ఈ నెల పంటఉద్యానశోభ

జులై మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనులు

0

మామిడి :- తోట మరియు పాదుల్లో కలుపు లేకుండా చూడాలి. వర్షాధార తోటల్లో పాదులకు మర్చింగ్ చేసి వర్షపు నీటిని పొదుపు చేసుకోవాలి. వర్షాలు పడినా, పడకపోయినా మామిడి చెట్లు ఈ సమయంలో చిగురు వేస్తాయి. చెట్లపై లేత ఆకులు కనిపిస్తూ ఉంటాయి. భవిష్యత్తులో సూక్ష్మ ధాతు లోపాలు రాకుండ ఉండటానికి చెట్లపై సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రా జింకు సల్ఫేట్, 2.5 గ్రా ఫెరిస్ సల్ఫేట్, 2 గ్రా కాపర్ సల్ఫేట్ మరియు 3 గ్రా మాగ్నిషియం సల్ఫేట్ లను కలిపి పిచికారీ చేయాలి.

జామ :- కొత్తగా తోట వేయాలనుకునే వారు, ఈ మాసంలో నాటుకోవచ్చును. పెద్ద చెట్లకు పాదులు చేసి 540 గ్రా యూరియ, 625 గ్రా సింగల్ సూపర్ ఫాస్ఫటే, 425 గ్రా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పాదులో వేసి నీరు పెట్టాలీ. ఆకులు ఎరుపు రంగులోకి మారినప్పుడు భాస్వరం, పొటాష్, జింక్, సేంద్రియ పదార్ధాల మిశ్రమ లోపాలుగా గుర్తించవచ్చును. రసాయినిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేసి ఈ లోపాలను నివారించవచ్చును. 4 గ్రా జింకు సల్ఫేట్, 2 గ్రా బోరాన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

బత్తాయి, నిమ్మ :- కొత్త బత్తాయి, నిమ్మ తోటలు నాటుకొనే వారు, మొక్కలను నాటే ముందుగా అంటు మొక్కల వేర్లను లీటరు నీటికి 1 గ్రా కార్బండిజమ్ కలిపిన ద్రావణంలో 10-15 నిమిషాలు పాటు ఉంచి నాటుకోవాలి లేత తోటల్లో 5 ఏళ్ల వరకు అంతర పంటలుగా మినుము, పెసర పంటలను వేసుకోవచ్చు. పచ్చిరొట్ట పైరుగా 15 కిలోలు జీలుగా విత్తనాలను చల్ల వచ్చును. కాయ రాలటం నివారణకు 1.5 గ్రా 2,4-D, 100 గ్రా కార్బండిజమ్ 1 కిలో యూరియాను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గజ్జి తెగులు నివారణకు 180 గ్రా కాపర్ ఆక్స్ క్లోరైడ్ ను మరియు 6 గ్రా స్ట్రెప్టోసైక్లీన్ 60 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

అరటి :- ఈ మాసంలో పెద్ద పచ్చ అరటి, పొట్టి పచ్చ అరటిలో సిగటొక ఆకు మచ్చ తెగులు ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ట్రైడిమార్ప లేదా ప్రోపకొనజోల్ 1 మి.ల్లీ లీటరు నీటికి చొప్పున కలిపి 20 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు. తోటలో కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. నీరు నిలవకుండా, మురుగు నీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.

సపోట :- తోట ఇరువైపులా దుక్కి దున్ని చెట్లకు పాదులు చేసి, పెద్ద చెట్లకు 880 గ్రా యూరియా, కిలో సింగల్ సూపర్ ఫాస్ఫటే, 750 గ్రా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను చెట్టు మొదలు నుండి 1.5 మీటర్ల దూరంలో పోడంతా సమంగా వేసి మట్టిలో కలపాలి.

సీతాఫలం :- చెట్ల చుట్టు పాదులు చేసి, కిలో ఆముదం పిండి, 250 గ్రా ఆఖటోబాక్టర్, 250 గ్రా యూరియా, 350 గ్రా సింగల్ సూపర్ ఫాస్ఫటే, 100 గ్రా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి.

కూరగాయలు 

టమాట :- పచ్చదోమ ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వలన, ఆకుల చివర్ల పసుపు పచ్చగా మరి క్రమేపి ఆకంతా ఎర్రబడి చివరిగా ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. దీని నివారణకు డై మిధోయేట్ లేదా మిధైల్ డెమటాన్ 2.0 మి.ల్లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

వంగ :- వర్షాకాలం నారును ఈ మాసంలో నాటుకోవచ్చును. నారును పికటానికి వారం రోజులు ముందు 250 గ్రా కార్బోఫ్యురాన్ గుళికలను 100 చ.మీ. నారుమడికి వేయాలి. రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరాకు 10 కిలోలు చొప్పున కార్బోఫ్యురాన్ గుళికలను నాటే ముందు వేసుకోవాలి.

బెండ :- వర్షాకాలపు పంటను ఈ మాసం వరకు విత్తుకోవచ్చు. వర్షాకాలపు పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే 7-8 రోజులకొకసారి నీరు పెట్టాలి. ఎండు తెగులు వలన గింజలు మొలకెత్తినప్పుడు మొదటి 15 రోజులు సమయంలోనే ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు మొక్కల మొదళ్ళ వద్ద కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా లీటరు నీటికి కలిపి ద్రావణాన్ని పోయాలి. వేప పిండిని ఎకరాకు 100 కిలోలు చొప్పున వేసుకోవాలి.

పందిరి కూరగాయలు :- అనప, దోస, కాకర, బీర, దొండ పంటలను కక్ మాసంలో చివరి వరకు నాటుకోవచ్చును. ఈ సమయంలో బూజు తెగులు ఆశించే అవకాశం ఉంది. మొదట్లో లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ కలిపి మొజాయిక్ వలె కనిపిస్తుంది. తర్వాత ఆకుల పై భాగాన పసుపు రంగు మచ్చలు అడుగు భాగాన ఊదా రంగు మచ్చలు, బూజు వంటి పదార్ధం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు మ్యాంకొజెబ్ 2.5 గ్రా లేదా మెటలాక్సీల్ ఎమ్. జెడ్ 2 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కరివేపాకు :- కొత్తగా మొక్కలను ఈ మాసంలో నాటుకువచ్చును. పొలుసు పురుగులు కాండంపై చేరి రసాన్ని పిలుస్తాయి మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. నివారణకు డై మిధోయేట్ 2.0 మి.ల్లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన తరువాత 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకు కోయాలి. ఆకుపచ్చ తెగులు నివారణకు 1 గ్రా కార్బండిజమ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

అల్లం :- ఈ మాసంలో ఫిల్లోస్టికా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉన్నది. ప్రారంభ దశలో ఆకులపై అండాకారంలో లేదా నిర్ణీత ఆకారంలో లేని నీటిని పీల్చుకొన్నట్లుగా ఉండే మచ్చలు ఏర్పడతాయి. తరువాత ,మచ్చల యొక్క అంచులు ముదురు గోధుమ రంగు కల్గి ఉంది మధ్య భాగము పసుపు రంగులోకి మారును. ఆకులు పెళుసుగా మరి ఎండిపోతాయి దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా చొప్పున కలిపి మొక్కలను బాగా తడిచేలా పిచికారీ చేయాలి.

డా॥ ఎమ్.వెంకటేశ్వర రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హర్టీకల్చర్,

డా॥ ఎ.నిర్మల అసిస్టెంట్ ప్రొఫెసర్
కె. చైతన్య అసిస్టెంట్ ప్రొఫెసర్
డా॥ ఎ.మనోహర్ రావు సీనియర్ ప్రొఫెసర్ అండ్ హెడ్, 

రాజేంద్రనగర్, హైదరాబాద్, Phone: 9491151524

Leave Your Comments

ఆదిలాబాద్ గిరిజనలకు గ్రామాలలో మహిళా సాధికారత

Previous article

టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావును అభినందించిన రాష్ట్ర వ్యవసాయ , సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Next article

You may also like