వార్తలు

కోకో సాగు – ఆదాయ వ్యయాలు

0

దేశంలో కోకో పంటను సుమారు 82,940 హెక్టార్ల విస్తీర్ణంలో తీర ప్రాంతం గల వివిధ రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. కొబ్బరి, ఆయిల్ పామ్, వక్క వంటి వన్యతోట పంటల్లో ముఖ్యంగా అంతర పంటగా కోకో సాగు చేయబడుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని కొబ్బరితోటల్లో, ఆయిల్ పామ్ తోటల్లో కోకొను అంతర పంటగా సాగుచేస్తున్నారు. మన దేశంలో సుమారు 27,000 టన్నుల కోకో ఉత్పత్తి జరుగుతోంది. కానీ చాకొలేట్, ఇతర కోకో ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ కారణంగా మనదేశం ప్రతి ఏటా 100,000 టన్నుల కోకో ఉత్పత్తులను అదనంగా దిగుబడి చేసుకోవడం జరుగుతోంది. కోకో పంట విస్తీర్ణం కూడా మనదేశంలో ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతోంది. రైతులకు కూడా లాభదాయకంగా ఉంటోంది. ఇండియన్ చాకొలేట్ మార్కెట్ ప్రస్తుతం (2023-24 ) ఉన్న 2.3 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 2032 సంవత్సరం నాటికి 5.3 బిలియన్ డాలర్లకు చేరుకొంటుందన్నఅంచనాలు ఉన్నాయి. ఈ కోకో పంట సాగు, యాజమాన్యం గురించి తెలుసుకొందాం.
అనుకూల పరిస్థితులు: తేమ ఎక్కువగా ఉన్న ఉష్ణ మండల వాతావరణ పరిస్థితులు కోకో  పంటకు బాగా అనుకూలం. సముద్రమట్టం నుంచి 500 మీ. ఎత్తువరకు ఈ పంట పెరుగుతుంది. ఉష్ణోగ్రత 15- 39 డిగ్రీలు, సాలీనా1500-2000 మి.మీ. వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు ఈ పంటకు అనుకూలం. సంవత్సరం పొడవునా తేమ ఉన్న ప్రాంతాలు కోకో పంటకు మరింత అనుకూలం. నేల ఉదజని సూచిక 4.5 నుంచి 8 వరకు ఉండి, నీరు నిల్వని సారవంతమైన మురుగునీరు పోయే లోతైన, సారవంతమైన బంకమన్ను నేలలు, ఇసుక నేలలు కోకో పంటకు అనుకూలం.
కోకో రకాలు / క్లోన్స్/ హైబ్రీడ్స్: ప్రపంచంలో ముఖ్యంగా రెండు రకాలు… క్రియల్లో, ఫారెస్టిరో  సాగులో ఉన్నాయి. ఈ రెండు రకాల మధ్య తేడా గింజల రంగుల్లో ఉంటుంది. క్రియల్లో రకం గింజలు కోసిన వెంటనే తెల్లగా పుష్టిగా ఉండి, పులిసాక గోధుమ రంగులోకి మారుతాయి. ఫారెస్టిరో రకం గింజలు కొద్దిగా చప్పిడిగా ఊదా రంగులో ఉండి, పులిసాక ముదురు గోధుమ రంగులోనికి మారుతాయి. ఎరుపు రంగులో ఉండే క్రియల్లో కాయలు గరుకుగా ఉంటాయి.  ఫారెస్టిరో కాయలు పచ్చగా ఉండి కాయ మగ్గినపుడు పసుపు వర్ణంలోకి మారుతాయి. దళసరి తొక్కను కలిగిఉంటాయి. క్రియల్లో రకం గింజలు ఎక్కువ చేదుగా ఉండి తక్కువ దిగుబడిని ఇస్తాయి. ఈ పంటకు తెగుళ్ళు తట్టుకొనే సామర్ధ్యం తక్కువ. గింజలు మూడు రోజుల్లో పులుస్తాయి. అదే ఫారెస్టిరో రకంలో గింజలు పులవడానికి దాదాపు ఆరు రోజుల సమయం పడుతుంది.
కోకో మొక్కల ఉత్పత్తి: మంచి కాయలను ఎంపిక చేసినపుడే వాటి నుంచి వచ్చే మొక్కలు కూడా నాణ్యంగా ఉంటాయి. సేకరించే కాయలు ఫోరెస్టిరో లేదా ఆకుపచ్చ లేదా ఉదా రంగు కలిగిన ట్రినిటారియో రకానికి సంబంధించినవై ఉండాలి. సేకరించుకోవలసిన కోకో కాయ పైభాగం నున్నగా, తొక్క 1 సెం.మీ. మందం ఉండి, దాదాపు 35 కోకో బీన్స్ లేదా విత్తనాలతో, 350 గ్రా. కంటే అధిక బరువు కలిగి ఉండాలి. కాయ పైభాగంలో నొక్కు లేదా తొక్క అణిగిన గుర్తు ఉండకూడదు. కాయలను మూడు – నాలుగవ  పరిపక్వత దశలో అనగా పచ్చని కాయ రంగు పసుపుకు లేదా ఊదారంగు కాయలు కాషాయ రంగుకు మారడం గమనిస్తామో ఆ దశలో కాయలను కొసి, నీడలో 2- 3 రోజులు ఆరబెట్టాలి. కాయలను చెక్కతో చేసిన సుత్తితో,  కత్తితో కానీ నెమ్మదిగా కోసి విత్తనాలను కాయ మధ్య గుజ్జు నుంచి వేరుచేసి, వెంటనే నాటుకోవాలి. కాయ మధ్యభాగంలోని పెద్ద విత్తనాలు సుమారు 90- 95 శాతం వరకు మొలకెత్తుతాయి. కోకో గింజలను ఇసుక లేదా రంపపు పొట్టుతో కలిపి రుద్దడం వల్ల విత్తనానికి వెలుపల ఉన్న గుజ్జు తొలగి, త్వరగా మొలకెత్తుతుంది. ఫంగస్, చీమలు బారిన పడకుండా కూడా విత్తనాలను కాపాడుకోవచ్చు. గింజలను తక్కువ లోతులో విత్తుకోవాలి. పాటింగ్ మిశ్రమం పైభాగంలో గింజను అడ్డుగా ఉంచి, పైన ఇసుకతో కప్పి ఉంచాలి. 6 x 9  అంగుళాల పరిమాణం, 250 గేజీల మందం ఉన్ననలుపు రంగు పాలీథిన్ సంచులకు రంధ్రాలు ఏర్పరచుకొని, వీటిలో పాటింగ్ మిశ్రమం నింపుకొని, విత్తనాలు నాటుకోవాలి. సుమారు 3-4 నెలల తరువాత మొక్కలు నాటుకోవటానికి సరిపడా పెరుగుదల చూపిస్తాయి. కోకో గింజల ద్వారా ఉత్పత్తయిన మొక్కలు జన్యుపరమైన వైవిధ్యతను కలిగి ఉంటాయి. కోకొను ఆలింగనం పద్దతిలో సాఫ్ట్ వుడ్ గ్రాఫింగ్ అనే పద్దతిలో అంటుకట్టే విధానం ద్వారా కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఈ మొక్కలు తల్లి మొక్కను పోలి వైవిధ్యతను చూపించకుండా ఒకే రకంగా ఉంటాయి. అదేవిధంగా సరైన ఉత్పత్తిని నాణ్యతను కలిగిన తల్లి మొక్కలను గుర్తించి సంకర మొక్కలు లేదా హైబ్రిడ్ కోకో మొక్కలు కూడా రూపొందించవచ్చు.

తోట నాటడం: వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో మే-జూన్ నెలల్లో, వర్షపాతం అధికంగా ఉన్న చోట్ల సెప్టెంబర్ నెలలో నాటుకోవచ్చు. చెట్టు మొదల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి. మొక్కలను 60 సెం.మీ. పొడవు, వెడల్పు, లోతు ఉన్న గుంతల్లో నాటుకోవాలి. వక్క తోటల్లో మొక్కల మధ్య దూరం 2.7 మీ.  x 2.7 మీ. ఉన్నపుడు, కోకో చెట్లను 2.7 మీ. x  5.4 మీ. దూరంలో నాటుకోవాలి. కొత్తగా నాటే తోటలో అయితే వక్క, కోకో మొక్కలను 3.3 మీ.x 3.3 మీ. దూరంలో నాటుకోవచ్చు. కోకో పంటకు ఎండా కాలంలో నీడ అవసరం. కొబ్బరిలో అయితే ఒకటి లేదా రెండు వరుసల్లో కొబ్బరి మొక్కల వరుసల మధ్య  నాటుకోవచ్చు. ఒక వరుసలో అయితే 2.7 మీ. దూరం, రెండు వరుసల పద్దతిలో 2.5 మీ. దూరంలో ఉండేలా కోకో నాటుకోవచ్చు.
నీడ : కోకో మొక్కలు 50 శాతం కన్నా ఎక్కువ సూర్యరశ్మిని తట్టుకోలేవు అందువల్ల కొబ్బరి,  వక్క తోటల్లోని అనుకూల వాతావరణం వల్ల వీటి పెరుగుదల బాగుంటుంది. కోకో చెట్లు పెరిగేకొద్దీ నీడ అవసరం తగ్గుతుంది.
ఎరువుల వాడకం: సాధారణంగా మూడవ సంవత్సరం నుంచి ప్రతి చెట్టుకు100 గ్రా. నత్రజని, 40  గ్రా. భాస్వరం, 140 గ్రా పోటాష్ సిఫారసు చేయబడింది. మొదటి సంవత్సరమైతే ఈ మోతాదులో 33 శాతం, రెండో సంవత్సరం 66 శాతం వేయాలి. ఎరువులను సంవత్సరంలో రెండు భాగాలుగా రెండుసార్లు అనగా వర్షాకాల ప్రారంభం ముందు ఏప్రిల్- మే నెలలో, సెప్టెంబర్-అక్టోబర్ నెలలో రెండోసారి వేసుకోవచ్చు. ఎరువులను చెట్టు మొదలునుంచి 75 సెం. మీ. దూరం వరకు చల్లి మట్టిని ఎరువుతో పాటు కలిసేలా కలియబెట్టుకోవాలి. చెట్టు చుట్టూ బోదెలను తీయడం వల్ల వేర్లకు గాలి అంది పెరుగుదల బావుంటుంది. చిన్నవేర్లు పుట్టుకొచ్చి చెట్టు ఎక్కువ నీరు, పోషకాలను తీసుకునే అవకాశం ఉంటుంది.
జింకు ధాతు లోపం: దక్షణాది రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తోంది. జింకు లోపం ఉన్నపుడు ఆకు ఈనెల మధ్యభాగంలో పచ్చదనం తగ్గి పసుపుగా మారి ఆకూ పెళుసుగా, గరుకుగా కనిపిస్తుంది. ఆకుల పరిమాణం తగ్గి కొడవలి ఆకారంలోనికి మారుతాయి. తరువాత నెమ్మదిగా ఆకులు రాలి కొమ్మలు ఎండిపోతాయి. నివారణకు జింకు సల్ఫేట్ (0.3 శాతం), సున్నం (0.15 శాతం) మిశ్రమం ఆకుల మీద పిచికారి చేయాలి.
ఇనుప ధాతు లోపం: ఆంధ్ర ప్రదేశ్ లోని తోటల్లో ఇనుప ధాతు లోపం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటోంది. లేత చిగురాకుల ఈనెలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ఆకుల మధ్యభాగం పాలిపోయిన పచ్చ రంగుకి లేదా పసుపు, తెలుపు రంగుల్లోకి మారుతుంది. ఆకుల చివర్లు ఎండిపోతాయి. అన్నభేది (1 శాతం) పిచికారి చేసి దీనిని నివారించుకోవచ్చు.
నీటి తడులు: కోకో పంట నీటి ఎద్దడిని తట్టుకోలేదు. అందువల్ల వర్షాలు లేనపుడు నీటి తడులు ఇవ్వాలి. నవంబర్ – డిసెంబర్ నెలల్లో వారానికి ఒకసారి, జనవరి -మార్చి లో ఆరు రోజులకు ఒకసారి, ఏప్రిల్-మే లో 4- 5 రోజులకు ఒకసారి 175 లీ. నీటిని చెట్టుకు ఇవ్వాలి. డ్రిప్ పద్దతిలో అయితే ప్రతిరోజూ 20 లీ. నీరు రెండు, మూడు డ్రిఫ్స్ ద్వారా ఇవ్వొచ్చు. డ్రిప్ పద్దతి ద్వారా 44 శాతం నీటిని ఆదా చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల 30 లీ. వరకు నీటిని డ్రిప్ పద్దతి ద్వారా ఏప్రిల్- మే నెలల్లో ఇవ్వాల్సి ఉంటుంది.
కొమ్మల కత్తిరింపులు: కోకో మొక్క నిలువుగా పెరుగుతూ వివిధ శ్రేణుల్లో అడ్డంగా కొమ్మలు వస్తాయి. పూలు, కాయలను కాండం, కొమ్మలపై ఉత్పత్తి చేస్తుంది. కోకోను ఎక్కువగా అంతర పంటగా సాగు చేస్తారు గనుక పెరుగుదలకు కావలసిన సూర్య కాంతి మొక్కలకు అందడానికి వీలుగా కొమ్మల వ్యాప్తిని నియంత్రించి నిర్దిష్ట ఆకారం వచ్చేలా మొక్కల్లో కత్తిరింపులు చేయాలి.

కోత, ప్రాసెసింగ్: చెట్లు నాటిన రెండో సంవత్సరం నుంచే పూత రావడం మొదలవుతుంది. కాయలు 140- 160 రోజుల్లో పక్వానికి వస్తాయి. ప్రతి కాయలో 25-45 గింజలు తెల్లటి గుజ్జులో  ఉంటాయి. సాధారణంగా రెండు కోతలు, నీటి సదుపాయం ఉంటె ఏడాదిపొడవునా   కాపునిస్తాయి. పూల గుత్తులు దెబ్బతినకుండా తొడిమలు చెట్టుకే ఉంచుతూ జాగ్రత్తగా కాయలు కోయాలి. ప్రతి 10-12 రోజులకు పక్వానికి వచ్చిన కాయలు కోయాలి. కోసిన కాయలను రెండు రోజుల వరకు పక్కన ఉంచుకోవచ్చు. వీటిని 4 రోజులకు మించి ఎక్కువ నిల్వ చేయకూడదు. కాయలను కర్రతో మధ్య భాగంలో కొట్టి గుజ్జుతో సహా గింజలను వేరుచేయాలి.
పులియబెట్టుట: గింజల చుట్టూ ఉన్న గుజ్జును తొలగించడానికి,చాకొలేట్ కి మంచి సువాసన, రుచి రావడానికి, గింజ ఆమ్లతను 5.5 కు తీసుకురావడానికి, గింజ వగరును తగ్గించడానికి, గింజచుట్టున్నపలుచటి పొర తొలగించడానికి, గింజను మొలవకుండా ఆపడానికి మరింత ముఖ్యంగా చాకొలేట్ నాణ్యత పెంచడానికి ఈ పులియబెట్టే ప్రక్రియ కోకోలో అతిముఖ్యమైంది. వివిధ పద్ధతులైన పెట్టె, గుంపు, ట్రే పద్దతులను ఉపయోగిస్తారు. పులియబెట్టిన తరువాత వాటిని తగిన విధంగా ఎండబెట్టి గింజలను గ్రేడింగ్ చేస్తారు.
దిగుబడి: సామాన్య పద్దతుల ద్వారా సాగుచేసినపుడు దిగుబడికి వచ్చిన ప్రతి కోకో చెట్టు నుంచి 1-2 కిలోల ఎండు గింజలు లభిస్తాయి. గ్రేడింగ్, క్వాలిటీని బట్టి ఈ మధ్య కాలంలో కోకో బీన్స్ ధర రూ.500-1500 వరకు పలుకుతోంది.
కోకో తోట నిర్వహణ ఆదాయ వ్యయాలు:
ఒక హెక్టరు కోకో తోటను కొత్తగా పెట్టడానికి సుమారుగా రూ.3,38,481 ఖర్చు అవుతుంది. తోట నిర్వహణకు ప్రతిసంవత్సరం రూ. 94,385 (ఏ) ఖర్చు ఉంటుంది. మొదట తోట పెట్టడానికి అయిన ఖర్చు రుణం రూపంలో తీసుకున్నపుడు దీనిని తిరిగి తీర్చడానికి సంవత్సరానికి అయ్యే విలువ రూ.31466 (బి) అనగా ప్రతిసంవత్సరం తోట నిర్వహణ, రుణ విమోచన విలువ కలిపి రూ. 1,25,851 (ఏ+బి) ఖర్చు ఉంటుంది. అదేవిధంగా ఒక హెక్టారు కోకో తోట నుంచి సుమారు దిగుబడి 928 కిలోల వరకు ఉంది అనుకుంటే సగటున ఒక కిలో బీన్స్ తోట నుంచి ఉత్పత్తికి కావడానికి సుమారు రూ. 135.61 ఖర్చు అవుతుంది. అదే కోకో బీన్స్ కు మార్కెట్లో రేటు రూ. 300 వరకు ఉన్నా, ఒక కిలో మీద రూ.165 ఆదాయం ఉంటుంది. ఈ విధంగా ఒక హెక్టారు పొలం నుంచి ఖర్చులు పోగా రూ. 1,53,120 వరకు లాభం పొందవచ్చు. ఈ మధ్య కాలంలో ఒక కిలో బీన్స్ ధర రూ. 600- 800 వరకు కూడా వెళ్ళింది. ఇలాంటి పరిస్థితి ఉన్నపుడు రెండు లేదా మూడు రేట్లు అదనపు ఆదాయాన్ని కోకో అంతర పంట నుంచి పొందవచ్చు.

అపర్ణ వేలూరు, ఎలైన్ అప్సర
కేంద్రీయ వన్య తోట పంటల పరిశోధనా సంస్థ,
కాసరగడ్, కేరళ, ఫోన్: 7025983006.

Leave Your Comments

శనగ పంటలో ఎండు తెగులు, వేరుకుళ్లు ప్రధాన సమస్య

Previous article

యాసంగి వరికి ప్రత్యామ్నాయంగా మినుము సాగు – రైతు విజయగాథ

Next article

You may also like