రైతులువార్తలుసేంద్రియ వ్యవసాయం

How to protect the agricultural lands that are losing life?: జీవం కోల్పోతున్న సాగు భూములను పరిరక్షించేదెలా ?

0
Microorganisms improve soil health

How to protect the agricultural lands that are losing life?:
సూక్ష్మ జీవులు నేల ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి !
వంటల్లో అధిక దిగుబడులు పొందటానికి నేల ఆరోగ్యం అతి ముఖ్యమైన అంశం. పంట మొక్కల వేర్లు బాగా పెరగడానికి గుల్లబారి మృదువుగా ఉండి, తగినంత పోషకాలను కలిగి, వాటిని అందుబాటులోనికి తెచ్చే సూక్ష్మజీవులు పుష్కలంగా ఉన్న భూమిని ఆరోగ్యమైన భూమిగా చెప్పవచ్చు. సాగు భూములు అనేకరకాలైన జీవరాశికి ఆవాసం కల్పిస్తాయి. వీటిలో మన కంటికి కన్పించని బ్యాక్టీరియా, ఫంగై , ఆల్గే, సులిపురుగులతో పాటు వానపాములు వంటి అనేక జీవులు ఉంటాయి. ఈ జీవరాశి సాగు భూముల్లో వచ్చే సేంద్రియ వ్యర్థాలను కుళ్ళించి ఎరువుగా మారుస్తాయి. సేంద్రియ వ్యర్థాలను కుళ్ళించేటప్పుడు విడుదలయ్యే సేంద్రియ అమ్లాలు, భూమి లోపలి పొరల్లో మొక్కలకు అందుబాటు కాని ముడి రూపంలో ఉన్న పోషకాలను అందేటట్లు చేస్తాయి. సూక్ష్మ జీవుల చర్య వల్ల ఎరువుగా మారిస సేంద్రియ వ్యర్థాలు భూమి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. నేలలు మృదువుగా, గుల్ల బారేటట్లు చేస్తుంది. అంతేకాకుండా భూమిలో సూక్ష్మ జీవుల చర్యల వల్ల మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలతో పాటు హర్మోనులు, ఎంజైములు అనేకం సమకూరుతాయి. భూమిలో సూక్ష్మ జీవుల చర్యల వల్ల నేల నిర్మాణం, నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి ,నేలలో గాలి ప్రసరణ మెరుగుపడి పంట మొక్కల వేర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. రైతుకు ఈ రకంగా మేలు చేసే సూక్ష్మ జీవులు విరివిగా వృద్ధి చెందాలంటే భూములకు రైతులు అధికంగా సేంద్రియ ఎరువులు వాడాలి. ఈ ఎరుపులలోని సేంద్రియ పదార్ధం సూక్ష్మజీవులకు ఆహారంగా పనికొస్తుంది.

పంట మొక్కల నుంచి భూమిలోని సూక్ష్మజీవులకు ఆహారం:
పంట మొక్కల్లో ఆకులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారైన పిండి పదార్థాలను మొక్కల్లోని వివిధ భాగాలు పెరగడానికి వినియోగించుకుంటాయి. అలాగే కొంతభాగం వేర్ల ద్వారా భూమిలోనికి స్రావాలుగా విడుదలవుతాయి. ఈ స్రావాలను ఆహారంగా తీసుకొని మొక్కల వేర్ల చుట్టూ అనేక రకాలైన సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. వేర్ల చుట్టూ అనేక రకాలైన సూక్ష్మ జీవులు కలిగిన సన్నని మట్టి పొరను “వేర్ల జీవావరణం” లేదా రైజోస్పియర్ అంటారు. మరో వైపు భూమిలో ఉండే మరికొన్ని సూక్ష్మ జీవులు మొక్కలకు, వేర్లకు తెగుళ్ళను కలుగచేసి నష్టం కూడా చేస్తాయి. భూములకు విరివిగా సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా, పంటలకు కీడు చేసే సూక్ష్మజీవుల ప్రభావాన్ని తగ్గించవచ్చు.

Microorganisms improve soil health

భూముల్లోని జీవాన్ని హరిస్తున్న రసాయనాలు:
నేటి ఆధునిక వ్యవసాయంలో రైతులు వంటల్లో అధిక దిగుబడులు సాధించాలనే తపనతో భూములకు అధిక మొత్తంలో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారు. ఈ క్రమంలో సంప్రదాయంగా రైతులు పొలాలకు వేసే సేంద్రియ ఎరువుల వినియోగాన్ని తగ్గించేశారు. ఫలితంగా నేలల ఆరోగ్యానికి మేలు చేసే సేంద్రియ పదార్థం బాగా తగ్గిపోతుంది. రసాయనాలతో భూములు కాలుష్యానికి గురవుతున్నాయి. భూములు తమ సహజత్వాన్ని కోల్పోయి, ఉప్పు, చౌడు బారి సమస్యాత్మకంగా మారుతున్నాయి. దీంతో నేల ఆరోగ్యం దెబ్బతిని పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది. వేగంగా మారుతున్న నేటి ఆధునిక సమాజంలో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు అధికమయ్యాయి. గ్రామాలలో సాగు చేసే వారి సంఖ్య తగ్గింది. పశుపోషణపై ఆదరణ తగ్గించడంతో సేంద్రియ ఎరువుల అందుబాటు తగ్గిపోతుంది. సాగుకు కూలీల కొరతతో యంత్రాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు విరివిగా వినియోగిస్తున్నారు. వీటన్నింటి ఫలితంగా భూములకు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గి భూమిలోని సూక్ష్మ జీవులకు ఆహారంగా పనికొచ్చే సేంద్రియ పదార్థం తగ్గింది. దీనికితోడు పొలాలకు, విరివిగా కలుపు మందులు, గుళికల పురుగు మందులు వాడకంవల్ల భూమిలోని సూక్ష్మ జీవులు సమూలంగా నశించి పోతున్నాయి.

కుంటుబడుతున్న నేల ఆరోగ్యం:
భూముల్లో జీవరాశి నశిస్తుండడంతో నేల ఆరోగ్యం కుంటుబడి, పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాగు భూముల్లో సూక్ష్మజీవులు అంతరించిపోతుండడం వల్ల భూసారం తగ్గి, నేల ఉత్పాదక శక్తి క్రమంగా తగ్గుతోంది. భూమి లోపల ముడి రూపంలో పోషకాలు ఎంత ఉన్నా సూక్ష్మజీవులు లేకుంటే మొక్కలకు వాటి అందుబాటు ఆశించినంతగా ఉండదు. జీవరహిత నేలల్లో సాగు కష్టమైపోతుంది. ఈ పరిస్థితులు ఇలానే సాగితే మన ముందు ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం ఉండి, ప్రజలకు ఆహార కొరత ఏర్పడే పరిస్థితులు దాపురించవచ్చు. ఈ పరిస్థితులు, రాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం నేడు ఎంతో ఉంది.

నష్ట నివారణ చర్యలకు జీవన ఎరుపులు:
భూములకు మేలు చేసే సూక్ష్మ జీవులను అందించటానికి పంట మొక్కలకు మేలు చేసే సూక్ష్మ జీవులను శాస్త్రవేత్తలు గుర్తించి వాటిని ప్రయోగశాలలో వృద్ధి చేసి, రైతులకు జీవన ఎరువులుగా అందుబాటులోనికి తెస్తున్నారు. వీటిలో నత్రజనిని అందించే రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబ్యాక్టర్; భాస్వరాన్ని అందించే పాస్పోబ్యాక్టీరియా, పాస్సోఫంగై, వామ్ లతో పాటు పొటాషియం, జింకును అందుబాటులోనికి తెచ్చే జీవన ఎరువులు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా మొక్కలకు పెరుగుదలకు ఉపయోగపడే రైజోబ్యాక్టీరియా జీవన ఎరువును కూడా శాస్త్రవేత్తలు రైతులకు నేడు అందుబాటులోనికి తెచ్చారు. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ పరిశోధనా స్థానాలకు అనుబందంగా పనిచేస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాలలోను, కొన్ని ప్రైవేటు సంస్థల ద్వారా రైతులకు అందుబాటులో ఉన్నాయి.

రైతు స్థాయిలో నేలలో సూక్ష్మ జీవుల పెంపునకు చర్యలు:

  •  భూముల్లో పెరిగే సూక్ష్మ జీవులకు సేంద్రీయ పదార్ధం ఆహారంగా పనికొస్తుంది. కాబట్టి రైతులు తమకు అందుబాటులో ఉన్న సేంద్రియ వనరులను ఎరువుగా మార్చి (పశువుల ఎరువు, పొలాలకు కంపోస్టు) వినియోగించుకోవాలి.
  • పంట మార్పిడి, మిశ్రమ పంటల సాగు, అంతర పంటలసాగును ఆచరించి భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంచాలి.
  •  ప్రకృతి సాగులో వినియోగించే జీవామృతం భూముల్లో సూక్ష్మ జీవుల వృద్ధికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
  •  అందుబాటును బట్టి రైతులు తమ పొలాలకు చెరువు మట్టి తోలి భూమిలో కలియదున్నాలి.
  •  పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి భూమిలో కలియదున్నడం ద్వారా భూములకు విరివిగా సేంద్రియ పదార్థం అందుతుంది.
  •  భూమిని కప్పి ఉండే పైర్లు సాగు చేయడం వల్ల సూక్ష్మ జీవులు బాగా వృద్ధి చెందుతాయి.
  •  పంట పొలాలకు వేప, కానుగ, అముదపు పిండి వాడకం వల్ల పంటకు కీడు చేసే సూక్ష్మ జీవులను అరికట్టవచ్చు.
  •  పంట పొలాలకు రసాయనాలు మరీ ముఖ్యంగా కలుపు మందులు, గుళికల పురుగు మందుల వాడకాన్ని కఠినంగా నియంత్రించాలి.
  •  భూములకు సేంద్రియ ఎరువులు తగినంత వేయలేనప్పుడు అందుబాటులో ఉన్న పరిమిత సేంద్రియ ఎరువులను కృషి విజ్ఞాన కేంద్రాలలో, మార్కెట్లో అందుబాటులో ఉన్న జీవన ఎరువులను రైతులు విరివిగా వినియోగించాలి.
  •  పంట మొక్కల ఎదుగుదలకు అనుకూలమైన సేద్య పద్ధతులు సమ్మిళిత ఎరువులు, చీడలు, కలుపు యాజమాన్య పద్ధతులు పాటించి జీవం కోల్పోతున్న మన సాగు భూములను సంరక్షించుకోవాలి.
    చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు అనే నానుడి ఇక్కడ బాగా సరిపోతుంది. సాగు భూములను నిర్జీవం చేసి ఆపై అధిక వంట దిగుబడులను ఆశించడం అత్యాసే అవుతుంది. కాబట్టి స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగపరచుకొని భూమిలో జీవరాశిని పెంచి, అధిక దిగుబడులనిచ్చే విధంగా భూములను మార్చుకోవాలి.

మెరుగు భాస్కరయ్య, ఎడిఏ జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం, తిరుపతి,
ఫోన్: 8331057872

Leave Your Comments

COTTON: పత్తి పంటలో ఆకులు ఎర్రబారుతున్నాయా ? పత్తిలో మెగ్నీషియం లోపాన్ని ఎలా గుర్తించి, సవరించుకోవాలి ?

Previous article

Lurking tobacco borer threat to crops in flooded areas: ముంపు ప్రాంతాల్లోని పంటలకు పొంచి ఉన్న పొగాకులద్దెపురుగు ముప్పు

Next article

You may also like