ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరైతులువార్తలు

Farmer Success Story: గోదావరి కౌలు రైతు విజయ గాథ

0
Farmer Success Story
రైతు బండి త్రిమూర్తులు, టి.శ్రీనివాస్, వై. సునీత, కె. ఫణి కుమార్, పి.వి.రమణారావు, ఎం.వి.కృష్ణాజీ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, మారుటేరు

Farmer Success Story: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగుచేసే పంటల్లో వరి ప్రధానమైనది. ఆంధ్రప్రదేశ్ లో ఈ పంట సార్వా లో 15.52 లక్షల హెక్టార్లలో, దాళ్వాలో 7.91 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు.పెరుగుతున్నసాగు ఖర్చులు, తగ్గిపోతున్న వనరులు, కూలీల కొరత రైతుని వరి సాగు నుంచి ఇతర ఆదాయ మార్గాల వైపు దృష్టి మరలిస్తున్న ప్రస్తుత తరుణంలో, సొంత భూమి లేని ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం, బొమ్మిడి గ్రామ కౌలు రైతు బండి త్రిమూర్తులు విజయ గాథ వరి సాగు చేసే రైతాంగం, వ్యవసాయానికి విముఖంగా ఉన్న గ్రామీణ యువతకి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ రైతు గత 25 సంవత్సరాల నుంచి 27 ఎకరాల్లో కౌలుకి సార్వా, దాళ్వాలో వరి సాగు చేస్తున్నాడు. సాలీనా కౌలు 32 బస్తాల ధాన్యం విలువని నగదుగా చెల్లిస్తున్నాడు. వివిధ వరి రకాలను సాగుచేస్తూ ముందుకు వెళుతున్న ఈ రైతు అధికాదాయం సాధిస్తూ, ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు.

Farmer Success Story

రైతు బండి త్రిమూర్తులు, టి.శ్రీనివాస్, వై. సునీత, కె. ఫణి కుమార్, పి.వి.రమణారావు, ఎం.వి.కృష్ణాజీ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, మారుటేరు

సార్వాలో: రైతు త్రిమూర్తులు గత సార్వా లో 140-145 రోజుల కాలపరిమితి కలిగిన స్వర్ణ రకాన్ని 27 ఎకరాలలో సాగుచేసినప్పుడు సగటున ఎకరాకు 40 బస్తాలు (బస్తా 75 కిలోలు) దిగుబడిని సాధించాడు. ఒక బస్తా రూ. 1637/-(కనీస మద్దతు ధరగా రూ. 2183/- క్వింటాలు చొప్పున) గత నవంబర్ లో అమ్ముకున్నాడు. స్వర్ణ రకం సాగుద్వారా ఆయన సాధించిన ఆదాయ వ్యయాలు ఎకరాకు ఇలా ఉన్నాయి.
మొత్తం ఆదాయం : రూ. 65,480/- ఎకరానికి
సాగు ఖర్చు : రూ.30,000/- ఎకరానికి
నికర ఆదాయం : రూ.35,480/- ఎకరానికి
27 ఎకరాలకు మొత్తం ఆదాయం = రూ.9,57,960/-
కౌలు చెల్లింపు =16 బస్తాలు x రూ. 1637 x 27 ఎకరాలు = రూ. 7,07,184/-
కౌలు రైతు నికర ఆదాయం : రూ.2,50,776 (6 నెలలకు లేదా రూ. 41,796/- నెలకు) సార్వా లో పొందారు.
స్వర్ణ రకం సాగు వల్ల రైతుకు కలిగిన ప్రయోజనాలు :
ఈ రకం తక్కువ నత్రజనితో స్థిరమైన దిగుబడినిచ్చింది. మిల్లర్ ఆదరణ పొంది అధిక నిండు బియ్యం శాతం కలిగిన రకమిది. ఎండాకు తెగులు, దోమపోటుని కొంత మేర తట్టుకుంది. రెండు వారాల నిద్రావస్థతో తక్కువ గింజ రాలిక గలిగిన రకం. అన్నానికి అనుకూలమైన రకం .
సాధక బాధకాలు: తుఫాన్లు, ఈదురు గాలులు ఉన్నప్పుడు పడిపోవడానికి ఆస్కారం ఉంది. అగ్గితెగులును తట్టుకోవడం లేదు.

దాళ్వాలో పి.ఆర్ 126 రకం 7 ఎకరాల్లో, శ్రీధృతి రకం 3 ఎకరాల్లో, విత్తనోత్పత్తిగా స్వర్ణ రకాన్ని17 ఎకరాల్లో సాగుచేశారు.

పి.ఆర్ 126 రకం:

దాళ్వా లో పంజాబ్ రాష్ట్రం నుంచి 2017 లో విడుదల చేసిన స్వల్పకాలిక రకం పి.ఆర్ 126 (120 రోజుల పంట కాలం) ను 7 ఎకరాల్లో సాగు చేయగా ఎకరాకు 65 బస్తాలు (బస్తాకి 75 కిలోలు) చేను మీద దిగుబడి వచ్చింది. ఈ పంటను బస్తా రూ. 1328/- చొప్పున ఏప్రిల్ 2024 లో అమ్మారు. ఈ రకం సాగువల్ల ఒక ఎకరాకు ఆయన సాధించిన ఆదాయ వ్యయాలు :
మొత్తం ఆదాయం : రూ. 86,360/- ఎకరానికి
సాగు ఖర్చు : రూ.30,000/- ఎకరానికి
నికర ఆదాయం : రూ. 56,360/- ఎకరానికి
మొత్తం ఆదాయం = రూ. 3,94,520 /-( 7 ఎకరాలకు 120 రోజులలో సాధించడం జరిగింది.)

పి.ఆర్ 126 రకం సాగుతో రైతుకు కలిగిన ప్రయోజనాలు:

* పంట కోసిన వెంటనే, చేనుదగ్గరే అమ్మకానికి అవకాశం ఉండటం వల్ల రైతుకి వెంటనే ఆదాయం చేతికి వస్తుంది.
* తక్కువ కాలపరిమితి అంటే 120 రోజుల్లోనే పంటకొచ్చింది.
* బెట్ట పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో పండే రకం.
* బియ్యం పొడవు >6.0 మి.మీ కలిగి ఆఫ్రికా దేశాలకు కాకినాడ పోర్ట్ ద్వారా ఎగుమతికి అనువైన రకం.

సాధక బాధకాలు:

* పూర్తి జన్యు స్వచ్చత కలిగిన విత్తనం అందుబాటులో లేకపోవడం.
* ఈ రకం ఒక్క పంజాబ్ రాష్ట్రంలో సాగుకొరకు మాత్రమే విడుదల చేశారు. మన రాష్ట్రం లో సాగుకి నోటిఫై చేయకపోవడం.
* ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినప్పుడు, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడానికి వ్యవసాయ శాఖ సుముఖత చూపించక పోవడం.
* మిల్లర్స్ ఈ రకం కొనుగోలుకు సుముఖంగా లేకపోవడం.

శ్రీధృతి (యం టి యు 1121):

దాళ్వా లో శ్రీధృతి (యం.టి.యు 1121) రకాన్ని 3 ఎకరాలలో సాగుచేసినప్పుడు 55 బస్తాలు (75 కిలోలు /బస్తా) దిగుబడి వచ్చింది.ఆరుదల ధాన్యాన్ని బస్తా రూ.1637/-చొప్పున ఏప్రిల్ 2024 లో అమ్మడం జరిగింది.
మొత్తం ఆదాయం : రూ. 90,035/- ఎకరానికి
సాగు ఖర్చు : రూ.30,000/- ఎకరానికి
నికర ఆదాయం : రూ.60,035/- ఎకరానికి
మొత్తం ఆదాయం = రూ. 1,80,105 /-( 3 ఎకరాలకు 130 రోజులలో సాధించడం జరిగింది.)

యం టి యు 1121 రకం ప్రయోజనాలు:

* అధిక దిగుబడిని ఇచ్చే రకం.
* అధిక నిండు బియ్యం శాతం కలిగిన రకం.
* పచ్చి బియ్యానికి అనుకూలం.
* మిల్లర్స్ ఆదరణ పొందిన రకం.
* చేను మీద గింజ ఆరడం వల్ల ఎక్కువ ఎండ బెట్టాల్సిన అవసరం లేదు.

సాధక బాధకాలు:

* ఎండాకు తెగులు, దుబ్బుకుళ్ళు తెగులును తట్టుకోలేదు.
* దాళ్వా లో 130 రోజుల కాలపరిమితి గలిగి ఉండటం.
* ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడానికి మాత్రమే అనుకూలమైన రకం.

స్వర్ణ (యం టి యు 7029):

దాళ్వా లో స్వర్ణ (యం.టి.యు 7029) రకాన్ని విత్తనంగా 17 ఎకరాల్లో పండించినప్పుడు ఎకరాకు 55 బస్తాలు (75 కిలోలు/ బస్తా) ఆరుదల ధాన్యం దిగుబడి సాధించి బస్తా రూ.1900/-చొప్పున ఏప్రిల్ 2024లో అమ్మారు. విత్తనోత్పత్తి ద్వారా రైతు సాధించిన ఆదాయ వ్యయాల వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం ఆదాయం : రూ. 1,04,500/- ఎకరానికి
సాగు ఖర్చు : రూ.35,000/- ఎకరానికి
నికర ఆదాయం : రూ. 69,500/- ఎకరానికి
మొత్తం ఆదాయం = రూ. 11,81,500 /- (17 ఎకరాలకు 135 రోజుల్లో ఈ ఆదాయం పొందారు.)
కౌలు రైతు మొత్తం 27 ఎకరాలలో దాళ్వా లో సాగుచేసినప్పుడు (పి.ఆర్.126 + యం టి యు 1121+ స్వర్ణ విత్తనంగా)= రూ.17,56,125/- (180 రోజులలో సాధించారు.)
కౌలు ధర 27 ఎకరాలకు =16 బస్తాలు x రూ.1270/- చొప్పున రూ.20,320/- ఎకరానికి లేదా రూ. 5,48,640/- 27 ఎకరాలకు భూస్వామికి చెల్లించారు.

కౌలు రైతుకు నికర ఆదాయం దాళ్వా లో 27 ఎకరాలకు = రూ.12,07,485/- ( 6 నెలల్లో) లేదా రూ. 2,01,247/- (నెలకు) వచ్చింది.
సాలీనా ఒక నెలకు 2023-24 సంవత్సరంలో 27 ఎకరాలకు = రూ.1,21,521/- ఆదాయం పొందారు. ఈ ఆదాయం చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది కన్నా అధికంగా ఉండటం గమనార్హం.
భూస్వామికి ప్రయోజనాలు: ఒక్క భూమి మీదే రూ. 12,55,824/- (సార్వా లో రూ.7,07,184+ దాళ్వా లో రూ. 5,48,640/-) 27 ఎకరాలకు లేదా రూ. 46, 512/- ఒక ఎకరానికి ఒక సంవత్సరంలో పొందారు.
కావున గ్రామీణ యువత వ్యవసాయం, వరి సాగులో ఉన్న లాభాలు గమనించి వ్యవసాయం వైపు పైన ఉదాహరించిన కౌలు రైతును ఆదర్శంగా తీసుకుని సుస్థిర సమాజం, ఆరోగ్యకరమైన జీవన సరళి కోసం వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

వరి రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు :

సార్వాలో: 140 రోజుల కాలపరిమితి కలిగి చేనుపై పడిపోకుండా, కాండం దృడంగా ఉండి అధిక దిగుబడినిచ్చే (50 బస్తాలు/ ఎకరానికి, బస్తాకి 75 కిలోలు), అధిక నిండు బియ్యం శాతం (> 65%) కలిగి, దోమపోటు, ఎండాకు తెగులు, అగ్గి తెగుళ్ళను తట్టుకొని రెండు వారాల నిద్రావస్థ కలిగిన రకం అందించాలి. అంతేకాక మొదటి వారంలో అంకురోత్పత్తి (<10 శాతం) కలిగి, గింజ రాలిక లేకుండా ధాన్యం ఎరుపు రంగు,మధ్యస్థ సన్నం కలిగి బియ్యం పారదర్శకంగా ఉండి పొట్ట తెలుపు లేకుండా మధ్యస్థ అమైలోజ్ శాతం కలిగిన సార్వా రకాన్ని రైతులకు అందించాలి. దాళ్వాలో:110-120 రోజుల స్వల్ప కాలపరిమితి కలిగి, చేనుపై పడిపోకుండా కాండం ధృడంగా ఉండి అధిక దిగుబడి నిస్తూ (సగటున 60 బస్తాలు, బస్తాకి 75 కిలోలు), అధిక నిండు బియ్యం శాతం (> 65 %) కలిగి, దోమపోటు, ఎండాకు తెగులు, అగ్గి తెగుళ్ళను తట్టుకుంటూ, రెండు వారాల నిద్రావస్థ కలిగి, <10% అంకురోత్పత్తిని పంట కోసిన మొదటి వారంలో కలిగి , గింజ రాలిక లేకుండా, మద్యస్థ సన్నం లేదా పొడవు సన్నం ( బియ్యం పొడవు > 6.40 మి.మీ ) గా, పారదర్శకంగా ఉండి పొట్ట తెలుపు లేకుండా మధ్యస్థ అమైలోజ్ శాతం కలిగిన దాళ్వా రకాన్ని అభివృద్ధి చేయాలి.
* దమ్ము చేసిన పొలంలో డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాన్ని వేసుకున్నప్పుడు పెట్టుబడి రూ. 5000-6000/- వరకు తగ్గుతుంది గనుక ఈ పద్ధతిని రైతాంగానికి తెలియచేయాలి.
మేలైన కలుపు మందుల వాడకాన్ని ప్రోత్సహించి కలుపు తీయడానికి కూలీల కొరతను అధికమించవచ్చు.
* ఎద వరి సాగుకు అనుకూలమైన వరి రకాన్ని, పడిపోకుండా, వాయురహిత అంకురోత్పత్తి కలిగి, వేరు పొడవుగా, ధృడంగా ఉండి, బెట్ట పరిస్థితులను తట్టుకునే రకాన్ని విడుదల చేయాలి.
* కలుపు మందులు, ఎరువులు, పురుగు, తెగుళ్ల మందుల పిచికారికి అనువైన సాంకేతిక వ్యవసాయ పనిముట్లను ప్రోత్సహించాలి.
* రసాయనిక ఎరువులను తగ్గించి, వరి గడ్డి, పచ్చి రొట్ట పైర్లను, జీవ రసాయనిక ఎరువులను వేయడం ద్వారా పెట్టుబడి తగ్గించడమే గాక భూసారాన్నిపెంపొందిoచాలి.
* పచ్చి రొట్ట పైర్లను మే-జూన్ మాసంలో వేసి భూమిలోనే కలియ దున్నడం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని పెంపొందిoచాలి.
* వరి చొప్ప, తూఫాన్లలో తడిచి,రంగుమారిన ధాన్యాన్ని ఇథనాల్ ఉత్పత్తి చేసే పరిశ్రమల ద్వారా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర, ఆదాయాన్ని కలిగించాలి.
* రైతు-మిల్లర్-ట్రేడర్-వినియోగదారుడు కూటమి ద్వారా వాటాదారులకు ఉపయోగం కలిగించాలి.
* సోలార్ డ్రయ్యర్స్, మిని రైస్ మిల్స్ ని సబ్సిడీ ద్వారా ప్రోత్సహించాలి.

పైన సూచించిన చర్యలను అవలంభించడం వల్ల రైతులు 15 – 20 శాతం అధిక ఆదాయం పొందడమే కాక సుస్థిర వ్యవసాయం, సమాజానికి మేలు చేకూర్చడం జరుగుతుంది.

టి.శ్రీనివాస్, వై. సునీత, కె. ఫణి కుమార్, పి.వి.రమణారావు, ఎం.వి.కృష్ణాజీ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, మారుటేరు.

Leave Your Comments

Fruit Drop in Citrus Cultivation: చీని,నిమ్మ తోటల్లో పిందె రాలే సమస్య – నివారణ

Previous article

Pest Control In Papaya Cultivation: బొప్పాయిలో పిండినల్లి నివారించే పద్ధతులు

Next article

You may also like