార్డెన్ చేసే వారికి రాయితీపై పరికరాలు కూడా అందజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం టెర్రస్ పై కూరగాయల సాగు మొదలెట్టేద్దామా…
Also Read: Agri Youth Summit – 2023: పీజేటీఎస్ఏయూ లో ఘనంగా ప్రారంభమైన అగ్రి యూత్ సమ్మిట్ – 2023