వార్తలు

Free Nature Farming: సాగు ఖర్చులేని ప్రకృతి వ్యవసాయ విధానం -విశ్లేషణ

0
Organic Farming
Organic Farming

Free Nature Farming: ప్రకృతి వ్యవసాయ విధానం అనేది ఆనాది కాలం నుండి ఉన్నటువంటి ఒక రకమైన ఆహారోత్పత్తి విధానమైనప్పటికీ ఇటీవల ఈ సాగు విధానము బహుళ ప్రాచుర్యం పొందుతున్నది. దీని గురించి మొట్టమొదట ప్రఖ్యాత జపాన్‌ తత్వవేత్త, రచయిత మరియు స్వయంగా కర్షకుడైనటువంటి ‘‘మాసనోబు ఫుకుఓక’’ గారు తాను రచించిన ‘‘వన్‌స్ట్రా రెవల్యూషన్‌’’ అనే గ్రంథంలో వివరించడం జరిగింది.

Free Nature Farming

Free Nature Farming

ఇందులో నేల సారం కోసం సాగు, సేంద్రీయ వ్యవసాయం, సుస్థిర వ్యవసాయం, వ్యవసాయవన మరియు పర్యావరణ రక్షణ, శాశ్వత భౌతిక వసతుల అనుకూల సాగు విధానం మొదలైనవి సమ్మిళితమై ఉంటాయి మరియు వ్యవసాయ క్షేత్రంలోని ప్రతి పర్యావరణ జీవ వ్యవస్థ కనీస విభాగము స్వతంత్య్రంగా దానికి కావలసిన పోషక అవసరాలు, ఇతర జంతు వృక్షజాలంతో పాటు మనుగడ సాగించడానికి ఉపయోగపడే పరిస్థితులు సృష్టించబడతాయి.

మాసనోబు గారి ప్రకారం ఈ సాగు విధానం కేవలం ఒక సుస్థిర ఆహారంగా అభివృద్ధి కోసమే కాక, మానవ సంపూర్ణ వికాసానికి తోడ్పడుతుంది. మన దేశంలో 1970 నుండి 80 సంవత్సరంలో హరిత విప్లవం కోసం పాటించిన విధానాలకు సరిగ్గా వ్యతిరేకంగా అంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలు అధికంగా రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా చేసే విధంగా ఈ విధానం అవలంభించబడుతుంది.
శ్రీ సుభాష్‌ పాలేకర్‌ గారు మరియు కర్ణాటక రాష్ట్ర రైతు సమాఖ్య కలసి ఈ రకం సాగును తొలిసారిగా కర్ణాటక రాష్ట్రంలో భారీ స్థాయిలో చేపట్టడం జరిగింది. ఈ రైతు సమాఖ్య ‘‘బెల్జియన్‌’’ కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ రైతు సంఘం అయిన ‘‘లావియా కంపెసినా’’లో సభ్యత్వం కలిగి ఉంది.

మన దేశంలో ఈ ప్రకృతి వ్యవసాయ విధానం ప్రాధాన్యత రోజురోజుకీ పెరగడానికి కారణం, నిరంతరం పెరుగుతున్న ముడిసామగ్రి ధరలు, విత్తనాలపై ప్రైవేటు కంపెనీల గుత్తాధిపత్యం, తరచూ విఫలమయ్యే వ్యవసాయ విపణి అధికమైన ఇందన ధరలు మొదలైన వాటివల్ల రైతు ప్రయాణం కేవలం పాత అప్పుల నుండి కొత్త అప్పులకు మాత్రమే సాగుతూ వస్తోంది.

ఇటువంటి పరిస్థితుల్లో ఖర్చు లేని ప్రకృతి వ్యవసాయ విధానం అనేది రైతాంగాన్ని ఆకర్షించడానికిలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. దీనిని శూన్య పద్దు సాగు విధానం అనడానికి కారణం ఈ విధానంలో సాగు కోసం ఎటువంటి రుణాల పై ఆధారపడటం/ ధనం సమకూర్చుకోవడం అవసరం ఉండదు. అలాగే కృత్రిమ ముడిసరుకుల కోసం ఎటువంటి ఖర్చు చేయడం జరగదు. కాబట్టి ఇది శూన్య పద్దు విధానంగా అభివర్ణించబడుతుంది. కానీ ఇందులో అందుబాటులో ఉన్న ఖర్చులేని వృక్ష ఆధారిత సహజ ఎరువులు వాడటం జరుగుతుంది. అలాగే పంట ఉత్పత్తి ఎటువంటి కృత్రిమ రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా అతి తక్కువ మానవ ప్రమేయంతో జరుగుతుంది కాబట్టి ఈ విధానాన్ని ప్రకృతి వ్యవసాయ విధానం అనడం జరుగుతుంది.

Also Read:  పాడి పరిశ్రమ స్థాపనకు ముఖ్య సూచనలు

ఆర్థిక కోణంలో ఈ విధానాన్ని విశ్లేషించినప్పుడు సాంప్రదాయ సాగు విధానంలో ప్రధాన ఖర్చులైన విత్తనాలు, ఎరువులు మరియు అధిక కూలీల ఖర్చు లేకపోవడం వల్ల పెట్టుబడి ఖర్చు దాదాపు ఏమీ ఉండదు. ఇక ఉత్పత్తి, ఉత్పాదకత విషయానికొస్తే ఈ విధానం ప్రారంభించిన వెంటనే సాంప్రదాయ పద్ధతిలో సాగు దిగుబడుల స్థాయిలో లేకున్నప్పటికీ, స్థిరంగా పెరుగుతూ సాంప్రదాయ సాగును మించి పోతాయని పాలేకర్‌ వంటి వారు నిరూపించారు.

సుభాష్‌ పాలేకర్‌ గారి ప్రకారం ఈ సాగులో నాలుగు అంశాలు మూలస్తంభాలుగా వర్ణించబడ్డాయి అవి…..
1. జీవామృతం (సహజ పోషక ఎరువులు)
2. బీజామృతం (విత్తన శుద్ధీకరణ)
3. ఆచ్ఛాదన (మల్చింగ్‌ పద్ధతి)
4. వాపాస (నేలలోని సూక్ష్మ జీవులకు సరిపడినంత గాలి చేరేలా నేలను సారవంతంగా నిర్వహించడం)
కేంద్ర ప్రభుత్వం 2015 నుండి 16 లో ‘‘పరంపరాగత్‌ కృష్టి వికాస్‌ యోజన’’ కింద సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయ విధానాలు వెన్నుదన్నుగా నిలవడానికి చర్యలు చేపట్టింది ఈ పథకానికి ఇటీవల ‘‘భారతీయ ప్రాకృతిక వ్యవసాయ పద్ధతి’’ అని నామకరణం చేశారు. అలాగే ఈ పథకం కింద దేశంలోని 8 రాష్ట్రాలలో 4.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి 49.9 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరం కల్లా వంద శాతం వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయ విధానం కిందకు తీసుకురావడం జరుగుతుందని జూన్‌ 2018లో ప్రకటించడం జరిగింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఐ.సి.ఎ.ఆర్‌ ఆధ్వర్యంలో బాస్మతి వరి పంటపై ఈ విధానంలో లాభనష్టాల నిర్ధారణ కోసం 2017 సం॥ నుండి పరిశోధనలు కొనసాగుతున్నాయి.

‘‘నీతి ఆయోగ్‌’’ వారుకూడా ఈ విధానం పురాతన భారతీయ విజ్ఞానంలో భాగమని ప్రకటించింది. దీనిని ప్రోత్సహించడానికి విధాన పరంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మందికి పైగా రైతులు అవలంబిస్తున్నారని ఒక అంచనా..
దీనిలో స్థూలంగా సాగు ఖర్చు తగ్గడం సుస్థిర ఆదాయాలు, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందించడం ప్రకృతి / పర్యావరణ హితంగా సాగు చేయడమేకాక ప్రభుత్వానికి ఎరువులు, పురుగు మందుల దిగుమతి కోసం ఖర్చు అలాగే దేశీయంగా భారీ వ్యవసాయ సబ్సిడీలు భారం తగ్గించుకోవడానికి ఎంతో దోహదపడుతుంది.

ఈ పద్ధతిలో రైతులకు ప్రారంభదశలో ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నికర ఆదాయాలు తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తగు విధాన నిర్ణయాల ద్వారా ఔత్సాహిక రైతులను ప్రోత్సహించడం ద్వారా త్వరలోనే వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు మార్గం ఏర్పరచవచ్చును.

డా. డి. కుమారస్వామి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,
డా. జి. సంతోష్‌ కుమార్‌, డా. జి. స్వాతి, డా. ఎమ్‌. బలరాం
మరియు కె. స్వాతి, వ్యవసాయ కళాశాల, వరంగల్‌, ఫోన్‌ : 9866948395

Also Read:  వేసవిలో సౌరశక్తి ద్వారా పండ్లు, కూరగాయల ఉత్పత్తులు 

Leave Your Comments

Summer Health Tips: కీర-కొత్తిమీర స్మూతీ ఆరోగ్య ప్రయోజనాలు

Previous article

Cow Dung: గోశాల ఆర్థిక వ్యవస్థపై నీతి ఆయోగ్ ఫోకస్

Next article

You may also like