Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ కు వ్యవసాయ రంగాన్ని వెన్నెముకగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటికి సుమారు 53 % మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఇప్పటికీ మనుగడలో ఉంది.
- అయితే స్వాతంత్ర్యానంతరం వివిధ పారిశ్రామిక తీర్మానాలు,విధానాలు ,నూతన ఆర్థిక సంస్కరణల ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ లో ,జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా క్షీణిస్తూ వస్తుంది. అదే విధంగా వ్యవసాయరంగంపై ఆధారపడే ప్రజల సంఖ్య కూడా తగ్గుతుంది.
- వ్యవసాయరంగం లో జరుగుతున్న ఆధునిక అభివృద్ధి పారిశ్రామిక రంగంతో పాటుగా సేవారంగ అభివృద్ధికి కూడా ఎంతగానే దోహదం చేస్తుంది. వ్యవసాయాధార పరిశ్రమలకి ముడిపదార్థాలను ఉత్పాదకాల రూపంలో అందించడం జరుగుతుంది.
- వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ప్రభావం వల్ల ఈ రంగానికి చెందినవారు పారిశ్రామిక రంగానికి తరలిపోతున్నారు.
- ఆధునిక వ్యవసాయ విధానంలో భాగంగా పరికరాల వాడకం పెరగడం తో ఈ రంగం లో మానవ ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ వ్యవసాయ రంగ ప్రాధాన్యతని విస్మరించలేం.
- బ్రిటిష్ కాలంలో ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్నా, 1966 నుండి హరిత విప్లవం ప్రభావంతో వ్యవసాయ రంగం లో వాణిజ్య పంటల ప్రాధాన్యం పెరిగింది.
Also Read: సహజ వ్యవసాయంలో మహిళా రైతుల విజయగాథ
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యాన్ని తెలిపే అంశాలు:
- ఆర్థికాభివృద్ధికి జాతీయాదాయం లో వ్యవసాయరంగం వాటాని ఒక సూచికగా చెప్పుకోవచ్చు.అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో జాతీయాదాయం లో వ్యవసాయ రంగం వాటా అత్యల్పంగా ఉంటుంది.
- ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగం వాటా ఒకప్పుడు ఎక్కువగా ఉన్న భారతదేశం లో కూడా ఇపుడు పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధి వలన అది క్రమేపీ తగ్గుతూ వస్తుంది.
- వ్యవసాయానుబంధ రంగాల వృద్ధిరేటు 2013-2014 లో 4.2% కాగా, ప్రస్తుత తరుణంలో కొనసాగుతున్న కోవిడ్ సంక్షోభంలో కూడా 2021-2022 లో 3.9 % గా నమోదైంది.
ఉద్యోగితలో వ్యవసాయరంగం వాటా:
- 1951 లో మొత్తం జనాభాలో 69.5% మందికి వ్యవసాయ రంగమే ఉపాధి కల్పించగా, 2021-2022 నాటికి 40.6% గా ఉంది.
- వ్యవసాయ రంగం అధిక జనాభాకి ఉపాధి కల్పిస్తూ, ప్రైవేటు రంగం లో అతిపెద్ద ఉపాధి కల్పనా రంగముగా అభివృద్ధి చెందుతుంది.
అంతర్జాతీయ వ్యాపారంలో వ్యవసాయ రంగ ప్రాధాన్యం:
- వ్యవసాయోత్పత్తులైన టీ, పంచదార ,నూనెగింజలు , పొగాకు , సుగంధ ద్రవ్యాల లాంటివి ఎగుమతుల్లో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.
- 1990-1991 నాటికి మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయోత్పత్తుల వాటా 18.5 % గా ఉండగా , ఇది 2021-2022 నాటికి 21.8% గా ఉంది.
వ్యవసాయార్థిక వ్యవస్థపై హరితవిప్లవ ప్రభావము:
- హరితవిప్లవ ప్రభావం వల్ల వరి, గోధుమ , మొక్కజొన్న ,జొన్న ,వంటి ఆహార పంటల ఉత్పత్తి ఎన్నో రేట్లు పెరిగింది. ఈ విప్లవాన్నీ ఆహారపంటలకే పరిమితం చేసి , మిగతా పంటలని నిర్లక్ష్యం చేసారు. ఈ విప్లవం ద్వారా అధికంగా వృద్ధి చెందిన పంట గోధుమ.
- ఈ విధంగా వ్యవసాయ రంగాన్ని , ఉత్పత్తుల నిల్వ ,పంపిణీ మొదలగు ప్రక్రియలని నిర్వహించుటకు 1965 లో FCI ( Food Corporation of India) ని ఏర్పాటు చేసారు.
- వ్యవసాయం, దాని అనుబంధరంగాల అభివృద్ధికి సంబంధించిన రుణ సదుపాయాలు , సహకారం వంటివి అందించడానికి 1963 లో NABARD ని స్థాపించారు. ఇలంటి సంస్థలు కూడా దేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా ని, ప్రాధాన్యాన్ని పెంచేందుకు దోహదం చేశాయి.
ఆర్థిక ప్రణాళికలో వ్యవసాయ రంగం పాత్ర:
- వ్యవసాయ ఆర్థికాభివృద్ధిని సాధించడంలో భాగంగా బాంక్ ఋణాల్లో 40 % వరకు వ్యవసాయరంగానికి కేటాయించేలా నిర్ధేశించారు. ఇది ఆర్థికవ్యవస్థలో వ్యవసాయరంగ ప్రాధాన్యతని సూచిస్తుంది.
- పెరుగుతున్న జనాభాకి తగిన స్థాయిలో ఆహార భద్రతని కల్పించి , పేదరికాన్ని తొలగించడంలో వ్యవసాయరంగ పాత్ర ప్రధానమైంది.
- పరిశ్రమలకి ముడిపదార్థాలను అందించడమే కాక , పారిశ్రామిక ఉత్పత్తులకి తగిన మార్కెట్ రంగాన్ని కూడా వ్యవసాయం కల్పిస్తుంది.
- జాతీయదాయంలో వ్యవసాయ రంగ వాటా తగ్గుతున్నప్పటికీ నేటికీ మన దేశంలో గ్రామీణులకి అధిక ఉపాధి కల్పిస్తున్న రంగముగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
Also Read: బొగ్గుతో వ్యవసాయం దిగుబడులు అధికం
Leave Your Comments