బంగాళా దుంప స్వప్నకాలంలో పండించే శీతాకాలపు పంట. మన రాష్ట్రంలో ముఖ్యంగా మెదక్, చిత్తూరు జిల్లాల్లో అధికంగానూ, రంగారెడ్డి జిల్లాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో సాగులో ఉంది. బంగాళా దుంప సాగుకు చల్లని వాతావరణం అవసరం. పగలు ఉష్ణోగ్రత 32 డి. సెం, రాత్రి ఉష్ణోగ్రత 15-20 డి.సెం. మధ్య చాలా అనుకూలం అధిక ఉష్ణోగ్రత వల్ల దుంపల్లో పెరుగుదల ఉండదు. నీటి పారుదల, నీటి వసతి గల ఇసుక లేక ఎర్ర గరప నేలలు అనుకూలం. ఆమ్ల క్షణాలు, బరువైన నేలలు దుంప పెరుగుదలకు అనుకూలం కాదు.
అనువైన రకాలు :
కుఫ్రీ లాలిమ, కుఫ్రీ బాద్‌షా, కుఫ్రీ చంద్రముఖి, కుఫ్రీ సింధూర్, కుఫ్రీ జ్యోతి, కుఫ్రీ లవకర్, కుఫ్రీ బహార్, కుఫ్రీ ఆనంద్, కుఫ్రీ సూర్య వంటి రకాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగులో ఉన్నాయి.
నేల తయారీ :
నేలను 4-5 సార్లు దున్ని ఎకరాకు 10-12 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్ని చదును చేయాలి. 50 సెం.మీ ఎడంతో బోదెలు, కాలువలు చేయాలి. శీతల గిడ్డంగుల నిల్వ నుండి తీసిన ఆలు గడ్డ విత్తన దుంపలను త్వరితంగా మొలకెత్తించడానికి వాటిని 30 సెం.మీ మందం కన్నా మించకుండా నీడలో పరచి కనీసం 7-10 రోజుల పాటు ఆరనీయాలి. గాలి చొరబడడానికి 2-3 సార్లు విత్తిన దుంపల తిరగ తిప్పాలి. పెద్ద సైజు దుంపలను శుభ్రంగా నీటిలో కడిగి 30-40 గ్రా. ఉండేలా దుంపలను ముక్కలుగా కోయాలి.
100 గ్రా. థయో యూరియా + 10 మి.గ్రా. జిబ్బరిల్లిక్ అసిడ్ 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో విత్తన దుంపలను ముంచి తీసి బాగా ఆరబెట్టి ఆ తరువాత కుప్పులుగా చేసి 24-48 గంటలు ఉంచిన తరువాత విత్తుకుంటే మొలక శాతం బాగా ఉంటుంది. ఈ ద్రావణంలో 500 కి.లో వరకు విత్తనాన్ని శుద్ధి చేయవచ్చు.
విత్తే విధానం :
తెగులు సోకని, ఆరోగ్యవంతమైన దుంపలను ఎంచుకోవాలి. దాదాపు 30-40 గ్రా. బరువుతో 2-3 కళ్ళు ఉండి, అప్పుడే మొలకెత్తడం ప్రారంభించిన వీటిని విత్తడానికి ఎంపిక చేయాలి. ముక్కలు చేసిన విత్తన దుంపలు ఎకరాకు 6-8 క్వింటాలు అవసరం ఉంటుంది. విత్తనా ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రాల నివారణకు విత్తనశుద్ధి తప్పనిసారిగా చేయాలి. 25-50 గ్రా. బగాలాల్ (మిథైల్ ఇథాక్సి మెర్క్యురిక్ క్లోరైడ్) 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో 2-5 నిమిషాపాటు ఉంచాలి. ఒకసారి తయారు చేసిన మందు ద్రావణాన్ని మూడుసార్లు మాత్రమే విత్తనశుద్ధికి ఉపయోగించాలి.
బోదెకు ఒక పక్కగా కళ్ళు పైభాగం వైపు ఉండేటట్లుగా విత్తన దుంపలను నాటాలి. మొక్కల మధ్య 20 సెం.మీ, వరుసల మధ్య 50 సెం.మీ. ఎడం ఉండేలా విత్తుకోవాలి. లీటరు నీటికి 3 గ్రా. మాంకోజెబ్‌తో తయారు చేసిన ద్రావణంలో కూడా ఈ దుంపలను సుమారు 30 నిమిషాలు ఉంచి విత్తన శుద్ధి చేసుకోవాలి.
నీటి యాజమాన్యం :
నేలను, వాతావరణం దృష్టిలో ఉంచుకొని నీరుపెట్టాలి. చల్కా నేలల్లో, మొలకెత్తడానికి ముందు 7-8 రోజుల వ్యవధితోనూ, దుంపలు ఏర్పడేటప్పుడు 4-5 రోజుల వ్యవధిలోను నీరు పెట్టాలి.
కలుపు నివారణ :
అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మిపడితే, దుంప ఆకు పచ్చ రంగుకు మారుతుంది. కాబట్టి విత్తిన 30 రోజుల తరువాత సుమారు 3-4 సార్లు మట్టిని ఎగదోయాలి. విత్తిన 2-3 రోజుల్లో ఎకరాకు ఒక లీటరు అలాక్లోర్ మందును పిచికారి చేయాలి. అలాగే 300 గ్రా. మెట్రిబుజిన్ కూడా పిచికారి చేసి కలుపును నివారించవచ్చు.
ఎరువుల యాజమాన్యం :
ఆఖరి దుక్కిలో ఎకరాకు 10-12 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 40 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. విత్తిన 30 రోజుల తరువాత 40 కిలోల యూరియా, 50 రోజుకు 20 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.
దుంప తొలిచే పురుగు (ట్యూబర్ మాత్) :
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో ఈ పురుగు ఉధృత్తి చాలా తక్కువగా ఉంది. ఈ పురుగు ప్రభావం పొలంలో పంటపైన మొదట ప్రారంభమైన తరువాత గోడౌన్‌లో నిల్వ చేసినప్పుడు అధికమవుతుంది. ఈ పురుగు తొలిచిన దుంపలు గుల్ల బారి, పుచ్చిపోతాయి. 30 శాతం వరకు దిగుబడు నష్టం వస్తుంది.
నివారణ పద్ధతులు :
- దుంపను బయటపడకుండా ఎప్పటికప్పుడు బోదెపైకి మట్టి ఎగదోయాలి.
- పురుగు ఆశించిన దుంపను గుర్తించి ఏరి నాశనం చేయాలి.
- దుంపలను 3 సెం.మీ మందం ఇసుక పేర్చి వాటిపై ఉంచాలి.
- పొలంలో ఈ పురుగుని అరికట్టడానికి లీటరు నీటికి 3 గ్రా. కార్బరిల్ పొడి మందును (అంటే ఎకరాకు 600 గ్రా. / 200 లీ. నీటికి కలిపి ద్రావణం) పిచికారి చేయాలి.
- నిల్వ చేసేటప్పుడు గోడౌన్‌లో సంచుల మలాథియాన్ 3 మి.లీ / లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
రసం పీల్చే పురుగు (పేను బంక, త్లెనల్లి, దీపపు పురుగు) :
ఆకుల నుండి రసాన్ని పీల్చి నాశనం చేస్తాయి. ఆకులు ముడతలుపడి పసుపు రంగుకి మారిపోతాయి. నివారణకు మిథైల్ డెమటాన్ లేదా డైక్లోరోవాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పేనుబంక వల్ల ఆకులుముడత తెగులు వ్యాపిస్తుంది. త్లెనల్లి ఆకు కింది భాగంలో గుంపులుగా ఉండి రసంపీల్చి వైరస్ తెగుళ్ళను వ్యాప్తి చేస్తుంది. ఆకులు కురచబారి ముడుచుకుంటాయి. దీని నివారణకు లీటరు నీటికి 2.5 మి.లీ ట్రైజోఫాస్ కలిపి పిచికారి చేయాలి.
ఎర్లీబ్లైట్ (ఆకుమాడు తెగులు) :
ఆకుల మీద, కొమ్మల మీద నల్లని మచ్చలు కనిపిస్తాయి. తీవ్రదశలో మొక్కలు ఎండిపోయి, నేలపై వాలిపోతాయి. దీని నివారణకు డైథేన్ జడ్ – 78ను 2 గ్రా. లేదా క్లోరోథలోనిల్ (0.2 శాతం) 2 మి.లీ, లీటరు నీటికి కలిపి నాటిన 30 రోజుల తరువాత 8 రోజుల వ్యవధిలో పంటపై చల్లాలి. సుమారు 5-6 సార్లు దీన్ని పిచికారి చేయాలి.
బ్యాక్టీరియా కుళ్ళు తెగులు :
ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా దుంప వ్లవల్ల వ్యాప్తి చెందుతుంది. దెబ్బతిన్న వేర్ల ద్వారా కూడా మొక్కకు ఆశించి త్వరితంగా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన దుంపలను వాడడం వల్ల చాలా వరకు ఈ తెగును నివారించవచ్చు. లీటరు నీటికి 20-25 గ్రా. బ్లీచింగ్ పౌడరు కలిపి పిచికారి చేయడం ద్వారా లేక ఎకరాకు 8 కిలోల చొప్పున నీటిలో కలిపి వాడి ఈ తెగులు ఉధృతిని అరికట్టవచ్చు.
కోత :
నేల పైభాగంలో మొక్కలు వాలిపోయి, పసుపు వర్ణం నుండి గోధుమ వర్ణంకు మారి పడిపోతుంది. నాటిన 90-100 రోజుల్లో కోతకు సిద్దం అవుతుంది. దుంపలకు తగలకుండా జాగ్రత్తగా గడ్డపారతో తవ్వి, నీడలో ఆరబెట్టిన తరువాత నిల్వ చేయాలి. ఎకరాకు 10-14 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
సాగులో తీసుకోవాల్సిన జాగర్తలు :
- శీతాకాంలో మాత్రమే సాగు చేయాలి. (అక్టోబరు-నవంబర్)
- దుంపలను నాటే ముందు 1 గ్రా. కార్బండిజమ్ లేదా 3 గ్రా. మాంకోజెబ్ లీటరు నీటిలో కలిపిన మందు ద్రావణంలో అరగంట సేపు ఉంచి నాటుకోవాలి.
- మొలక శాతం పెంచడానికి దుంపలను 1 పి.పి.యమ్ జిబ్బరిల్లిక్ ఆమ్ల ద్రావణంలో (1 మి.గ్రా లీటరు నీటిలో) గంటసేపు ఉంచి, తరువాత ఆరబెట్టి 10 రోజులు ఉంచాలి. దుంపలను బోదెపై నాటుకోవాలి.
- దుంపల పెరుగుద దశలో తప్పనిసరిగా నీటినివ్వాలి.
- దుంపలను 1-2.7 డి. సెం. ఉష్ణోగ్రత, 90 శాతం తేమ వద్ద నిల్వ చేసుకోవాలి.